రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత 

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ 

Mar 30, 2026 - 21:58
Mar 30, 2026 - 21:58
 0  0
 రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత 

అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం 

నల్గొండ, 31 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-  నల్గొండ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ముఖ్య అతిథిగా హాజరై ప్రజలు మరియు వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతి వాహనదారు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించేందుకు పోలీస్ కళాబృందం మరియు చిన్నారుల నృత్యం ద్వారా ప్రత్యేక అవగాహన ప్రదర్శన నిర్వహించారు. యమధర్మరాజు వేషధారణలో కళాకారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలియజేశారు. వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. ఈ ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఎస్పీ గారు మాట్లాడుతూ, యువత అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్డు భద్రతపై సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా శిక్షార్హమని, అలాంటి చర్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.

అదేవిధంగా, వాహనదారులు తమ వాహన పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. రాబోయే రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్డు భద్రతపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి, ఎస్‌బి సిఐ రాము, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్, ఎస్సైలు, పోలీస్ కళాబృందం సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు మరియు ఇతర వాహనదారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333