రోడ్డు ప్రమాదాల నివారణలో  ప్రభుత్వాలదే కీలక బాధ్యత.*

Feb 13, 2025 - 20:32
 0  3

క్షతగాత్రులను ఆసుపత్రిలకు చేర్చడానికి  ప్రయాణికులు స్పందిస్తే  ఎన్నో మరణాలను ఆపవచ్చు.

అన్ని హంగులతో రోడ్డు, వైద్య సౌకర్యాలు మరీ ముఖ్యం.

---  వడ్డేపల్లి మల్లేశం 

అనేక కారణాల వలన జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను   మరణాలను  తగ్గించి  ప్రమాద బాధితులను ఆదుకోవడానికి  ప్రభుత్వ o తో పాటు  పోలీసు వ్యవస్థ వైద్య సిబ్బంది  ప్రయాణికులు పౌర సమాజం కూడా    బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది.  వివిధ ప్రాంతాల మధ్య రహదారులు  ప్రజల  రాకపోకలు వస్తు సామాగ్రిని  చేరవేయడానికి,  పారిశ్రామిక ప్రగతికి,  వివిధ రంగాల అభివృద్ధికి, ఆయా ప్రాంతాల  పురోగతి  ఎంతో తోడ్పడతాయి. అలాంటి రహదారులను నాణ్యతగా  దుబారా అవినీతికి ఆస్కారం లేకుండా  నిర్మాణం చేయగలిగితే  ప్రజా ధనం  వృధా కాకపోగా  ప్రమాదాల బారిన పడకుండా అడ్డుకోవడానికి కొంతవరకు ఆస్కారం ఉంటుంది. .అభివృద్ధి చెందుతున్న దేశమని ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా పేరుగాంచిన  భారతదేశ మని  గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పటికీ  అనేక ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మరీ దయనీయంగా  ఉన్నది..  ఆదివాసి గిరిజన ప్రాంతాలలో  కనీసమైన రవాణా సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో  రోగులను వృద్ధులను డోలీలలో మోస్తున్న విషయం మనకు నిత్యం కనపడుతూనే ఉంటుంది. ఇప్పటికీ అలాంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ తో సహా భారతదేశంలో అనేక చోట్ల ఉన్నాయి  అలాంటప్పుడు రవాణా సౌకర్యం  అభివృద్ధి చేయడం ద్వారా  ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం కంకణం కట్టుకోవాలి. అన్ని ప్రాంతాలకు సమగ్రమైన రోడ్లను అభివృద్ధి పరచడం ద్వారా  పాలకులు తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది.  ఎక్కువ మూలమలుపులు, వంకర, గుంతల రోడ్డు,  ఇరుకు రోడ్లు ,నాణ్యత లేని రోడ్ల కారణంగా కూడా  అనునిత్యం  వేగంగా వచ్చే వాహనాలు మద్యం mattulo???? వచ్చే డ్రైవర్ల కారణంగా కూడా ప్రమాదాలు  జరిగి  ఎంతోమంది మృత్యుపాలవుతున్నారు.  వాహనదారుల యొక్క నిర్లక్ష్యం,  మితిమీరిన వేగం,  ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కూడా  ఈ ప్రమాదాలకు రోడ్లు నెత్తురోడడానికి   కారణాలవుతున్నాయి.  ప్రమాదము జరిగిన గంట లోపల ఆసుపత్రులకు క్షతగాత్రులను చేరవేయగలిగితే  ప్రాణాపాయం నుండి తప్పించవచ్చనే  వైద్యుల సలహాను అమలు చేస్తే మంచిది.

రోడ్డు ప్రమాదాలు కొన్ని   గణాంకాలు :-

ప్రభుత్వ లెక్కల ప్రకారం గత పది సంవత్సరాల్లో   రోడ్డు ప్రమాదాల కారణంగా 15 లక్షల మందికి పైగా  మృత్యువాత పడినట్లు తెలుస్తుంటే  కేవలం ఒక్క 2023వ సంవత్సరంలోనే ఒక లక్ష డెబ్బై మూడు వేల మందిని  రోడ్డు ప్రమాదాలు పొట్టన పెట్టుకోవడం ఆందోళన కలిగించే విషయం.  రోడ్డు ప్రమాదాల పైన ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి  ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్లనే  ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు  ఆవేదన వ్యక్తం చేయడం  తీవ్ర పరిస్థితికి అడ్డం పడుతున్నది.  అయితే ఈ రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా  18 నుండి 45 సంవత్సరాల లోపు వారే ఎక్కువ శాతం  బలవుతుంటే అందులో కూడా పేద మధ్యతరగతి అట్టడుగు వర్గాల వారే  ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించాలి.  ఇంటి యజమానులను ఇలాంటి ప్రమాదాలలో కోల్పోవడం వలన అనేక  కుటుంబాలు వీధిన పడడం  లేదా రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై జీవితాంతం  లేవలేని పరిస్థితి ఉంటే వారికి జీవితాంతం చికిత్సకు  ఖర్చు పెట్టలేక ఆ కుటుంబాలు మరీ పేదరికంలోకి నెట్టివేయబడాన్ని కూడా రోడ్డు ప్రమాదాల పరిణామాలుగా మనం భావించవలసి ఉన్నది.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా రోడ్డు ప్రమాదాలలో తీవ్ర గాయాల పాలై  చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వము 1,50,000 నగదు రహిత చికిత్సను  అందించడానికి  నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.  అందుకు సంబంధించి వెంటనే మార్గదర్శకాలను జారీ చేయడంతో పాటు  సంబంధిత అధికారులు వారికి తగిన సౌకర్యం కలిగించేలా చూడాలి .  రోడ్డు ప్రమాదాలు జరిగి  రక్తపు మడుగులో కొట్టుకుంటున్నప్పటికీ కూడా ప్రయాణికులు చూస్తూ పోతున్నారే తప్ప వారి గురించి పట్టించుకోవడం లేదు అనే విమర్శ ఉంది అయితే  ఈ విషయంలో ఎవరు స్పందించిన ఆ కేసు  ఆరోపణలు వారి మీద నమోదు అవుతాయి అని  అనుమానంతో  నాకేమీ లే అని  వెళ్లిపోవడం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. సకాలంలో ఆసుపత్రికి  చేరవేస్తే ఎన్నో వేల లక్షల ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో  ఇటీవల కేంద్ర ప్రభుత్వం  ఆ రకంగా ఆసుపత్రికి చేరవేసిన వారికి అండగా ఉండడానికి సంబంధించి గుడ్డు సమ్మరీటన్ చట్టం పేరున  తెచ్చిన రక్షణ పైన మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని  సంబంధిత అధికారులు టాపిక్కు పోలీసు వైద్య సిబ్బందికి  కూడా  చేరవేయడం ద్వారా  సమాజం కూడా చైతన్యం అయ్యే అవకాశం ఉంటుంది.తద్వారా  తోటి ప్రయాణికులు వారిని బాధ్యతాయుతంగా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తారు ఇటీవల  ఆ రకంగా ప్రయత్నం చేసే వారికి నగదు పరిహారాన్ని కూడా  ప్రభుత్వం ప్రకటించినట్లుగా తెలుస్తుంటే  ఆ రకంగా నైనా ఎంతోమందిని కాపాడడానికి ఆస్కారం ఉంటుంది ఇదంతా కూడా పౌర సమాజం బాధ్యతగా వ్యవహరించినప్పుడు మాత్రమే.

రోడ్డు ప్రమాదాలను తగ్గించలేమా?

ఏ మేరకు రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగితే అంతకుమించిన స్థాయిలో మృత్యు వాత  పడకుండా చూడ్డానికి ఆస్కారం ఉంటుంది. అందుకు ప్రధానంగా రోడ్లను అన్ని రంగులతో  నిర్మించడంతోపాటు వైద్య సిబ్బంది కూడా ప్రధాన రహదారులకు అందుబాటులో ఉండే విధంగా  సంచార వైద్యశాలలను ఏర్పాటు చేయాలని  అనాదిగా ఉన్నటువంటి డిమాండ్ ను ప్రభుత్వం  సా కారం చేస్తే  మరణాలను తగ్గించవచ్చు.  అమెరికా దేశంలో రోడ్డు ప్రమాద బాధితులను గనుక పరిశీలిస్తే సగటున ప్రతి రెండు వందల మందికి  ఒకరు మాత్రమే మరణిస్తుంటే  భారతదేశంలో ప్రమాదము జరిగిన ప్రతి ఆరుగురిలో ఒకరు చనిపోతుండడాన్ని  గమనించినప్పుడు ఎంత వెనుకబాటుతనంతో  ఆరోగ్య ఇతర రక్షణ ఏర్పాట్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  వైద్యశాలలు అందుబాటులో ఉండటం సిబ్బంది ట్రామా కేర్ సెంటర్స్ నిపుణులైన వైద్యులు మందులు ఇతర పరిక  రాలు  సరిగా లేని కారణంగా కూడా  క్షతగాత్రులు తిరగవలసి వస్తుంది. హైవేల పైన ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న వేల  హైవే లకు అందుబాటులో  వైద్య  సౌకర్యాలను  కల్పించడం   కనుక ఆచరణలో సాధ్యమైతే  మృత్యుభారి నుండి అనేకమందిని కాపాడడంతో పాటు  సరైన వైద్యాన్ని అందించడం ద్వారా  రక్షించే అవకాశం ఉంటుంది.  పోలీసు ట్రాఫిక్ సిబ్బంది తక్షణమే స్పందించడం,వైద్య సిబ్బంది కూడా   నిబద్ధతగా  ప్రాణాలను కాపాడడం,  పౌర సమాజం  అందుబాటులో ఉన్నవారు సహకరించినప్పుడు మాత్రమే  రోడ్డు ప్రమాదాలు  గణనీయంగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.  ప్రపంచ స్థాయిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న దేశాలలో భారతదేశం ఒకటి కావడం ఆందోళన కలిగించే విషయం.  అందుకు పాలకులు పూర్తి బాధ్యత తీసుకోవలసినటువంటి అవసరం ఉంది రోడ్లు మరమ్మతులు చేయకపోవడం నిధులను  కేటాయించకపోవడం  నిర్లక్ష్యంతో దాటవేసే పద్ధతిలో  కొనసాగించడం వలన కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు రోడ్లను మరమ్మతి చేయించడం ద్వారా  అవసరమైన సౌకర్యాలను కల్పించడంతోపాటు  అవసరమున్న చోట సిబ్బందిని పోలీసులను ఉంచి ప్రమాదాలు జరగకుండా చూడాలి.  ట్రాఫిక్ నిబంధనలను అందరూ పాటించేలా  చర్యలు తీసుకోవడం  ట్రాఫిక్ నిబంధనల పైన  ప్రజలు,  వాహనదారులకు అవగాహన కల్పించడం కూడా  చాలా అవసరo. "నిబద్ధత నిండు ప్రాణాలను కాపాడితే నిర్లక్ష్యం  రోడ్డు మీద రక్తపు మడుగులకు  కారణమవుతుంది"  ఉమ్మడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే  అందుబాటులో ఉన్న చట్టాలను వినియోగించుకొని  తోటి ప్రయాణికులు కూడా స్పందించడం వల్ల మరణాల రేటు భారీగా తగ్గించవచ్చు.  ప్రభుత్వాలు కూడా కోట్ల రూపాయలు పెట్టి రోడ్ల నిర్మించినప్పటికీ  వాటిని నిరంతరం పర్యవేక్షించే సిబ్బందిని కూడా  ఏర్పాటు చేస్తే రోడ్లను నిరంతరం కూడా నాణ్యతా ప్రమాణాలతో  మైంటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది, దానివల్ల కూడా ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గుతుంది.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333