రైతుల సాకుతో పేదలతో చెలగాటమా?
రైతుల సాకుతో పేదలతో చెలగాటమా? భూమిలేని గ్రామీణ పట్టణ పేదలను పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా? వందల ఎకరాలకు రైతు భరోసా చెల్లిస్తే అసమానతలు పెంచినట్లు కాదా? ఇదేనా ప్రజాప్రభుత్వం?
*****************************
---వడ్డేపల్లి మల్లేశం 90142206412
---5...02...2025*************
సిద్ధాంతాలు వేరైనా ప్రజల కోసమే పని చేస్తున్నామని ఒకరి కంటే మరొకరు ఎక్కువగా వాగ్దానాలు చేస్తూ రాయితీలు ప్రకటిస్తూ ప్రలోభాలను కల్పిస్తూ చేసిన పరిపాలనను గమనిస్తే భిన్నత్వంలో ఏకత్వం లాగా సిద్ధాంతాలు అయితే వేరు కావచ్చు కానీ పాలనలో మాత్రం తేడా లేదు. ప్రతి చోటా ఆగమయ్యేది మాత్రం పేదలు సామాన్యులే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగు పరచడంతో పాటు సంపదను సృష్టించడం తద్వారా సంపదను పంపిణీ చేయడం వంటి అంశాలను పూర్తిగా విస్మరించి "బంగారు తెలంగాణ" పేరుతో సెంటిమెంటును రగిలించి తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు కొనసాగిన విధానం మనందరికీ తెలిసిందే. పేదలు, కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు, భూమిలేని పేదలు, రైతులు, రైతు కూలీలు, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఏనాడు కూడా ఏ ఒక్క పథకాన్ని ప్రకటించకుండా కేవలం రైతులు ఉన్నత వర్గాలకు మాత్రమే ప్రయోజనం జరిగిన విషయం ఆ తర్వాత క్రమంలో ఎదుర్కొంటున్నటువంటి విమర్శలు అందరికీ తెలుసు. 2016లో నాటి brs ప్రభుత్వం రైతు బంధు కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు పెట్టుబడి సాయంగా రైతులకు ఇచ్చేది రైతుబంధు అని ప్రకటించినప్పటికీ పెట్టుబడితో, సాగుతో సంబంధం లేకుండానే గుట్టలు చెట్లు రాళ్లు రప్పలు, మైనింగ్ భూములు, రోడ్ల కింద ఉన్న భూములు, వెంచర్లు ఎవరి పేరున ఉంటే వాళ్లకు ఆ నిధులను జమ చేసినది అంటే ఉన్నత వర్గాల వంత పాడినట్లే కదా! అంతేకాదు వందల ఎకరాలకు కూడా లక్షలాది రూపాయలను కట్టబెట్టి పేరుకు పేదవాడికి పెట్టుబడి సాయం అని ప్రకటిస్తే నమ్మేది ఎవరు? ఏడు సంవత్సరాలలో మొత్తం చెల్లిoచిన 70,000కోట్లలో సుమారు 28 వేల కోట్ల రూపాయలు అప్పనంగా అనవసరంగా కట్టబెట్టినట్లు మేధావులు సామాజికవేత్తలు ఆరోపణలు చేస్తూ ఉంటే ఏ ఒక్కనాడు కూడా సమాధానం ఇవ్వనటువంటి గత బిఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులు నిరుపేదలు పేదలు భూమిలేని కార్మికుల గురించి మాత్రం పట్టించుకోలేదు. " ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతుబంధు ఇచ్చినప్పుడు భూమి లేనటువంటి అనేకమంది పేదలు ప్రభుత్వ పథకాలతో మాకు ఒరిగిందేమిటి భూమి లేకపోవడమే మేం చేసిన నేరమా? అని అక్కడక్కడ ప్రశ్నించిన ఫలితం శూన్యం. ఆ ప్రశ్నలు అరణ్య రోద నలుగానే మిగిలిపోయినావి. పైగా మూడు ఎకరాల భూమి, ముఖ్యమంత్రిని దళితున్నే చేస్తానని అనేక మాయమాటలు చెప్పినప్పటికీ ప్రజల ఆశలు ఏటిలో పిసికిన చింతపండు అయిపోయినది.
ఇటీవల రైతుబంధు కు సంబంధించి కాంగ్రెస్ నాయకత్వంలో వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం చట్టసభలో2025 జనవరిలో రైతు బంధు బదులు రైతు భరోసా పేరును ప్రస్తావిస్తూ చర్చ చేసిన సందర్భంలో బి ఆర్ ఎస్ తన పాత వాదన మరువలేదు. బీజేపీ, మరికొన్ని పార్టీలు సాగు చేసిన భూములకే ఇవ్వాలని కోరినప్పటికీ ప్రభుత్వం మొండిగా సాగుకు యోగ్యమైన భూములు అన్నింటికీ ఎన్ని ఎకరాలు ఉన్నా ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం భూమి లేని వాళ్లను కౌలు రైతులను పేదలను అవమానించినట్లే! పైగా భూస్వాముల పక్షాన నిలిచినట్లే కదా! అలాంటప్పుడు అంతరాలు అసమానతలు తగ్గేదెలా? గత ప్రభుత్వం మాది రి గనే ప్రస్తుత ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజా ప్రభుత్వం పేరుతో పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు పేద వర్గాలకు లాభం జరగాలి కదా! ఆ పేదల గురించి పట్టించుకున్న పథకాలు ఏ ఒక్కటి కూడా లేకపోవడం, ప్రభుత్వము ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎప్పుడూ కూడా కేవలం రైతులకు సంబంధించి రైతు బంధు రుణమాఫీ రైతు బీమా వంటి మాటలు మాత్రమే ప్రశ్నించడం తప్ప పేదల గురించి ఆలోచించిన దాఖలా లేకపోవడం రెండు పార్టీలు ఒకటే అంటే సందేహం ఏంటి? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేనటువంటి కార్మికుల కోసం మాత్రం 12000 రూపాయలను సంవత్సరానికి ఇవ్వడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం గుడ్డిలో మెల్లగా కొంత ఆహ్వానించ తగినదే కానీ ఏడాదిలో కనీసం 20 రోజులైనా ఉపాధి హామీ పథకంలో పని చేయాలని షరతు పెట్టడం అంటే రెక్కడితే కాని డొక్కాడనటువంటి నిరుపేదలు అయినటువంటి కుటుంబ సభ్యులు కూలి పని చేసుకుని బతుకుతుంటే ఉపాది పథకంలో పని చేయకపోతే వాళ్ళు పేదలే కాదనడం వారికి రైతు ఆత్మీయ భరోసా వర్తించదని చెప్పడం పేదలను మరింత అవమానించడమే కాదు మోసగించడమే అవుతుంది. గత ప్రభుత్వం వృధా చేసిందని చట్టసభలో పెద్ద ఎత్తున చర్చించిన నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నింటికీ కూడా రైతు భరోసా చెల్లిస్తామంటే ప్రజలసొమ్ము కేవలం రైతు వర్గానికి ధారాధత్తం చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది? పేద ప్రజలను వంచిస్తే ప్రజలు ప్రశ్నిస్తారని తెలుసుకుంటే మంచిది. ప్రజా క్షేత్రంలో ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది రెండు అంశాల లోపల తమదైన శైలిలో నూతనత్వాన్ని ప్రతిపాదించి పేదవర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని ఆశించాలి కానీ తిరిగి పాత ప్రభుత్వం పద్ధతిలోనే ఉన్నత వర్గాలకు భూస్వాములకు కడుపు నింపడం అంటే వాంతులు అయ్యే వాళ్లకు తిరిగి తిరిగి అన్నం పెట్టడమే అవుతుంది. పైగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజమైన ప్రజా ప్రభుత్వమని నిబద్ధతను చాటుకోవాలంటే మిగులు భూములను గుర్తించి భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయడం ద్వారా వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని రగిలించాలి. మాటలకే పరిమితమైన బీఆర్ఎస్ తోని పోటీపడి మూడు ఎకరాల భూమి పేరుతో మోసగించిన అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రస్తుత ప్రభుత్వము పెద్ద ఎత్తున భూ పంపిణీకి శ్రీకారం చుట్టాలి. అప్పుడు మాత్రమే పేదలను కొంతవరకైనా పరిగణనలోకి తీసుకున్నట్లు లెక్క
కనిపించడం లేదా
********-----*****
గ్రామీణ పేదల తో పాటు పట్టణాలలో కూడా పేదలు నికృష్టమైన జీవితాలను అనుభవిస్తూ తమ పిల్లలను చదివించుకోలేక, చికిత్సలు చేయించుకోలేక మరి అప్పుల పాలవుతూ ఉంటే వీళ్లు రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కాదా? ఇచ్చినటువంటి హామీల మేరకు 2500 రూపాయలు మహిళకు ఇస్తామని ఇచ్చిన మాటను నెరవేరుస్తే కొన్ని కుటుంబాలకు అయినా ప్రయోజనం చేకూరేది కదా? స్వచ్ఛందంగా ఉపాధి కల్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పేదలకు రుణ సహాయాన్ని అందించి పెద్ద మొత్తంలో సబ్సిడీని ఇవ్వడం ద్వారా తమ కాళ్ళ పైన తాము నిలబడే విధంగా ప్రోత్సహించవలసినటువంటి ప్రభుత్వం ఆ వైపుగా నిధులను ఏమాత్రం కేటాయించకుండా ప్రజా ధనమంతా కేవలం రైతులకు మాత్రమే కేటాయిస్తూ రైతులే ప్రజలంటే సమాజం అంగీకరించదని తెలుసుకుంటే మంచిది. అన్ని వర్గాలను పట్టించుకోకుండా, సమతుల్యత చూపకుండా ప్రజాధనాన్ని కొద్దిమందికే కేటాయిస్తే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం అలాంటి వ్యతిరేకత వళ్ళనే కుప్పకూలిన విషయం తెలుసు. అలాంటి దుబారా, మోసం, నయవంచన పేద వర్గాలకు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఆ వైపుగా దృష్టి సారించి పేద వర్గాలకు రైతులకు న్యాయం జరగాలంటే ఐదు నుండి పది ఎకరాల మధ్యన నిర్ణయించి ఎవరైతే పంట పండిస్తారో వాళ్లకు మాత్రమే గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అదనంగా చెల్లించడం ద్వారా ప్రయోజనం కల్పిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఇక భూమిలేని పేదలకు మాత్రం ఎలాంటి షరతు లేకుండా ఇచ్చిన హామీ మేరకు ఆత్మీయభరోసా చెల్లిస్తే పేదల కష్టాన్ని గౌరవించినట్లు, శ్రమ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించినట్లు అవుతుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )