రైతుల గూర్చి ఆలోచించడం మంచిదే కానీ
వాళ్ల పేరుతో లబ్ధి పొందాలి అనుకోవడమే మూర్కత్వం.
పేదలు, కార్మికులు, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి గూర్చి మాట్లాడరే0 దుకు ?
భూమి లేనివాళ్ళకు మీరు ఒరగబెట్టింది ఏమిటి?*
--- వడ్డేపల్లి మల్లేశం
రైతుల పేరు చెప్పకుండా బ్రతికిన రాజకీయ పార్టీ అసలు లేదు అట్లనే రైతుల కోసం ఏదో మేలు చేసినట్లు ఒరగబెట్టినట్లు నటించడం అన్ని రాజకీయ పార్టీలకు రివాజ్ అయిన వేల వాటి నిబద్ధతను చిత్తశుద్ధిని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పరిశీలించవలసిన అవసరం ఉన్నది . రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే గమనించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి చేయకపోగా రైతుబంధు పేరుతో ఎక్కువగా మేలు చేసింది పెద్ద భూస్వాములకేనని అర్థమవుతున్నది . అంతేకాదు ఆ ప్రభుత్వ హయాములో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిత్యం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడ్డ విధానం మనందరికీ తెలుసు . కేంద్రం మేము కొనదల్చుకోలేదని ఒకసారి ప్రతి గింజ కొంటామని ఒకసారి వాదనలు వినిపిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం నిత్యం ఘర్షణ పడి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అప్పుడున్న ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తే కొనుగోలు చేయనటువంటి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అధికారానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్యారంటేలు, హామీలపై నిలదీయడంతో పాటు సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో దొడ్డువడ్లకు గూడ ఇవ్వాలని డిమాండ్ చేయడం అంటే తను అమలు చేయకుండా ఇతర ప్రభుత్వాలను డిమాండ్ చేసే అర్హత ఎక్కడిది? అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది . రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి రైతులు కార్మికులతో సహా ఉద్యోగులు అన్ని వర్గాలను కూడా నిర్వీర్యం చేయడంతో పాటు పెట్టుబడిదారులు భూస్వాములు ఉన్నత వర్గాల కోసం మాత్రమే పని చేసినటువంటి టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలినాళ్లలోనే డిమాండ్ చేయడం అంటే ఓటమిని దాటవేసే ధోరణిగా మనం భావించవలసి ఉంటుంది. అదే సందర్భంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మాట ఇచ్చి ఆ వైపు కన్నెత్తి చూడనటువంటి బిజెపి రాష్ట్రంలో మాత్రం ఇచ్చిన గ్యారెంటీలు గారడీలు అని వెకిలి మాటలు మాట్లాడడం, సన్నబడ్లతో పాటు దొడ్డు వడ్లకు గూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయడం అంటే హక్కుల కోసం డిమాండ్ చేయడమే కానీ బాధ్యతలకు పాకులాడకపోవడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు . టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వ పక్షాన కొనుగోలు చేయడానికి పడరాని పాట్లుబడి నిత్యం ఘర్షణ పడ్డ విషయం బిజెపికి తెలియదా ? గతంలో వడ్లు కొనుగోలు చేసిన సందర్భంలో నెలల తరబడిగా డబ్బుల కోసం రైతులు తిరిగిన విషయం మనకు తెలుసు కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతోపాటు చివరి గింజ వరకు, మొలకెత్తిన తడిసిన ధాన్యాన్ని కూడా కనీసం మద్దతు ధరకే కొంటామని స్పష్టమైన ప్రకటన చేస్తున్న కూడా అంగీకరించక ఆమోదించక ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే రైతుల పేరు చెప్పి రాజకీయం చేయడం కాక మరేం అవుతుంది?
బిజెపి బీఆర్ఎస్ రెండు రాజకీయ పార్టీలు కూడా గతంలో తమ పాలనా పరిధిలో రైతులు ప్రజలు కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు ఇతర సామాన్య ప్రజానీకానికి కూడా ఏ రకమైన ప్రయోజనాన్ని కలిగించకపోగా ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తన విధానపరమైన ప్రకటన చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా గ్యారంటీలు హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయడం అంటే తమ ఓటమిని అంగీకరించడమే కాదు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా ప్రజల పక్షాన పని చేయకుండా గంద ర గోల పరచడమే అవుతుంది .ఆ రకమైనటువంటి అధికారం ఈ పార్టీలకు ఎవరు ఇచ్చినారు? తమ హక్కులకోసం పోరాడటానికి నిర్ణయించుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న ప్రజలు రైతాంగం ........కానీ వాళ్ల పేరు చెప్పి పబ్బం గడుపుకునే సందర్భంలో కేవలం రైతుల గురించి మాత్రమే కాదు ఇతర పాలనాపరమైన అంశాల గురించి కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. రైతులకు సంబంధించి లక్షలాది రూపాయల రుణమాఫీ రైతుబంధు రైతు భరోసా పేరుతో కోట్లాది రూపాయలను జమ చేస్తున్న సందర్భం మనకు తెలుసు . ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ రకమైన రాయితీలు ఇస్తే పెద్ద అభ్యంతరం లేదు కానీ పెట్టుబడిదారులు భూస్వాములకు కూడా రుణమాఫీ చేయడం,పండని భూములకు రైతు భరోసా ఇవ్వడంతో పాటు భూమిలేని కార్మికులు చేతివృత్తుల వాళ్ళు చిరు వ్యాపారులు రెక్కాడితె కానీ డొక్కాడనటువంటి నిరుపేదలకు ప్రభుత్వం ఏం చేసింది అనే ఆలోచన ఈ రాజకీయ పార్టీలకు ఉండవలసిన అవసరం లేదా? రైతుల గూర్చి మాత్రమే కాదు కార్మికులు పేదల గురించి కూడా ఆలోచించవలసినటువంటి రాజకీయ పార్టీలు ఏనాడు కూడా వాళ్ళ ప్రస్తావన చేయకుండా రైతు పేరు చెబితే తమ ఉనికి ఉంటుందని లేకుంటే ప్రజల్లో గుర్తింపు ఉండద నే భయంతోనే ఈ రాజకీయ పార్టీలు రైతులను వాడుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. విద్యా వైద్యం సామాజిక న్యాయాన్ని ఉచితంగా అందించవలసిన దేశంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇప్పటివరకు అమలు చేయలేదు కనీసం హామీగా ప్రకటించలేదు . ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆ విషయంలో డిమాండ్ చేసి విద్య వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాలని కోరితే తప్పులేదు కానీ ఎంతసేపు రైతుల గురించి మాత్రమే మాట్లాడితే ఆత్మహత్యలు చేసుకుంటూ జీవితాలు చాలిస్తున్నటువంటి పేదవర్గాలు తమ కొనుగోలు శక్తిని భారీగా కోల్పోయి దిక్కులేని పరిస్థితిలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే అల్పాదాయ వర్గాల గూర్చి ఆలోచించవలసిన బాధ్యత ఈ రాజకీయ పార్టీలకు లేదా అని ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తుంటే మౌనంగా ఉండడం తమ ఓటమిని తామే అంగీకరించినట్లు. ఇప్పటికైనా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే కోణంలో పూర్తి కాలాన్ని ఇవ్వడంతో పాటు సహకరించి నిర్మాణాత్మక సూచనలు చేయడం వైపు దృష్టి సారించాలి కానీ ఇప్పటికీ ఆరు మాసాలుగా అదే విమర్శ చేస్తూ కేవలం గ్యారంటీలు రైతుల గూర్చి మాట్లాడినంత మాత్రాన పేద ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. పైగా విమర్శిస్తున్న ఆ రాజకీయ పార్టీలు ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే మంచిది ఇచ్చిన హామీలను అమలు చేయలేనటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలు ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అంటే అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి లేదు. ఈ రాష్ట్రంలో రైతులు సామాన్య ప్రజలు పేద వర్గాల గురించి ప్రశ్నించడానికి రైతులు పేదలు ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయి వాళ్ల కోణంలో వాళ్ళు పనిచేస్తున్నారు కానీ లబ్ధి కోసం మాత్రమే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ పత్రికల్లో పతాక శీర్షికన కనబడాలని ప్రయత్నిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి తగిన సూచనలు చేసి ప్రజల భాగస్వాములను చేయడం ద్వారా ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవాలి తద్వారా ప్రజల డిమాండ్లను పరిష్కరించుకోవడం అది ప్రజాస్వామ్యత దృక్పథం. కూట్లో రాయితీయ ని వాడు ఏట్లో రాయి థీ సినట్లుగా చెప్పుకునే విధానానికి ప్రతిరూపమైన బిజెపి టిఆర్ఎస్ పార్టీలు ఒక్కసారి తాము తప్పిన, విస్మరించిన , ప్రజలకు ద్రోహం చేసిన హామీల గురించి ఆలోచించుకుంటే మంచిది . ప్రజలకు మీరు చేసిన ద్రోహానికి తగిన మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితులు ఆసన్నమైన వేల కొత్త ప్రభుత్వానికి గడువు ఇవ్వడం ద్వారా ప్రజల డిమాండ్లను పరిష్కరించుకునే సభ్యత యోగ్యత విజ్ఞత ప్రతిపక్షాలకు ఉండవలసిన అవసరం ఉన్నది. ఆ చారిత్రక బాధ్యతను ఇకనైనా నిర్వహిస్తారని ఆశిద్దాం.
( వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )