రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలి
ఏకరూప దుస్తులను సకాలంలో కుట్టించి విద్యార్థులకు అందజేయాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.
జోగులాంబ గద్వాల 24 జూలై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లాలోని ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో ఆరుతడి పంటలపై దృష్టి సారించేలా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
శుక్రవారం ఏకరూప దుస్తులు, వర్షపాతం, వ్యవసాయ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాదు నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు ఏకరూప దుస్తులను ఆగస్టు 15లోగా అందించేలా నిబంధనల ప్రకారం కుట్టించాలన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ఆయా జిల్లాల్లో పంటల సాగుపై సమీక్షించారు. ఈనెల 27వ తేదీ నుంచి 29 వరకు మండలాల వారీగా రైతులు సద్వినియోగం చేసుకునేలా విత్తన మేళాలను నిర్వహించాలని ఆదేశించారు.
గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వీసీ అనంతరం మాట్లాడారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో యూనిఫామ్స్ కుట్టిస్తున్నందున అవసరమైన సామాగ్రిని వారికి అందజేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టిచ్చింగ్ ఉండాలని ఆదేశించారు. ఆయా మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య, వారికి కావాల్సిన ఏకరూప దుస్తుల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్ పామ్ పంటల సాగు పెరిగేలా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కలిగించాలన్నారు. భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో భవిష్యత్తులో తాగునీటి సమస్యలు ఉత్పన్నమవ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా శాఖలలోని వివిధ అంశాలకు సంబంధించి మండల, గ్రామస్థాయి యాక్షన్ ప్లాన్లను రూపొందించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఈవో విజయలక్ష్మి, డిపిఓ శ్రీకాంత్,
డిఆర్డిఓ ముషాహిదా బేగం,
డిఏఓ వీరప్ప, సిపిఓ పాపయ్య, డిడబ్ల్యుఓ సునంద, ఇతర అధికారులు పాల్గొన్నారు.