రైతన్నకు అండగా రైతు భరోసా... జిల్లాలో రూ.318.42 కోట్ల నిధుల జమ 

Jul 11, 2026 - 20:36
 0  1
రైతన్నకు అండగా రైతు భరోసా... జిల్లాలో రూ.318.42 కోట్ల నిధుల జమ 

 1.78 లక్షల మంది  రైతుల ఖాతాల్లో రైతు భరోసా

 రైతు భరోసా నిధులను ఇతర బకాయిలకు సర్దుబాటు చేయొద్దు: బ్యాంకులకు జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశం

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు రైతులకు సాగు పెట్టుబడికి అవసరమైన ఆర్థిక తోడ్పాటును సకాలంలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద జిల్లాలో అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో నిధుల జమ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. రైతులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగు పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం విడతల వారీగా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు.

జిల్లాలో మొత్తం 1,78,828 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.318.42 కోట్ల రైతు భరోసా నిధులను జమ చేయడం ద్వారా పంపిణీ ప్రక్రియను పూర్తిచేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకింగ్ శాఖల సమన్వయంతో పారదర్శకంగా, వేగవంతంగా నిధుల పంపిణీ నిర్వహించినట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు భరోసా, రైతు బీమా, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, సాగునీటి సౌకర్యాల కల్పన తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సాగు పెట్టుబడిపై ఆర్థిక భరోసా కల్పించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో జమయ్యే నిధులను బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ బకాయిలు, సేవా ఛార్జీలు లేదా ఇతర బకాయిల పేరుతో నిలుపుదల చేయడం, డెబిట్ చేయడం లేదా సర్దుబాటు చేయరాదని జిల్లా కలెక్టర్ అంకిత్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రైతుల సాగు పెట్టుబడి కోసం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం పూర్తి మొత్తంలో రైతుల వినియోగానికి అందుబాటులో ఉండేలా అన్ని బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు భరోసా నిధులపై ఎలాంటి అనధికారిక కోతలు విధించకుండా ప్రభుత్వం జమ చేసిన మొత్తాన్ని రైతులకు పూర్తిగా అందేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333