రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందజేయాలి 

Apr 7, 2026 - 19:59
Apr 7, 2026 - 20:01
 0  3
రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందజేయాలి 
రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందజేయాలి 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి.

ఉండవెల్లి పర్యటనలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

జోగులాంబ గద్వాల 7ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రజలకు రెవెన్యూ సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉండవెల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా, నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రిజిస్ట్రేషన్ మరియు ఈ-కేవైసీ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సర్టిఫికెట్లను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన జారీ చేయాలని తెలిపారు. ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తును బాధ్యతగా తీసుకొని, సమయానికి వాటిని పరిష్కరించాలన్నారు. సెన్సస్ కార్యకలాపాలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం వచ్చిన పదవ తరగతి విద్యార్థినితో కలెక్టర్ మాట్లాడి, ఆమె వివరాలను తెలుసుకుని, సర్టిఫికెట్‌లను త్వరితగతిన జారీ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అలాగే నూతనంగా నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి, నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

అలాగే ఉండవెల్లిలోని నిర్మాణంలో ఉన్న పలు ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని, గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడి ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. ఉపాధి హామీ పనులను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకునేలా కూలీల సంఖ్యను పెంచాలని, కూలీలకు ఎప్పటికప్పుడు వంద శాతం చెల్లింపులు జరిగేలా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ ధరణిషా,ఎంపీడీవో తిరుపతయ్య, ఇతర అధికారులు రెవెన్యూ సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State