రాజోలి గ్రామ సమస్యలపై ఎంపీ డీకే అరుణను కలిసి వినతి పత్రం అందజేసిన ఉపసర్పంచ్
జోగులాంబ గద్వాల 14 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : రాజోలి. మండలంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ రాజోలి గ్రామ ఉపసర్పంచ్ సంధ్య శ్రీరామ్ రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మను గద్వాల్ లో కలిసి వినతిపత్రం అందజేశారు.
రాజోలి మండల శివారులో నిర్మాణమవుతున్న భారత్‌మాల జాతీయ రహదారికి సంబంధించి మండల ప్రజలకు అనుకూలంగా ఉండేలా సరైన ఎంట్రన్స్, ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేయాలని ఎంపీని కోరారు.రహదారి నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానిక ప్రజలు, రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వివరించారు. ప్రస్తుతం సర్వీస్ రోడ్ లో ఉన్న ఎర్రమట్టిని సైతం తొలగించి రైతులు పొలం పనులకు వెళ్ళుటకు అసౌకర్యంగా ఉండడంతో చాలా ఇబ్బందులు గురవుతున్నారని, సర్వీస్ రోడ్లను ఎర్రమట్టితో ఏర్పాటుచేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని ప్రత్యేకంగా వివరించారు. అదేవిధంగా రాజోలి మండల కేంద్రంలో గత కొన్ని దశాబ్దాలుగా ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్న పోస్ట్ ఆఫీస్‌కు సొంత భవనం మంజూరు చేసి నిర్మించాలని కోరారు. ప్రజలకు మరింత మెరుగైన పోస్టల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి నూతన కార్యాలయ భవనం అవసరమని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణం లేక యువత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్రీడా ప్రాంగణం అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తే యువతకు అన్ని రకాల క్రీడా సౌకర్యాలు కల్పించి, రాజోలికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తామని వివరించారు.రాజోలి మండల అభివృద్ధికి సంబంధించిన ఈ మూడు ప్రధాన అంశాలపై ఎంపీ డీకే అరుణకు వినతిపత్రాలు అందజేసి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరినట్లు ఉపసర్పంచ్ సంధ్య శ్రీరామ్ రెడ్డి తెలిపారు. స్పందించిన ఎంపీ డీకే అరుణ రాజోలి మండల సమస్యలపై సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడుతూ, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. రాజోలి సమస్యలను తమ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అధికారులను ఆదేశించడం సంతోషకరమని, మా తరఫున రాజోలి గ్రామ ప్రజల తరఫున అరుణమ్మ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంటూ తమ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా నాయకులు ఐజ రామచంద్రారెడ్డి, తుమ్మలపల్లె సంఘాల సంజీవరెడ్డి, యువ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ మోచి హుస్సేన్, మాజీ కో ఆప్షన్ సభ్యులు సత్తార్, రషీద్, మరియు సిరిసాల మధు, గోవర్ధన్ రెడ్డి, లీల ప్రసాద్ , సోమశేఖర్ రెడ్డి,రైతులు తదితరులు ఉన్నారు.