మురుగునీటికి శాశ్వత పరిష్కారం ఏదీ
స్లాబ్‌లు వేసి చేతులు దులుపుకోవడం కాదు.. డ్రైనేజీని పూర్తిగా శుభ్రం చేసి నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వార్డు ప్రజల విజ్ఞప్తి:----
జోగులాంబ గద్వాల 24 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల పట్టణంలోని ధరూర్‌మెట్టు వీధి, 10వ వార్డులో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. రోడ్డు సమీపంలోని డ్రైనేజీ కాలువలో మురుగునీరు నిలిచిపోవడంతో దుర్గంధం వెదజల్లుతుండగా, దోమల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై గతంలో పలుమార్లు స్థానికులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని వారు వాపోతున్నారు. గత మున్సిపల్ ఎన్నికలకు ముందు డ్రైనేజీ కాలువ నిర్మాణానికి గద్వాల ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశించారు. అయితే కాలువపై రెండు చోట్ల స్లాబ్‌లు ఏర్పాటు చేయడంతోనే పనులు పూర్తయినట్లు కనిపిస్తోందని, అసలు సమస్య అయిన కాలువలో పేరుకుపోయిన మురుగునీరు, పూడిక తొలగింపు మాత్రం జరగలేదని స్థానికులు అంటున్నారు.
కాలువలో గతంలో పేరుకుపోయిన మురుగునీరు, పూడిక కారణంగా ప్రస్తుతం పైభాగంలో మాత్రమే నీరు ప్రవహిస్తూ, అడుగుభాగంలో మురుగు పేరుకుపోతుందని ప్రజలు చెబుతున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వ్యాపించడంతో పాటు దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు వస్తే పరిస్థితి మరింత దారుణం
ప్రస్తుతం కాలువలోనే మురుగునీరు నిలిచిపోవడంతో పరిస్థితి ఇలా ఉంటే, వర్షాకాలంలో మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీటితో పాటు మురుగునీరు రోడ్లపైకి చేరితే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
దోమల పెరుగుదలతో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సమస్య తీవ్రమయ్యే వరకు వేచి చూడకుండా అధికారులు ఇప్పుడే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జేసీబీతో పూడిక తొలగించి.. శాశ్వత పరిష్కారం చూపాలి
డ్రైనేజీ కాలువలో సంవత్సరాలుగా పేరుకుపోయిన పూడిక, మురుగును జేసీబీ ద్వారా పూర్తిగా తొలగించి కాలువను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు. పై ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు, వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా నిరంతరాయంగా వెళ్లేలా కాలువను పునరుద్ధరించాలని అంటున్నారు.
కేవలం కాలువపై స్లాబ్‌లు వేసి పనులు పూర్తయ్యాయని భావించకుండా, అసలు సమస్యకు పరిష్కారం
చూపాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉండకుండా, దుర్గంధం రాకుండా, దోమల బెడద లేకుండా కాలువను పూర్తిస్థాయిలో శుభ్రం చేసి అవసరమైన చోట కాలువ నిర్మాణాన్ని సరిచేయాలని కోరుతున్నారు.
కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలి
ధరూర్‌మెట్టు 10వ వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని వార్డు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి, కాలువలో పేరుకుపోయిన మురుగును జేసీబీతో తొలగించి శుభ్రం చేయించడంతో పాటు భవిష్యత్తులో మురుగునీరు, వర్షపు నీరు నిల్వ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
స్లాబ్‌లు వేయడం మాత్రమే కాదు.. ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలి. ప్రజల ఆరోగ్యం, రాకపోకలు దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ధరూర్‌మెట్టు వీధి ప్రజలు కోరుతున్నారు.