మానవ మేధస్సుకు సవాల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ AI
ఏఐ తో కొన్ని లాభాలు.. మరిన్ని నష్టాలు...!
కృత్రిమ మేధ... అందరికీ కానుందా బాధ.. అన్ని దేశాలకు ఈ టెక్నాలజీ రాదా...!
మందగించనున్న మెదడు... సన్నగిల్లనున్న మానవ ఆలోచన శక్తి... కోట్లాది ఉద్యోగాలు ఊడిపోనున్నాయా...?
✍️ డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ జర్నలిస్ట్, హ్యూమనిస్ట్.
మానవజాతి ఆవిర్భావం జరిగిన తొలినాళ్లలో అనాగరికుడిగా, వస్త్రాలు కనిపెట్టని రోజుల్లో ఎలాంటి అచ్చా ధన లేకుండా నగ్నంగా, చదువు అనేది లేకుండా రాత, కూత లేని మాటలు రాని, మాట్లాడలేని అనాగరిక కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు మానవ జీవితం ఎన్నో అద్భుతమైన మార్పులకు పునాదిగా నిలిచింది. ఒక ఆటవికుడిగా సొంత ఇల్లు గాని, కుటుంబం గానీ వస్త్రధారణ గాని, మాటలు గాని లేకుండా కేవలం సైగలు చేసుకుంటూ, వంట కూడా నేర్చుకోకుండా అడవిలో దొరికిన ఆకులు, అలములు, దుంపగడ్డలు తింటూ అవసరమైనప్పుడు జంతువులని వేటాడి పచ్చి మాంసం తింటూ ఉన్న ఒక మూగమనిషి, మౌన ఋషి నేడు అదే స్థాయిలో విజ్ఞానాన్ని సంపాదించి, మేధోశక్తిని పెంపొందించుకొని అన్ని రకాలుగా తనకు కావలసిన ఆధునిక యంత్రాలను కనిపెట్టి, నూతన శాస్త్ర సాంకేతిక రంగం నుంచి డిజిటల్ యుగం వరకు మానవ మేధస్సు పరంపర కొనసాగుతూనే ఉంది.
అయితే ఈ 21వ శతాబ్దంలో మానవ మేధస్సుకు ఒక సవాలుగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ) నిలిచింది, మానవ మెదడును కూడా గెలుస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రోబో టెక్నాలజీని పెంపొందించుకుంటున్న ప్రపంచ దేశాలు ఏఐని విరివిగా ఉపయోగిస్తూ దేశాభివృద్ధిలో భాగం చేస్తున్నాయి. దీంతో విజ్ఞానం బాగా సంపాదించామని సంబరపడి పోవాలా, మానవ మేధకు పని లేకుండా మెదడు ఆలోచన శక్తి తగ్గిపోయి మొద్దు బారే ఏఐ చర్యలకు తలదించుకోవాలా అన్న సందిగ్ధ పరిస్థితుల్లో నేటి ఆధునిక మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు.
మనిషి చేయాల్సింది, చెప్పాల్సింది ఎంతో ఉన్నప్పటికీ నేడు యంత్రాల మీద, టెక్నాలజీ మీద ఆధారపడుతూ జీవితాన్ని గడపడం అనేది మానవ సంబంధాలకు ఒక క్షీణతగా చెప్పుకోవచ్చు. మనిషిని మనిషి పలకరించుకునే రోజు పోయి యంత్రాల భాషలో మాట్లాడే విధంగా మనిషి నిమిత్తమాత్రుడిగా మిగలాల్చి వస్తుందేమో అన్న సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు గాను ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఏ ఐ సదస్సు మరిన్ని ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలకు వేదికగా నిలిచింది.
ఏఐ అంటే ఏమిటి... దీని కథ కమామిషు ఏలాంటిది
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) అనేది మానవ మేధస్సును అనుకరించే యంత్రాల సామర్థ్యం గా చెప్పుకోవచ్చు.ఇది కంప్యూటర్ సైన్స్కు ఒక శాఖ, ఇది మానవుల లాగా ఆలోచించే, నేర్చుకునే యంత్రాలను సృష్టించడంపై దృష్టి పెడుతుందని ఏ ఐ ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. అయితే ఏఐ ల కూడా మూడు రకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.1.నారో ఏఐ, ఇది ఒక నిర్దిష్ట పనిని చేయడానికి రూపొందించబడిన ఏఐ.2. జనరల్ ఏఐ, ఇది మానవుల లాగా ఆలోచించే, నేర్చుకునే ఏఐ.3. సూపర్ ఇంటిలిజెన్స్, ఇది మానవ మేధస్సును మించిన ఏఐ అయితే ఏఐ తో ఉపయోగాలు ఉన్నట్లు పలు రకాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అవి కింది విధంగా ఉన్నాయి.
- వర్చువల్ అసిస్టెంట్స్: సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్,
- ఇమేజ్ రెకొగ్నిషన్. ఫేస్‌బుక్, గూగుల్ ఫోటోస్,
- నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్: గూగుల్ ట్రాన్స్‌లేట్, చాట్‌బాట్స్,
- సెల్ఫ్-డ్రైవింగ్ కార్స్*: టెస్లా, వేవ్మో, 5
- హెల్త్‌కేర్డ యాగ్నోస్టిక్స్, ట్రీట్‌మెంట్ రికమెండేషన్స్ ఉపయోగాల విభాగం కిందికి వస్తాయి.
ఏఐ ఏ ఉపయోగిస్తే అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా1. *ఎఫిషియన్సీ*: పనులు త్వరగా, ఖచ్చితంగా చేయడం,2. ఆవిష్కరణ*: కొత్త ఉత్పత్తులు మరియు సేవల సృష్టి,3. *సేఫ్టీ*: ప్రమాదకరమైన పనులను చేయడం,4.పర్సనలైజేషన్*: వ్యక్తిగతఅవసరాలకు అనుగుణంగా సేవలు త్వరితంగా అందుకోవచ్చు.
ఏ ఐ తో నష్టాలకు అపారం... తప్పదు కార్పొరేట్ కంపెనీలకు వ్యాపారం...!
ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని రంగాల్లో ఇటీవల జెట్ స్పీడ్ తో ఏఐ దూసుకుపోతుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమో కానీ నష్టాలు మాత్రం మానవజాతికి తప్పేలా లేదు. ముఖ్యంగా నేడు మనుషులు చేస్తున్న అన్ని ఉద్యోగాలు కూడా త్వరలో ఏఐ టెక్నాలజీ ద్వారా యంత్రాలు చేయాల్సిరావడంతో వందల మంది చేసే పనిని ఒకటి రెండు యంత్రాలతోనే పూర్తి చేయడం అనేది మానవ జీవితానికి పెను సవాల్ గా మారుతుంది. ఏఐ వలన నష్టాలు ఈ కింది విధంగా చెప్పుకోవచ్చు.
1. జాబ్ డిస్ప్లేస్‌మెంట్*: యంత్రాలుమానవుల ఉద్యోగాలను తీసుకోవడం,
2. బయాస్*: ఏఐ సిస్టమ్‌లలో బయాస్ ఉండడం,
3. ప్రైవసీ*: వ్యక్తిగత డేటా సేకరణ, ఉపయోగం
4. సేఫ్టీ*: ఏఐ సిస్టమ్‌ల భద్రత ఇలాంటి సవాళ్లు ఏఐ వలన సంభవించనున్నాయి.
ఏఐ భవిష్యత్తు... ఎలా ఉంటుందో అంతా కనికట్టు..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తో ప్రపంచంలో పలు రంగాలలో ఎన్నో విప్లవాత్మక మార్పులను సంతరించుకునే అవకాశం ఉంది.
ఏఐ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుందని, ఇది వివిధ రంగాలలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురాగలదని, అయితే, ఏఐ సవాళ్లను పరిష్కరించడం, ప్రయోజనాలను పొందడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.
ఏ ఐ ప్రభావం భారత్ పై ఏ విధంగా ఉండనుంది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేడు భారతదేశాన్ని ఒక కుదుపు కుదుపుతుంది. సుమారు 150 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారతదేశం మానవ వనరులపై ఆధారపడింది. కోట్ల మందికి ఉద్యోగాలు ఉన్నప్పటికీ అంతకంటే రెట్టింపు స్థాయిలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లల్లాడుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగం ఎక్కువై నైపుణ్యం గల భారత యువత భారత్ లో సరైన అవకాశాలు లేక రాక ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఏఐ ప్రవేశిస్తే ఉన్న ఉద్యోగాలు కూడా ఊడి రోడ్డున పడే అవకాశాలు భారతీయ యువతలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు లక్షలాది ఉద్యోగులను తొలగిస్తున్నారు. అందులోనూ భారతదేశంలో ఏ ఐ టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చేయడానికి మరొక కారణం ఇక్కడ నీరు సమృద్ధిగా, చవకగా లభిస్తుంది. దీనికి తోడు చాలా తక్కువ జీతాలకు పనిచేసే మనుషులు అధికంగా ఉంటారు. ఇక్కడ భారతీయ వనరులన్నీ ప్రపంచ దేశాలకు చాలా చవక. ఇన్ని రకాలుగా భారతదేశంలో సకల సౌకర్యాలు సమృద్ధిగా, చవకగా లభిస్తుంటే ప్రపంచ దేశాలు చూపు భారతదేశ వైపు ఉండకుండా ఎలా ఉంటుంది.
చైనాలో విద్యకు సగటున ఎనిమిది వందల బిలియన్ డాలర్లు కేటాయిస్తే, భారతదేశంలో సగటున 12 బిలియన్ డాలర్లు కేటాయించడం శోచనియం*
జనాభాలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్న చైనా టెక్నాలజీ విషయంలో కూడా అంతే స్పీడ్ తో దూసుకుపోతుంది. చైనా టెక్నాలజీని అందుకోవాలంటే అగ్రరాజ్యం, సామ్రాజ్య వాదానికి తొలి గురువు అయిన అమెరికా కూడా వెనకంజలోనే ఉందంటే ఆశ్చర్య వేయకమానదు. ఇంకా విద్యపై భారతదేశం కేటాయించిన బడ్జెట్ చాలా తక్కువగా చెప్పుకోవచ్చు. చైనా విద్యాభివృద్ధికి 800 బిలియన్ డాలర్లు కేటాయిస్తే భారతదేశం 12 బిలియన్ డాలర్లు మాత్రమే కేటాయిస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలే వివరిస్తున్నాయి.
ఇంకా మూఢనమ్మకాలు అంటూ కులం,మతం, దేవుడు, దెయ్యం, వర్గం, వర్ణం, జాతి విభేదాలు అంటూ భారతీయ మెదళ్లలో అనాగరిక కాలం నాటి విషాన్ని నింపుతూ భారత రాజ్యాంగంలో చెప్పినట్టు సైంటిఫిక్ టెంపర్ ను పెంచకుండా టెక్నాలజీకి దూరంగా ఎన్నాళ్లు ఇంకా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కాకుండా చెందుతున్న దేశం గానే ఉండాల్నా అని మేధావి వర్గం ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా అన్ని రకాలుగా ఉచిత పథకాలను తీసివేయాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. కేవలం విద్య, వైద్యం,న్యాయం ప్రతి మనిషికి ఉచితంగా అందించిన రోజు, విద్యపై అత్యధిక బడ్జెట్ను కేటాయించి నూరు శాతం అక్షరాస్యత సాధించిన రోజు, శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోయి ప్రతి మనిషి కూడా శాస్త్రీయ విద్యా విధానానికి అలవాటు పడ్డ రోజు ఈ దేశం బాగుపడుతుంది తప్పించి ఇంకా ఎన్ని ఏఐ లు వచ్చినా మన వెనుకబాటు తరాన్ని మార్చలేవు, మార్పు రాదు.
ఇప్పటికైనా పాలకవర్గాలు మంచి బుద్ధిని కలిగి ఉండాలని, ముఖ్యంగా విద్యకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని, ప్రతి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలని, ప్రతి మనిషిలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని, శాస్త్రీయ ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలని, కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తే అన్ని దేశాలు వ్యాక్సిన్ ఉపయోగిస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి మన దేశపు వేడికి కరోనా రాదని, పారాసిటమాల్ వేసుకుంటే చాలని చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి మనదేశంలో కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి ఇంట్లో కంచాలు పళ్లెంలు, గంటలు మోగించి కరోనాని పారద్రోలాలనే అశాస్త్రీయ ఆలోచనలు మరోసారి దేశంలో చేపట్టకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశ కూడా ఎదగాలని, ఇందుకు ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా సైంటిఫిక్ టెంపర్ ను పెంపొందించుకోవాలని మనమూ కోరుకుందాం.