మహిళా, బాలల రక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలి: జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
* మహిళా, బాలల పట్ల వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
* బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.
* పరిధితో సంబంధం లేకుండా కేసులు నమోదు చేసి తక్షణమే స్పందించాలి.
....సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు.
మహిళలు, బాలల భద్రత మరియు రక్షణకు అన్ని ప్రభుత్వ సంక్షేమ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ భరోసా టీమ్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని పోలీస్ అధికారులు, శిశు సంక్షేమ శాఖ, మహిళా సంక్షేమ శాఖ, జిల్లా చైల్డ్ లైన్ మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులతో ఎస్పీ గారు ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ మహిళా, బాల బాధితుల పట్ల అధికారులు మానవతాదృక్పథంతో వ్యవహరించాలి. మహిళలు, బాలలపై దాడులు, వేధింపులు, లైంగిక దాడుల వంటి ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి బాధితులకు నైతిక అండగా నిలవాలి, వారిలో భరోసా, ధైర్యం కల్పించాలి అన్నారు. పోలీస్ భరోసా సెంటర్ సిబ్బంది ఎల్లప్పుడూ బాధితుల పక్షాన నిలబడి, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆదేశించారు. ఇలాంటి కేసుల దర్యాప్తులో భాగంగా వాంగ్మూలాలు, సాక్ష్యాలను నమోదు చేయడంలో ఆధునిక శాస్త్ర సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్టు అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ బాధితులకు త్వరగా న్యాయం అందేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులు ఏ పోలీస్ స్టేషన్‌కు వచ్చినా, స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా (Zero FIR) తక్షణమే కేసులు నమోదు చేసి, వారికి తగిన రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను తెలిపినారు. మహిళలు, బాలల రక్షణలో నిర్లక్ష్యం వహించకుండా, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
మహిళలు బాలల పట్ల వేధింపులు జరిగినట్లయితే డయల్ 100, 112, హెల్ప్ లైన్ నెంబర్ 1098 కు సమాచారం ఇవ్వాలి, పిర్యాదులు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రమణారావు, జిల్లా జువెనల్ ప్రోహిబిషన్ అధికారి, డిసిపిఓ రవి కుమార్ ఇతర అధికారులు చైతన్య, బిక్షం, పోలీస్ భరోసా సెంటర్ మహిళా ఎస్ఐ మౌనిక, ఏఎస్ఐ సైదాబి, చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ అధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.