మహిళల సమస్యలు ఒక దినానికి మాత్రమే పరిమితం కారాదు

Mar 19, 2026 - 06:52
 0  0

మహిళల సమస్యలు ఒక దినానికి మాత్రమే పరిమితం కారాదు.

సమాజంలో  వారి పాత్ర,  పరిణామాలు, సామాజిక, కుటుంబ సంబంధాలలో పగుళ్ళు,  

అంతిమంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి  తోడ్పాటు   నిరంతరం   ప్రజల నోళ్ళల్లో నానాలి.

సమాజంలో సగభాగమైన స్త్రీలు  పోషిస్తున్న పాత్ర, ఆర్థిక సామాజిక రంగాలకు  చేయూత, అప్పుడప్పుడు  కుటుంబ సామాజిక బంధాల్లో ఏర్పడుతున్న పగుళ్లు,  టీవీ సినిమాలు సీరియల్ల ప్రభావంతో  సంకుచిక స్వభావం మరింతగా  చోటు చేసుకోవడం వంటి అంశాల కారణంగా  కుటుంబ బంధాలు దిగజారుతున్న విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి.  ప్రధానంగా ప్రపంచంలోనే కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న దేశాలలో  అగ్రగామిగా ఉన్న భారతదేశంలో  ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడానికి  అది ఒక ప్రధాన కారణమని ఆర్థిక సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  అయినప్పటికీ  ప్రపంచ స్థాయిలో వస్తున్న ఆధునిక పోకడలు  వాటి ప్రభావం మనదేశంపై ఉంటున్న కారణంగా  స్వార్థము నిర్లక్ష్యము  అధిక స్వేచ్ఛ వంటి కారకాలవల్ల కుటుంబ బంధాలు ఇటీవలి కాలంలో కొంత బలహీనమవుతున్న మాట వాస్తవం.  దాని కారణంగానే  కుటుంబ సభ్యుల మధ్యన సంబంధాలు బలంగా లేకపోవడం, ఎవరికి వారే  విడిపోవడం, ఆధునిక పోకడలను అలవర్చుకుంటున్న కారణంగా కూడా  అటు పురుషుల్లోనూ స్త్రీలలోనూ బాధ్యత రాహిత్యం  పె రుగుతున్నందువల్ల కొన్ని దుర్మార్గపు దుష్ట ఫలితాలు విచ్చిన్నకర అంశాలు చోటు చేసుకుంటున్నాయి.. దాని కారణంగా స్త్రీల పైన పురుషులు, పురుషుల పైన స్త్రీలు పరస్పరం దాడులు, విడాకులు తీసుకోవడం,  హత్యలకు పాల్పడడం,  పరువు హత్యలు చోటు చేసుకోవడం,  భర్తను భార్య భార్యను భర్త విడిచి తమకంటూ సొంత కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని  నిస్సిగ్గుగా వ్యవహరించడం వంటి  అమానవీయ సంఘటనలు అధికమవుతున్నాయి.  అదే సందర్భంలో మహిళ  చిన్న బాలికల పట్ల కూడా మానవ మృగాలుగా పురుషుల యొక్క హే్యమైన  చర్యలను  కచ్చితంగా  విమర్శించి ఖండించవలసిందె. వాటి పట్ల ఉక్కుపాదం మోపాల్సిన అవసరం  ప్రభుత్వాలకు ఎంతో ఉన్నది.

 అయితే ఇక్కడ ప్రధానమైన విషయం మహిళలకు సంబంధించి  జాతీయస్థాయిలో ఫిబ్రవరి 13వ తేదీన భారతదేశంలో,  మార్చి 8వ తేదీన అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా  మహిళా దినోత్సవాలు జరుగుతున్నాయి. 19వ శతాబ్దంలో అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలలో  వచ్చిన ఆలోచనలు, చైతన్యం కారణంగా ఓటు హక్కు కోసం, వేతనాలకు కోసం,  సామాజిక రాజకీయ సమానత్వాన్ని సాధించే క్రమంలో తమ హక్కుల కోసం పోరాటం  ప్రారంభమైనది.  1911  లో అధికారికంగా ప్రారంభమైనటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 2011 మార్చి నాటికి  వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఐక్యరాజ్యసమితి కూడా ప్రతి సంవత్సరం ఒక తీమ్ తోని ఉత్సవాలను నిర్వహించడం పరిపాటిగా మారింది.  ఈ సందర్భంగా  ప్రధాని ముఖ్యమంత్రి ఇతర ప్రజా  ప్రతినిధులు మహిళల పట్ల సానుకూల  దృక్పథంతో మాట్లాడడమే కాకుండా  కోటీశ్వరులను చేయడానికి  ప్రకటిస్తారు.  కానీ  మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు మహిళలు  కారణమవుతున్న సంఘటనలు,  సామాజిక సంబంధాలు  కుటుంబ బంధాల విషయం లోపల వీరి పాత్ర పై  కూడా ఈ సందర్భంగా చర్చ జరగాలి. ఇది కేవలం మహిళా దినోత్సవం సందర్భంగానే కాదు  నిరంతరం కూడా చర్చ జరగాల్సినటువంటి అంశాలు.

మహిళల పట్ల అనాదిగా ఉన్నటువంటి ఉన్మాదం,  అత్యాచారాలు,హత్యలు, పీడన, పురుషుల పరంగా జరుగుతున్న అంశాలను కాదనలేము.కానీ  అంతకు మించిన స్థాయిలో స్త్రీల వలన కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించుకోవడం ద్వారా  కలిసున్న కుటుంబాలలో నైనా ప్రశాంతతను కోరుకోవడం అత్యాశ కాదు కదా! దీనికి తోడు సినిమాలు టీవీ సీరియల్ లో  దుర్మార్గపు ఆలోచనలు పోకడలను ప్రస్తావించడం ద్వారా కుట్రపూరిత మాటలు, అసూయ దేశాలు, కుటుంబ బంధాలలో పగుళ్లకు ఆజ్యం పోస్తున్న మాటలు మనం రోజు వింటూనే ఉన్నా0. " ఈనాడు ఉన్నటువంటి వ్యస్టి కుటుంబాలన్నీ   తల్లిదండ్రులు అత్తమామలతో సంబంధం లేకుండానే జీవిస్తున్నటువంటి పరిస్థితులలో  కనీస మైనటువంటి బంధాలను కాపాడుకోవడానికి కృషి చేయకపోగా  వృద్ధులను వెలివేయడం గెంటివేయడం,  ఒంటరి వాళ్లను చేయడం, నరకం చూపించడం,  హింసించడం వంటి అనేక దారుణాలకు  పురుషులతో పాటు స్త్రీలు కూడా  ప్రధాన కారణమవుతున్న సంఘటనలు.  ఇల్లు విడిచి దూరంగా పారిపోతేనే వస్తామని,  తల్లిదండ్రులతో సంబంధాలు ఉండకూడదని,  కుటుంబ బంధాలు అసలే మెయింటెన్ చేయకూడదని  కండిషన్లు పెడుతున్నటువంటి  వారికి కూడా కొదవ లేదు.  మరి కొంతమంది  భర్తను పిల్లలను అందర్నీ వదిలిపెట్టి బయటికి గెంటి  స్వేచ్ఛ జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు కూడా అనేకం. అలాంటి పరిస్థితుల్లో భర్త, పిల్లలు   దుర్భర జీవితం గడపడాన్ని మనం పరిశీలించవచ్చు కూడా."  

అక్రమ సంబంధాల విషయంలో  పురుషులు స్త్రీలు  ప్రధాన బాధ్యులే అయినప్పటికీ  చాలా చోట్ల  ప్రియున్ని వెంటబెట్టుకొని  భర్తలను చంపి పిల్లలను గొంతు కోసి  కొత్త జీవితం ప్రారంభించడానికి  కూడా  వెను తిరిగి చూడనటువంటి మహిళలు కూడా మనకు తారసపడుతున్నారు.  ఒక సినీ కవి "ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం - ఆడనే సంతోషం  ఆడనే సంతాపం "అంటూ  కుటుంబ బంధాలలో స్త్రీ పోషిస్తున్న పాత్ర ప్రాధాన్యతను  సహజ ధోరణిలో వర్ణించడం జరిగింది.  మరో గేయంలో" "  సాధింపులు బెదిరింపులు ముదితలకిక కూడవని  హృదయమిచ్చి పుచ్చుకొంటూ చిరునవ్వుతో గెలవాలని  తెలుసుకొనవే యువతి అలా నడుచుకోనవే యువతీ"  అంటూ స్త్రీలను బుజ్జగించిన సందర్భం కూడా  మహిళలు తలుచుకుంటే ఎంతటి  సాహసానికైనా వెనుకాడరని  వారిని బుజ్జగించే ప్రయత్నం  అనివార్యమని ఈ పాట ద్వారా తెలుస్తున్నది. అవసరమైతే కుటుంబ బంధాలను తెగతెంపు చేసుకుంటేనే సంసారం సాధ్యమని  మాట్లాడిన పలకరించిన  పోషించిన  అంగీకరించే ప్రసక్తి లేదు అనే అక్కస్తో కండిషన్లతో గడుస్తున్నటువంటి కుటుంబాలు కూడా అనేకం.

  సాధారణ పేద మధ్యతరగతి కుటుంబాలు శ్రమకు శ్రమజీక జీవన సౌందర్యానికి అలవాటు పడి వారి   రోజువారి జీవితం గడపడమే దుర్భరమవుతున్న పరిస్థితుల్లో   పరస్పరం అంగీకారంతో బ్రతుకుతున్న సందర్భాలను గమనించినప్పుడు  మధ్యతరగతి ఉన్నత కుటుంబాలలోనే ఇలాంటి  చేదు నిజాలు,  బంధాల తెగ దె o పు, లేనిపోని కండిషన్ల వలన బలహీనులైనటువంటి మగవాళ్లు  ఒకవైపు హత్యలకు ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి సందర్భాలను కూడా మనం గమనించవచ్చు. "మహిళలు  సహజంగా ఇబ్బందులకు గురవుతుండడంతో పాటు కొన్నిచోట్ల  హత్యలకు బలవుతున్న మాట వాస్తవమే  కానీ అంతకు మించిన స్థాయిలో భార్యల వలన  కుటుంబ జీవితాలు చినాభిన్నమవుతున్నటువంటి సందర్భాలను పరిశీలించినప్పుడు  రెండు వర్గాలు కూడా తమ సామాజిక బాధ్యతను, కుటుంబ నేపథ్యాన్ని, కుటుంబ  గౌరవాన్ని  గుర్తించడం ద్వారా కర్తవ్యాన్ని నిర్వహించినట్లయితే ఇలాంటి తప్పుడు పనులకు ఆస్కారం లేకుండా ఉంటుంది.అలాగే ప్రధానంగా స్త్రీలు కూడా  తమ తల్లిదండ్రులు, అన్నదమ్ముల మాదిరిగానే  మెట్టినింట కుటుంబ సభ్యులు ఉంటారని, వారిని చూసుకోవాల్సిన కర్తవ్యం తనకు ఉంటుందని,  తద్వారానే మెరుగైన సంబంధాలను గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుందని గుర్తిస్తే మంచిది."  

స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సామాజిక చింతన రాజకీయ  అవకాశాలు  ఉద్యోగాలు ఆర్థిక నేపథ్యం వంటి అంశాలలో ఎంత స్వేచ్ఛ అయితే అనుభవించాలో అంతకుమించినటువంటి బాధ్యతను కూడా కుటుంబ పరంగా నిర్వహించినప్పుడు  అందుకు సిద్ధంగా ఉన్నటువంటి పురుషులను సర్దుబాటు చేసుకోవడం ద్వారా వారి  కుటుంబాలను తీర్చిదిద్దే బాధ్యత ప్రధానంగా మహిళలపైనే ఉంటుంది .వాస్తవ అంశాలను పరిశీలించినప్పుడు ముఖ్యంగా సాధారణ పేద రైతు కుటుంబాలలో స్త్రీలు పోషిస్తున్నటువంటి పాత్ర వర్ణనాతీతం. పురుషులతో సమానంగా బాధ్యతలు నిర్వహిస్తూనే కుటుంబ  బాధ్యతలు పిల్లల పోషణ నిర్వహించడం వంటి అంశాలలో వారు  ఎవరికీ తీసుకోరు. అదే సందర్భంలో మగవాళ్ళు కూడా  రాత్రి పగలనే తేడా లేకుండా కష్టపడుతూ ఉత్పత్తులు చేస్తూ ప్రజలందరికీ తిండి పెడు తున్నటువంటి సందర్భాన్ని గమనించినప్పుడు నిజంగా సామాన్య పేద మద్య తరగతి కార్మిక కుటుంబాలలోనే  సామాజిక బాధ్యత ఎక్కువగా ఉన్నది అంటే అతిషయోక్తి  కాదు. " ఇక  మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ఉన్నత కుటుంబాలలో స్వార్థము, సంపాదనపైన దృష్టి, కుత్సిత స్వభావము,   స్వార్థపూరిత చింతన వంటి అంశాలు ఎక్కువగా ఉంటున్న కారణంగా  బహుశా ఇలాంటి దుస్ సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంటుంది.

 ప్రభుత్వాలు వెంటనే సోషల్ మీడియాతో పాటు టీవీ సినీ ప్రసారాలలో  నెగెటివ్ అంశాలను  తొక్కి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.అలాగే  కుటుంబ బంధాల బలోపేతానికి సామాజికంగా  మానవీయ విలువల పరిరక్షణకు పాఠశాలల్లో విద్యాసంస్థల తో పాటు  మండలాల వారీగా కమిటీలను నిర్మించడం ద్వారా  సమస్యలు ఏర్పడినప్పుడు పరిష్కరించే దిశగా కమిటీలు పనిచేసినట్లయితే  నూతన ఆలోచనలకు జీవం పోయవచ్చు.  వివాదాలు లేనటువంటి కుటుంబాలను  కల్లారా చూడవచ్చు. అప్పుడు  మహిళలే  మహారాణులు అవుతారు అనడంలో అతిశయోక్తి లేదు.  సామాజిక  వేత్తలు  సోషల్ మీడియా ప్రసార సాధనాలతో పాటు ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. అదే సందర్భంలో  క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు  మద్యపానం ధూమపానం  వంటి అసాంఘిక సామాజిక రుగ్మతలు  పూర్తిగా నిషేధించినప్పుడు మాత్రమే  ప్రేమానురాగాలతో కూడుకున్నటువంటి పవిత్ర దాంపత్యం,  భార్యాభర్తల సమన్వయం,  కలతలు కన్నీళ్లు లేనటువంటి కుటుంబాలు సాధ్యమo.  అప్పుడే మహిళా దినోత్సవాలకు పరిపూర్ణ అర్థం లభిస్తుంది.

---వడ్డేపల్లి మల్లేశం

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నా  బాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333