మహాత్మా జ్యోతిబాపూలే స్ఫూర్తితో బీసీ  రిజర్వేషన్ల కోసం పోరాటం

Apr 11, 2026 - 19:11
Apr 11, 2026 - 19:12
 0  2

జోగులాంబ గద్వాల 11 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- మహాత్మ జ్యోతిబాపూలే స్ఫూర్తితో బీసీలకు చట్టసభలలో 52 శాతం రిజర్వేషన్ల కోసం ప్రజల ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి పిలుపునిచ్చారు. శనివారం మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పూలే విగ్రహానికి ఘనంగా పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన జాతులకు విద్య అందడం కోసం పూలే జరిపిన ఆత్మగౌరవ పోరాటం మరువలేనిదని అన్నారు. సమాజంలో అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎన్నో అవమానాలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైన బలహీన వర్గాలకు విద్యను అందించడం కోసం తన జీవితాన్ని ధారా పోశారన్నారు. తన భార్యతో కలిసి దేశంలోనే మొట్టమొదటి మహిళా పాఠశాలను ప్రారంభించి నాటి కుల ఆధిపత్య ఉన్మాదులకు సవాలు విసిరిన ధైర్యశిలీ అని కొనియాడారు. జ్యోతిబాపూలే స్ఫూర్తితో జనాభా ప్రాతిపాదికన బీసీలకు 52 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. నాడు జ్యోతిబాపూలే ప్రజలందరికీ విద్య అందుబాటులో ఉండాలని ఆశిస్తే నేడు బిజెపి ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ, కాషాయకరణ చేసి ఆశాస్త్రీయ భావాలకు బీజం వేస్తున్నదని విమర్శించారు. విద్య ద్వారా సామాజిక ఆర్థిక అసమానతలు తొలగుతాయని, కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విద్యలోకి కార్పొరేట్ శక్తులకు అనుమతులు ఇచ్చిందని  విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ, నాయకులు హనుమన్న, నరేష్, సామెల్, అంజి తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State