భిన్న పరిస్థితుల మధ్యన కోట్లాది ప్రజానీకం వెతలు .

May 26, 2024 - 21:37
Jun 6, 2024 - 15:53
 0  12
భిన్న పరిస్థితుల మధ్యన కోట్లాది ప్రజానీకం వెతలు .

బ్రతికేది ఒకే దేశంలో నైనా  బతుకుల మధ్యన ఇంత తారతమ్యమా ?

అంతరాలు, అసమానతలు, వివక్షత, అనారోగ్యం

ప్రజల దుఃఖానికి మరింతగా కారణo.పాలకులు,

ప్రజలు ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. అంతిమ విజేతలు ప్రజలే....!
 
ఒకే దేశం ఒకే ఎన్నిక అని  రాజకీయ పార్టీలు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం  తరచుగా ప్రచారం చేస్తూ దానిని సాధించడం తమ లక్ష్యమని  తద్వారా మరింత మెరుగైన పాలన అందిస్తామని  నమ్మబలికే ప్రయత్నం చేయడం  దేశంలోని అసమానతలు అంతరాలను పరిశీలించినప్పుడు  ప సలేని మొక్కుబడి ప్రచారమని తెలిసిపోతున్నది . దేశంలోని ప్రజల మధ్యన ఆర్థిక అసమానతలు అంతరాలు  వివక్షత లేనటువంటి వ్యవస్థను  77 సంవత్సరాల తర్వాత కూడా సాధించలేకపోయినామంటే  అందుకు ఈ దేశాన్ని పాలించిన పాలకులు అందరూ సిగ్గుపడి బాధ్యత వహించవలసివుంది.  

ఒకే దేశంలో అన్ని రాష్ట్రాలకు సార్వత్రిక ఎన్నికలతో సహా ఒకేసారి నిర్వహించాలని దానివల్ల ఎంతో  పరిస్థితులు మెరుగైతాయని ప్రకటన చేస్తున్న ప్రభుత్వం  దేశంలో సమానత్వాన్ని సాధించడానికి సమ సమాజాన్ని స్థాపించడానికి ఆటంకం కలిగించినటువంటి అంశాలు ఏమిటో ఇప్పటివరకు ప్రస్తావన చేయలేదు.  నిబద్ధత, చిత్తశుద్ధి, రాజ్యాంగపరమైన స్పృహ  లేనటువంటి పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను కోరే పాలకులు  ఇంకా వందేళ్ల వరకు కూడా ఈ దేశంలో  సమానత్వాన్ని సాధించలేరు కానీ ప్రజలను మభ్య పెట్టడం కోసం-  ఒకే దేశం- ఒకే ప్రజా- ఒకే ఎన్నిక అని  సంబంధం లేని వాదనతో ప్రజల  ఆలోచనను,  చైతన్యాన్ని,  ఉద్యమ స్ఫూర్తిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.  దాని కారణంగా భిన్న పరిస్థితులలో కోట్లాదిమంది ప్రజానీకం నిరంతరం ఆందోళన, ఆవేదన, కన్నీరు, కడగండ్లతో  అష్ట కష్టాలు పడుతున్న సందర్భాలను ఒక్కసారి  పరిశీలించవలసిన బాధ్యత ఆలోచనపరులుగా బుద్ధి జీవులుగా మనుషులుగా మన అందరి పైన ఉన్నది . రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని కేంద్రం  హామీ ఇచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టింది, రైతు వ్యతిరేక చట్టాలతో వాళ్ళ ఉనికిని  నిర్వీర్యం చేసింది ఎంతోమంది  ప్రాణాలను బలిగొన్న విషయం నిజం కాదా?

 కన్నీటికి ఆర్థిక కారణాలు:-

బడా నేరస్తులు మోసగాళ్లు పెట్టుబడుదారులు తోటి   వాళ్లను మనుషులుగానే గుర్తించని కొంతమంది  అనేక రకాల స్కీములు పెట్టుబడులు  కంపెనీలు ఏజెన్సీలను ప్రారంభించి  పేద మధ్యతరగతి చెందిన వర్గాలు  తమ ఆర్థిక దుస్థితి వల్ల  మెరుగుపడతామేమోనని ఆశతో ఇందులో చేరి మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇందులో విద్యావంతులు కూడా ఉండడం విచారకరం.  తమ పిల్లల పెళ్ళి కోసం ,చదువుల కోసం, ఇంటి నిర్మాణం కోసం, బ్రతుకుతెరువు కోసం, బుక్కడు మెతుకుల కోసం  కష్టపడుతున్నటువంటి  కన్నీరు కారుస్తున్న అనేక కుటుంబాలు  అల్పాదాయం కారణంగా  ప్రభుత్వపరంగా అండ లేకపోవడం  తమ శక్తి మీద ఆధారపడి  రకరకాలుగా మోసపోవడం వల్ల కూడా నిరంతరం శోకసంద్రంలో మునిగిపోతున్నారు . ఇల్లు, గుడ్డలు,  చదువు, ఆరోగ్యము  వేటికి నోచుకోని అభాగ్యులు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాల కారణంగా  ఈ దేశంలో రెండవ పౌరులుగా  పాలనతో సంబంధం లేకుండా  ఎవరిని అడగాలో  ఎవరు బాధ్యులో తెలియక  దుఃఖ సాగరంలో మునిగిపోతున్నారు.

 రాజ్యాంగపరంగా దేశ సంపద ప్రజలందరికీ చెందవలసిన బదులు  కొన్ని సంపన్న కుటుంబాలకే  దారాదత్త మవుతుంటే 40 శాతం సంపద 1 శాతం  చేతిలో బందీ అయితే  ఇక కోట్లాది ప్రజానీకం దుఃఖంలో  కాక సంతోషంతో స్వౌర  విహారం చేస్తారా?  ఎండకు ఎండి, వానకు తడిసి,  పిడికెడు మెతుకుల కోసం, కట్టు గుడ్డ  కే కష్టపడుతుంటే ఇక ఆ కుటుంబాల పిల్లలకు చదువు ఆరోగ్యం  దక్కేది ఎలా?  అనారోగ్యం బారిన పడి  నిరక్షరాస్యత ఒ డిలో చేరి  ఆ కుటుంబాలు  ఎందుకు పనికి రాకుండా పోతుంటే  ఈ పాలకులు ఎప్పుడైనా  త మ నేరాన్ని అంగీకరించినారా?  తమ బాధ్యతను విస్మరించినామని ఒప్పుకున్నారా?

 ప్రజల కష్టాలకు సామాజిక కారణాలు:-

పేదరికం నిరుద్యోగం  కుల వివక్షత మత రాజకీయాలు  అణచివేత ఆకృత్యాలు అత్యాచారాలు  కొన్ని వర్గాల ఆధిపత్య ధోరణి కారణంగా  అనేక మంది జీవితంలో ఓడిపోతున్నారు,  మృత్యు ఒడిలో చేరిపోతున్నారు. అకాల మరణాలకు, అనూహ్యమైనటువంటి  పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు.  కులం పేరుతో వివక్షత అత్యాచారాలు  అట్టడుగు వర్గాలు ఆదివాసీలు  గిరిజనులు దళితులు  బలహీన  వర్గాలు ఆధిపత్య వర్గాల చేతిలో బలవుతుంటే  రక్షణ లేకపోగా పాలకులు కూడా ఉన్నత వర్గాల వైపే మొ గ్గుచూపి  చట్టం నుండి మినహాయింపు ఇచ్చి  పేదోళ్లను బలి చేస్తుంటే  పాలకుల మీద కసి కాక మరే ఉంటుంది.?  అధికారానికి   ఆమడ దూరంగా పేద వర్గాలు ఉన్న సందర్భంలో  తమ వర్గ ప్రయోజనం కోసం ప్రతినిధులు లేని సందర్భంలో  చట్టసభలు  ఉన్న వాళ్లకే చుట్టాలు అయితే పేదోని సంగతేమిటి?  ప్రస్తుత 17వ పార్లమెంటులో  లోక్సభలో 83% రాజ్యసభలో 36% మంది నేరస్తులు ఉన్నప్పుడు  పేద వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందా?  అందుకే  అట్టడుగు వర్గాలు పేదల పక్షాన  ప్రజాస్వామికవాదులు మానవ హక్కుల కార్యకర్తలు పోరాడవలసిన అవసరం ఆసన్నమైనది.

కుటుంబ బంధాలు నిర్వీర్యం కావడం,  మానవ సంబంధాలు మసకబారిపోవడం,  తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితిలో పిల్లలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం,  వృద్ధులు వికలాంగులు నిరక్షరాశ్యు లు, పేదవాళ్లు నిరాదరణకు గురికావడం  సమాజంలో అలముకున్న చీకటికి కన్నీటికి దుఃఖానికి  ప్రతిబింబం కాదా?

ఇక రాజకీయంగా ఆలోచిస్తే  పార్టీలు ఏవైనా తమ ప్రయోజనాల కోసం పాకులాడి  అవినీతికి పాల్పడి ఇతర పార్టీల కార్యకర్తలపై కూడా నిర్దాక్షిణ్యంగా దాడి చేసి హత్య చేసి ఈవీఎంలను పగలగొట్టి  గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టి  పేద వర్గాల నోట్లో మట్టి కొడుతున్నది నిజం కాదా ? వికలాంగులు, పేదవాళ్లు,  రెక్కాడితే డొక్కాడని  నిరుపేదలు, రైతులు, శ్రమజీవులు, దినసరి కూలీలు,  చిరు వ్యాపారులు, రోడ్డుమీద ఏదో పని చేసుకుని బతుకే వాళ్ళు  ఈ పాలకులకు పట్టనంత కాలం ఈ దురవస్థ కొనసాగుతూనే ఉంటుంది .ఇదేనా మనం ఆశించి ఆంగ్లేయుల నుండి అధికారం చేజెట్టించుకొని స్వాతంత్రం సాధించిన దానికి అర్థం  ? పెట్టుబడిదారులకు వంత పాడినంత కాలం పాలకులు ప్రజల చేతిలో శిక్షార్హులే! ప్రజలకు శత్రువులే ! ప్రజా యుద్ధంలో అంతిమ విజయం ప్రజలదే!  పాలకులు ఏకపక్ష విధానాలతో నియంతృత్వ వైఖరితో  కొనసాగినంత కాలం ఓటమిని చవిచూడక తప్పదు!

 ప్రజలు తమ చేతిలో ఉన్న అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును ఆయుధంగా చేసుకొని  నిజమైన పాలకులను ఎన్నుకొని  మతతత్వాన్ని ప్రజల విశ్వాసాలను మూఢవిశ్వాసాలను అనుసరించే పార్టీలను ఓడించి  పేద ప్రజల పక్షాన పని చేసే రాజకీయ పార్టీలను గెలిపించుకున్నప్పుడు మాత్రమే ఈ దేశానికి విముక్తి!  ఈ దేశంలో  బుద్ధి జీవులు, మేధావులు, మానవహ క్కుల కార్యకర్తలు, ప్రొఫెసర్లు  ప్రజల పక్షాన పోరాడిన నేరానికి విచారణ ఖైదీలుగా నిరంతరం శిక్షను అనుభవిస్తూ ఉంటే  ఆ దుఃఖాన్ని దిగమింగుతూ ఆ కుటుంబాల  సభ్యులు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే  అది పాలకులకు  శాపంగా పరిణమించక తప్పదు. ప్రజల చేతిలో పాలకులు, నియంతలు, నియంతృత్వంతో వహించేవాళ్లు ఎవరైనా ఓటమి పాలు కాక తప్పదు అనేది చరిత్ర చెప్పిన సత్యం.  ఆ సత్యాన్ని నిజం చేద్దాం! ఉమ్మడి కార్యాచరణకు పూనుకుందాం!  

 ప్రజలు యుద్ధం సంధిస్తేనే  పాలకులు దిగి వస్తారు పాలకులు తమ బాధ్యతను గుర్తించి నేరాన్ని అంగీకరించి  మర్యాద పాటించి  సామాజిక బాధ్యతను గుర్తించిన రోజున ఈ దేశంలో కన్నీటికి  ముగింపు పలికే అవకాశం ఉంటుంది . కొద్ది శాతం సంపన్న వర్గాల సంతోషం ఆడంబరాలు విలాసాల కోసం కోటానుకోట్ల ప్రజలు  తమ కన్నీటి బొట్లను కార్చడం సమంజసం కాదు . ప్రజలు తలచుకుంటే, ప్రతిఘటిస్తే ,శపిస్తే,  పాలకులపై ఉక్కు పాద మోపితే, ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే  ఈ దుఃఖానికి కన్నీటికి కడగండ్లకు  ఏడుపుకు  బాధలకు  విముక్తి కలుగుతుంది? ఆ రోజు కోసం, ఆ నవోదయ కోసమే మన అందరి పోరాటం నిరంతరం కొనసాగాలి.  పాలకులు కూడా తమ  అపజయాన్ని చూడకముందే కళ్ళు తెరిస్తే మంచిది, లేకుంటే ప్రజలే గెలుస్తారు, పాలకులు ఓటమిపాలవుతారు,  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న వాళ్లే అధికారానికి వస్తారు . అధికారానికి నోచుకోని వందలాది వర్గాలకు  చట్టసభల్లో  అవకాశం కల్పించడం కనీసమైన  పాలకుల సంస్కారం.  ఆ సంస్కారం కోల్పోతే  ఆగమైపోతారు, అడవి పాలవుతారు,  ఓటమిపాలవుతారు,  పరాజయం కాక తప్పదు జాగ్రత్త   సుమా !

--- వడ్డేపల్లి మల్లేశం 
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల  సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333