బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన కలెక్టర్
ఆలయ పరిసరాలను శుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దాలి*
బీచుపల్లిని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
జోగులాంబ గద్వాల 19 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కలెక్టర్ కు మొదట ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో, మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామి ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు కలెక్టర్ ను సన్మానించి, ప్రసాదాన్ని అందజేసి, వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి పురంధర్ బీచుపల్లి క్షేత్ర విశిష్టతను కలెక్టర్ కు తెలియజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆలయ ప్రాంగణం పరిశీలించి భక్తులను ఆకట్టుకునేలా లైటింగ్, ఇతర అలంకరణ చేయాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో చెత్తాచెదారం, పందులను గమనించి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత కోసం అవసరమైన సూచిక, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మినీ పార్క్, ఫౌంటెన్‌ను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా నిర్వహించాలన్నారు. పరిసరాల్లో ఉన్న ఫంక్షన్ హాళ్లను నిబంధనల ప్రకారం నిర్వహించేలా చూడాలన్నారు. ఆలయ పరిసరాల్లోని హోటళ్లను నిబంధనల ప్రకారం అవసరమైన ప్రమాణాలతో నిర్వహించాలన్నారు. నిజాం కొండను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను పర్యాటక శాఖకు పంపించడం జరిగిందన్నారు. నదీతీరంలో సేవలందిస్తున్న గజ ఈతగాళ్లకు లైఫ్ జాకెట్లు, టార్చిలైట్లు, రక్షణ తాళ్లు, రెస్క్యూ బోట్ వంటి పరికరాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
ఈ పర్యటనలో తహసీల్దార్ నరేష్, ఈఓ పురేందర్, పంచాయితీ కార్యదర్శి అరుణ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు