బి న్న యాజమాన్యాలలో విద్య ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో ఆటంకం
అసమానతలు అంతరాలను మరింతగా పెంచి పోషించే
ఈ వ్యవస్థను క్రమంగా రూపుమాపాలి.
కులాలు, మతాలు, ప్రైవేటు యాజమాన్యాల నుండి విద్యను
పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే కొనసాగించే స్థితికి తీసుకురావాలి.
అదే సమ భావనను అందించే కామన్ స్కూల్ సిస్టం.*
-- వడ్డేపల్లి మల్లేషము
వ్యక్తి నిర్మాణానికి సంఘ పటిష్టతకు ఉత్తమ సమాజాన్ని సాకారం చేసుకోవడం ద్వారా మరింత మెరుగైన పరిస్థితులను చేరుకోవడానికి ప్రజాస్వామిక విలువలను బలోపేతం చేసుకోవడమే కీలకం .అంటే వ్యక్తి వాదము నుండి సామూహిక వాదానికి సమన్వయ భావనతో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే క్రమంలో అసమానతలు అంతరాలు లేని సమాజాన్ని రూపొందించుకోవడానికి ఒక దేశం ఎంచుకునే విద్యా వ్యవస్థ, విద్యారంగము , ప్రభుత్వ రంగంలో విద్య కొనసాగడం వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి . కులము, మతము, ఆర్థిక స్తోమత, సామాజిక స్థాయి, వివక్షత, అస్పృశ్యతా వంటి అంశాలకు అతీతంగా సమ భావనతో సమానత్వం సాధించే దిశగా ఒకే పాఠశాలలో భిన్న వర్గాలు విద్యను అభ్యసించినప్పుడు వారు శాంతియుతంగా సామరస్యంగా ప్రజాస్వామిక విలువలతో శాస్త్రీయ అవగాహనతో ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఒకే రకమైన విద్య విద్యార్థులందరికీ అందించినప్పుడు భిన్న మనస్తత్వాలకు భిన్నాభిప్రాయాలకు అంద విశ్వాసాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది. కానీ భారత్ తో సహా అనేక దేశాలలో కులము మతము ఆధారంగా వేరువేరు పాఠశాలలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలలో విద్య కొనసాగుతున్న కారణంగా సామాజిక ఐక్యతకు, సమ భావనకు, శాస్త్రీయ ధోరణికి ఆటంకాలుగా పరిణమిస్తున్న విషయాలను గమనించాలి. అదే సందర్భంలో ప్రజాస్వామ్య సాధనకు
స్వాతంత్ర్య స్వావలంబనకు సవాలుగా నిలవడాన్నీ కూడా మనం గమనించవచ్చు. కులము మతము ఆధారంగా వేరువేరు యాజమాన్యాలలో నిర్వహించబడుతున్నటువంటి పాఠశాలల్లో సౌకర్యాలు, ఆలోచనా, బోధనా పద్ధతి, వసతులు, లక్ష్యము, ప్రాధాన్యత క్రమాలు కూడా వేరువేరుగా ఉండడం వలన విద్యా అనుభవాలు అసమానంగా ఉండే అవకాశం ఉంటుంది. వనరులు సమానంగా లేకపోవడంతో పాటు బోధించే పద్ధతిలోనూ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలోనూ భిన్నత్వం ఉన్న కారణంగా మతం ఆధారంగా నిర్వహించబడే పాఠశాలల్లో మత అభిప్రాయాలు బలవంతంగా చో ప్పించడం కూడా ఐక్యతకు సామాజిక స్ఫూర్తి కి ఆటంకాలుగా పరిణమించే అవకాశం ఉన్నది . ఇప్పటికే విద్య ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలలో కొనసాగుతున్న కారణంగా ప్రైవేటు పాఠశాలల్లో లక్షలాది రూపాయలు ప్రాథమిక దశలోనే ఖర్చు పెట్టవలసి రావడంతో అనేక పేద కుటుంబాలు అప్పుల పాలవుతున్న విషయాలను దేశవ్యాప్తంగా గమనించవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పరిమితం కావడం, ప్రభుత్వ విద్య పట్ల అవిశ్వాసం, పాలకులు బడ్జెట్లో కేటాయించే నిధుల లోపల లొసుగుల వంటి అనేక కారణాలవల్ల ప్రభుత్వ విద్యారంగం పట్ల నమ్మకం లేక ప్రైవేటు పాఠశాల వైపు ప్రజలు దృష్టి సారించడాన్నీ మనం గమనించాలి. ప్రభుత్వ రంగంలోనే అన్ని పాఠశాలలు గనుక కొనసాగినట్లయితే అది కూడా కామన్ స్కూల్ విధానంలో ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ అదే పాఠశాలలో చదువుకునే విశాల దృక్పథంతో ముందుకెళ్తే ఆ ఫలితాలు ప్రజాస్వామిక మౌలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి .
రాజ్యాంగంలో రాసుకున్నటువంటి లౌకికవాదం అంటే మత ప్రసక్తి లేని రాజ్యం లేదా ప్రభుత్వానికి మతం అంటూ ఉండదు అని దాని అర్థం. కాని మతం వ్యక్తిగతమైనదే కానీ మతాన్ని బలవంతంగా సమాజంపై రుద్దే ఏ విషయమైనా కూడా అవరోధం కలిగిస్తుంది ఆ క్రమంలోనే మత ప్రాతిపదిక పైన నిర్వహించబడుతున్నటువంటి పాఠశాలలు కూడా మతాభిప్రాయాలకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే విద్యకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది .ఈ కారణంగా వ్యక్తుల శాస్త్రీయ వైఖరులను తీర్చిదిద్దే క్రమంలో భావి సవాళ్లను అధిగమించే విధంగా ఉత్తమ నైపుణ్యాన్ని అందించే సందర్భంలో కూడా అనేక అవాంతరాలు కలిగే ప్రమాదం ఉన్నది. అందుకే మత ప్రాతిపదిక పైన కొనసాగుతున్నటువంటి పాఠశాలలను క్రమంగా ప్రభుత్వ పాఠశాలల వైపు తీసుకురావలసినటువంటి అనివార్యపరిస్తిథులు ఏర్పడినాయి.
విద్య ఎవరి ఆధీనంలో ఉండాలి ? ఏ రకంగా నిర్వహించబడాలి? అనే అంశంపై 19వ శతాబ్దంలో నెదర్లాండ్ దేశంలో రాజకీయపరంగా వైరుధ్యాలతో కూడిన యుద్ధం జరిగినట్లు తెలుస్తుంది. కొంతమంది అభిప్రాయం ప్రకారంగా విద్య ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని చేసిన డిమాండ్ ను తొలి దశలో వ్యతిరేకించినట్లు తెలుస్తున్నది . ఇక మరో అభిప్రాయం ప్రకారంగా విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండరాదని మత సంస్థలు కూడా వారి ఇష్టానుసారంగా పాఠశాలలను నిర్వహించే అవకాశం ఉండాలని చేసిన డిమాండ్ ప్రకారంగా తొలినాళ్లలో విద్య మత సంస్థల చేతిలోనూ ప్రభుత్వ ఆధీనంలోనూ రెండు రకాలుగా నడిచినట్లు తెలుస్తుంది.
క్రమంగా మత అభిప్రాయాలను మత విశ్వాసాలను అంగీకరించి గౌరవించే తరం మారిపోయిన కారణంగా క్రమంగా మత సంస్థల ఆధీనంలో నుండి విద్య ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకున్నప్పుడు ప్రజాస్వామిక విలువలను రక్షించాలన్న, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలన్న, శాస్త్రీయ వైఖర్లను పెంపొందించుకోవాలన్నా, ఉత్తమ సమాజ నిర్మాణానికి అంతరాలు అసమానతలు లేని వ్యవస్థను ఆవిష్కరించుకోవాలన్న సమ భావన సమాన అవకాశాలు కలిగినటువంటి విద్యను అందించడం ఒక అంశం అయితే ఇండియాలో మతం కులం ప్రాధాన్యత లేకుండానే మానవత్వం ఆధారంగా నిర్వహించబడే విద్య ప్రజాసామిక దృక్పథాన్ని పెంపొందించడానికి ఎంతో తోడ్పడుతుందని అందరం గ్రహించవలసిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణతో పాటు ఇతర అనేక రాష్ట్రాలలోనూ ప్రైవేటు రంగంలో మత సంస్థల ఆధ్వర్యంలో ఇతర కార్పొరేట్ స్కూల్ లతో పాటు ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న విద్యను సమన్వయ పరచడం ద్వారా ఒకే రకమైన విద్యను అందించడానికి కృషి జరగవలసినటువంటి అవసరం ఉంది. దీనికి అంతిమంగా కామన్ స్కూల్ విధానాన్ని ప్రభుత్వ రంగంలోనే ప్రవేశపెట్టినట్లయితే 1966లో కొఠారి సూచించినటువంటి విధానాన్ని ఇప్పటికైనా అమలు చేయడానికి పాలకులు దేశవ్యాప్తంగా పూనుకున్నట్లయితే ఆ పాఠశాలలో ఆ ప్రాంతానికి చెందిన వాళ్లు దానికి బీద తేడా లేకుండా అందరూ కలిసి చదువుకునేటువంటి అవకాశం వస్తుంది. తద్వారా ఆ పాఠశాలల యొక్క అభివృద్ధి , నిధుల మంజూరి, బోధనా అభ్యసన ప్రక్రియ పైన శ్రద్ధ పెరగడానికి అవకాశం ఉంటుందనేది శాస్త్రీయంగా రుజువైనటువంటి అంశం. దాని కారణంగా
అభివృద్ధి చెందిన దేశాలు అయినటువంటి బ్రిటన్, కెనడా, జర్మనీ ,అమెరికా లాంటి దేశాలలో కామన్ స్కూల్ విధానం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో భారత దేశంలో వెంటనే ప్రారంభించవలసినటువంటి అవసరం ఉంది . మతం కులం ఆధారంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ముమ్మరంగా ప్రారంభించిన విషయం తెలిసిందే దానివలన మతాల వారీగా కులాల వారీగా ఉన్న ఆ పాఠశాలల్లో ఇతర కులాలు, మతాలకు చెందినటువంటి పిల్లల యొక్క హావ భావాలు ఆలోచనలు జీవన విధానం పైన అవగాహన లేని కారణంగా సమాజం పట్ల సంపూర్ణ అవగాహనకు వచ్చే ఆస్కారం ఉండకపోగా తన మతం తన కులం గొప్పది అనే భావనతో విర్రవీగడానికి కూడా అవకాశం ఉంటుంది . తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్యార్థులు సగం మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే మిగతా సగం మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు, మతపరమైన పాఠశాలలో చదువుతున్నట్లుగా మనం అర్థం. చేసుకోవచ్చు. ఈ రెండు రకాల ధోరణి కూడా ఏకత్వానికి సమ భావనకు సమతా వాదానికి అవరోధంగా ఉంటాయని విద్యావంతులుగా బుద్ధి జీవులుగా మేధావులుగా సామాజిక అవగాహన కలిగిన వ్యక్తులుగా మనం అర్థం చేసుకొని కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి పాలకుల మీద ఒత్తిడి చేయడానికి పూనుకున్నప్పుడు మాత్రమే కుల మత ఆధారంగా కొనసాగుతున్న విద్యతోపాటు ప్రైవేటు యాజమాన్యంలో అధిక ఫీజులతో పేదలపై భారం మోపుతున్న కార్పొరేట్ వ్యవస్థను కూడా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడానికి అవకాశముంది. ఒకే యాజమాన్యంలో విద్యను కొనసాగించడానికి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే రాజ్యాంగంలోని పీఠికలో ప్రస్తావించినట్లుగా స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, సమానత్వము, సౌబ్రాత్రుత్వం,న్యాయం, సామ్యవాదం వంటి లక్ష్యాలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )