ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థను కూలదోసి ప్రభుత్వమే నేరుగా ఉచిత విద్యను అందించాలి.
పెట్టుబడిదారీ వర్గాలను పెంచి పోషించే ప్రస్తుత వ్యవస్థకు చరమగీతం పాడాలి.
చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేసి చూపాలి.
--- వడ్డేపల్లి మల్లేశం
ప్రస్తుతము ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వాలు తాత్సరం చేయడం, చెల్లించని కారణంగా విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు ఆపివేయడం, ఉన్నత చదువులకు ఇతర దేశాలకు వెళ్లే వాళ్లకు ఇబ్బంది కావడంతో నేరుగా అప్పులు చేసి యాజమాన్యాలకు చెల్లించడంతో లక్షలాది కుటుంబాలు ఇబ్బందులకు గురికావడాన్ని గనక మనం గమనిస్తే ఫీజు చెల్లింపు వ్యవస్థ అనే దుర్మార్గమైనటువంటి పరిస్థితి నుండి బయటపడడమే దీనికి పరిష్కారం. ఉచిత విద్య అనేది దీనికి చక్కటి ఔషధం .60 ఏళ్ల క్రితం ఉచిత విద్యను నాణ్యమైన స్థితిలో కామన్ స్కూల్ పద్ధతిలో అమలు చేసి దేశ భవిష్యత్తును తరగతి గదిలో రూపుదిద్దుకునేలా చేయాలని విద్యా కమిషన్ ప్రభుత్వాలకు సూచన చేస్తే దానిని అమలు చేయకపోగా ప్రైవేట్ రంగంలో విద్యను మరింత విస్తృతం చేసి ప్రభుత్వాలు సామాజిక బాధ్యతను విస్మరించిన కారణంగా నేటి దౌర్భాగ్య పరిస్థితులు విద్యారంగంలో చోటు చేసుకోవడానికి కారణాలుగా భావించాల్సి ఉంది. ప్రస్తుతం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి అని డిమాండ్ చేయడం కాకుండా ప్రభుత్వ కళాశాలలోనే ఉచితంగా విద్యను అందించాలి అనే డిమాండ్ చేయవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు అప్పుడప్పుడు డిమాండ్ చేయడంతోనే సరిపోదు ప్రత్యేకమైన ఉద్యమాలను నిర్వహించడం ద్వారా ప్రభుత్వాల మెడలు వంచి ప్రైవేటు యాజమాన్యాలకు చెల్లిస్తున్న రియంబర్స్మెంట్ బకాయిల విధానాన్ని కొల్లగొట్టి నూతన వ్యవస్థను ఆవిష్కరించుకుంటేనే ఈ దుస్థితి నుండి బయటపడగలము. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో అనేక వివిధ కళాశాలలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలకు చెల్లించవలసిన బకాయి 10,000 కోట్లకు పైగా పెండింగ్ ఉందంటే దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. డిగ్రీ వివిధ రకాల వృత్తిపరమైన కోర్సుల్లో విద్యను అభ్యసించిన వారికి విద్యార్థుల పక్షాన ప్రభుత్వాలు చెల్లిస్తున్నప్పటికీ సకాలంలో చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వకపోవడంతో వాళ్లు ఉత్తీర్ణులైన ప్రయోజనం చేకూరడం లేదు. పై తరగతుల్లో చేరడానికి అవకాశం లేకపోగా ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లే వారికి కూడా సంకటంగా మారింది. సర్టిఫికెట్ కావాలంటే మొత్తం పెండింగ్ బకాయిలను చెల్లించాల్సిందేనని తల్లిదండ్రుల పైన ఒత్తిడి తేవడంతో ఆస్తిపాస్తులు అమ్ముకొని చెల్లించవలసి రావడం ప్రభుత్వాలు చోద్యం చూడడం చట్టసభల్లో పేరుకు మాత్రం ప్రతిపక్ష పాలకపక్ష సభ్యులు చర్చించుకోవడంతోనే సరి పెడితే దీనికి పరిష్కారం ఎలా దొరుకుతుంది?
ప్రభుత్వ కళాశాలల్లో నే విద్యను బోధించాలి
*******---
ప్రైవేటు యాజమాన్యాల లో కాకుండా ప్రభుత్వమే విద్యా వైద్యంలో విప్లవాత్మక మార్పులను తీసుకోవడం ద్వారా నూతన వ్యవస్థను ఆవిష్కరించాలనే సోయి ఇప్పటికీ పాలకులకు లేకపోవడం విచారకరం. ప్రైవేట్ రంగానికి విద్యా వైద్యాన్ని అప్పజెప్పి చేతులు దులుపుకొని తమ సామాజిక బాధ్యతను విస్మరిస్తున్న పాలకులకు ఇకనైనా బాధ్యత గుర్తించేలా చేయాలి అంటే యువత విద్యార్థి లోకం ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడమే దీనికి పరిష్కారం. ఏనాడో కొఠారి కమిషన్ చేసిన సూచనను ఇప్పటికీ అమలు చేయలేని దుస్థితిలో ఒత్తిడి మాత్రమే పరిష్కారం చూపగలరు. నిధుల సంక్షోభం కారణంగా తాము చెల్లించలేకపోతున్నట్లు ప్రభుత్వాలు ప్రకటిస్తే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని ఇర కాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నవి కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ పద్ధతి కొనసాగితే ఫలితాలు ఇంతే ఉంటాయి. అంతెందుకు పాఠశాల స్థాయి విద్య కూడా నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో విస్తృతంగా వ్యాపించి ప్రభుత్వ పాఠశాలల పైన ప్రైవేటు పాఠశాలలు ఆదిపత్యం చెలా యిస్తున్న సందర్భంలో ప్రైవేటు మోజులో పడి పేద విద్యార్థులు కూడా తమ ఆస్తిపాస్తులు అ మ్ముకుని ప్రైవేటుకు వంత పాడుతున్నాయంటే తమ పిల్లల పైన ప్రైవేట్ రంగం మీద ఉన్న మమకారంతోనే. ఇది పరిష్కారం ఏ మాత్రం కాదు. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయవలసిన బాధ్యత, ప్రభుత్వ రంగంలోనే విద్యను అందించవలసినటువంటి చిత్తశుద్ధి పాలకుల కు ఉండాలి. అందుకే విద్య వైద్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏనాడో హెచ్చరించినప్పటికీ అది అమలు కావడం లేదు ఇది పాలకులకు ఇష్టం లేని పని కావడం వల్ల.
దేశంతో కాదు ప్రపంచంతోనే పోటీ అంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన విద్యను ఎంత ఖర్చుతో కూడుకున్న అందించడానికి సిద్ధపడితే రాబోయే కాలంలో దాని ఫలితాలను చూడగలము. ప్రపంచమే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా మన వైపు దృష్టి పెట్టె అవకాశం పోలేదు. పాలక పక్షాన్ని ప్రతిపక్షం నిధులు మంజూరు చేయలేదని విమర్శిస్తూ ఉంటే మీ కాలంలోనే కదా ఈ బకాయి అని అధికారపక్షం హెచ్చరించడం మాత్రమే దీనికి సమాధానం కాదు.ఒక నిర్మాణాత్మకమైనటువంటి దృష్టితో ఎన్ని వేల కోట్లు ఖర్చైనా ప్రభుత్వ రంగంలోనే విద్యను అందించే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినప్పుడు మాత్రమే ఇలాంటి దుస్థితి నుండి గట్టెక్కడానికి ప్రభుత్వ నిధులను కాపాడుకొని విద్యను బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి దూర దృష్టి ఉన్న ప్రభుత్వమే నిజమైన ప్రజా ప్రభుత్వం అవుతుంది .
చిత్తశుద్ధి అవసరం ::---
------------------------------
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంక్షోభ నుండి బయటపడాలంటే నిధులను కేటాయించడంతోపాటు క్రమక్రమంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థనుండి తప్పుకోవడమే ఏకైక మార్గం .ఈ ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థ వైఫల్యం కారణంగా విద్యార్థులను తల్లిదండ్రులను సమాజాన్ని మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఎంతోమంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే దీని పర్యవసానం ఏమిటి? ఇదే నా విద్య యొక్క మౌలిక లక్ష్యం? ఇందుకేనా పాలకులు రాష్ట్రాలను దేశాలను పరిపాలించేది? ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్య అందించే బదులు ప్రైవేట్ రంగంలో అక్రమాలకు పాల్పడే పద్ధతిలో కొనసాగిస్తున్నటువంటి ఈ వ్యవస్థలో నిధుల దుర్వినియోగం ప్రధాన పాత్ర చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఆక్రమాల నుండి తప్పించుకోవడానికి మరిన్ని అక్రమాలకు పాల్పడడమే పరిష్కారం అవుతున్న సందర్భంలో వీటన్నింటికీ చరమ గీతం పాడాలంటే విద్యా వ్యవస్థ యావత్తు ప్రభుత్వ రంగంలోనే కొనసాగడమే ఏకైక మార్గం. ప్రస్తుతం బకాయి ఉన్నటువంటి నిధులను మంజూరు చేయడంతో పాటు అర్హత ఉన్నటువంటి అన్ని ప్రైవేటు రంగంలోని కళాశాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలకు స్పష్టమైన హామీ ఇవ్వడం ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడమే ఏకైక పరిష్కారం తద్వారా రాష్ట్రం ప్రపంచం తోనే పోటీపడుతుంది అంటే నిజంగా అప్పుడు అర్థం ఉంటుంది .
అసంపూర్తిగా చర్చించడం పరిష్కారాలను చూపకపోవడం అంటే కట్టే విరగదు పాము చావదు అన్నట్లే ప్రభుత్వ పాలక పక్షాల విధానం కొనసాగుతోంది చట్టసభలోను చట్టసభల బయట. నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన ప్రతిపక్షాలు వివాదాన్ని మరింత పెంచే క్రమంలోనే తప్ప ప్రజల మీద ప్రేమతో చేపట్టే కార్యక్రమాలు ఏవీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రతిపక్షాలను వాటి తప్పుడు విధానాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో అఖిలపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి మెరుగైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోవాలి దాన్ని క్రమంగా పది లపరుచుకోవాలి.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి గారు చట్టసభల్లో గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తడిసి మోపడై నట్లు అందుకే అది ప్రతిపక్షానికి అస్త్రంగా మారినట్లు ఆరోపిస్తూ త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ విద్యార్థులను తల్లిదండ్రులను యావత్ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్న మాట వాస్తవం. పొరపాట్లు ఇబ్బందుల నుండి సమాజాన్ని విద్యార్థులను తల్లిదండ్రులను రక్షించాలంటే ప్రభుత్వ రంగంలో విద్యయే ఏకైక మార్గం. ఆ వైపుగా ఆలోచించినప్పుడే ప్రపంచం తోనే పోటీపడే ప్రభుత్వంగా తెలంగాణ మిగిలిపోతుంది .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు )