ఫాదర్స్ డే ప్రచారం తో నైనా తండ్రులు వృద్ధులను అవమానించే సంస్కృతి మారాలి.
జన్మనిచ్చిన తండ్రికి కృతజ్ఞతలు తెలిపే సహన సంస్కృతి విస్తరిల్లాలి.
కుటుంబ బంధాలతో పాటు మానవ సంబంధాలు
బలోపేతం కావడానికి ఫాదర్స్ డే ఉపయోగపడితే సంతోషమే.
---- వడ్డేపల్లి మల్లేశం.
(3వ ఆదివారం,ఫాదర్స్ డే) తాజ్ మహల్ నిర్మాణం ఉనికి అందచందాలు నవ్యతా నాణ్యత శిల్ప సంపద ఎంత గొప్పదో దానిని నిర్మించిన వాళ్ళ త్యాగశీలత అంతకంటే గొప్పది. కానీ అంతటితోనే ఈ వర్ణన సరిపోదు అంత హృద్యంగా నిర్మాణమై ప్రపంచవ్యాప్తిగా దృష్టిని ఆకర్షించడానికి గల శిల్ప సంపదను సృష్టించినటువంటి శిల్పులెవరు అనే అంశం కూడా ప్రధానమే కదా! ఇదే అంశంపై ప్రస్తావించిన ప్రముఖ విప్లవ రచయిత శ్రీ శ్రీ తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అంటూ శ్రామిక ఔన్నత్యాన్ని శ్రమైక జీవన సౌందర్యాన్ని ఉన్నతంగా చిత్రీకరించిన తీరు తరతరాలకు నిలిచి ఉంటుంది. అదే మాదిరిగా ప్రతి సంవత్సరం జూన్ నెలలో మూడవ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే నిర్వహిస్తున్నప్పటికీ దాని వెనుక అమెరికాలోని ఒక కుటుంబంలో తల్లి చనిపోతే తండ్రి తమ కూతుళ్ళను ఆదరించి పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పి తండ్రి పాత్రను గొప్పగా పోషించినందుకు ఫాదర్స్ డే రూపుదిద్దుకున్న విషయాన్ని గమనించినప్పటికీ అంతకంటే కూడా గొప్పది నిజజీవితంలో తండ్రిని ఆదరించడం అనే విషయం స్పష్టంగా నొక్కి చెప్పక తప్పదు.
ఐక్యరాజ్యసమితి, అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ గుర్తించి ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆమోదముద్ర వేసినప్పటికీ తండ్రి అనే పాత్ర ప్రతి కుటుంబంలో సర్వసాధారణమే కదా! అలాంటప్పుడు అంతర్జాతీయ సంస్థ ఆమోదం పొందవలసినటువంటి అవసరం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు కుటుంబ విషయాలు మానవ సంబంధాలు అనేకం కూడా ఇవ్వాలా విస్మరణకు గురవుతున్న అనివార్య పరిస్థితులలో ప్రపంచ స్థాయిలో ఒక దినోత్సవం అంటూ ఉంటే తప్ప ఆ భావజాలం అమలుకు నోచుకోవడం లేదు అనే దయనీయ పరిస్థితి నుండి ఈ దినోత్సవాల ప్రాధాన్యత పెరిగినట్లు మనం గుర్తించాలి.
అంతమాత్రాన ఈ దినోత్సవాన్ని విమర్శించడం కాదు కానీ నిజజీవితంలో భాగమైనటువంటి తల్లితండ్రులు కుటుంబ సభ్యుల మధ్యన ఉండే బంధాలు ప్రేమానురాగాలు ఆత్మీయత అనురాగాలు ఎవరో చెబితే తెలిసేది కాదు కదా! అయినప్పటికీ మారుతున్న కాలగమనంలో తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నారో అర్థం చేసుకుంటే ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధమే లేకుండా కేవలం కని విడిచిపెడితే ఎక్కడో ఎవరికి వారే పెరిగి తల్లిదండ్రులకు సంబంధం లేకుండా జీవిస్తున్నట్లు తెలుస్తుంటే అంతో ఇంతో కుటుంబ బంధం బలంగా ఉన్నటువంటి భారతదేశము ఈ విషయంలో నయమనిపించక మానదు. అయినప్పటికీ ఇంకా బలమైన వివాహ వ్యవస్థ కుటుంబ బంధం కొనసాగుతున్న భారతదేశంలో కూడా తండ్రిని వెతుక్కోవడం, తనని గౌరవించడానికి అవకాశాలను అన్వేషించడం, మరిచిపోతే జ్ఞప్తికి తెచ్చుకోవడం, అనేక సందర్భాలలో అవమానాలకు చిత్కారాలకు గురికావడాన్నీ గమనించినప్పుడు అవును నిజంగా ఫాదర్స్ డే ఉండాల్సిందే అనిపించక మానదు.
తండ్రి ప్రాధాన్యతను పిల్లలు ఆచరణలో చాటి చెప్పాలి :-
ఫాదర్స్ డే అన్న సందర్భంగా తండ్రిని గురించి కవులు గొప్పగా వర్ణించడం, సభలు సమావేశాలను నిర్వహించడం, పాఠశాలల్లో విద్యార్థులు వ్యాసరచన ఉపన్యాస పోటీలలో గొప్పగా చెప్పడం వరకే పరిమితమైతే దానితో ఒరిగేది ఏమీ లేదు. తండ్రి పిల్లల మధ్య ఉండవలసిన సంబంధం సజీవమైనటువంటిది అది నిత్యం ప్రవహించే జీవనది లాగా కొనసాగితే తప్ప దానికి అర్థం లేదు. తండ్రి గొప్పతనాన్ని ఎవరో జ్ఞాపకం చేస్తేనో ఎవరో వర్ణిస్తేనో ఎవరో వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తేనో కుటుంబ సభ్యులు గుర్తించే దయనీయ పరిస్థితులు సిగ్గుచేటు కదా! తమ ఉనికికి ఆధార భూతమైనటువంటి తల్లిదండ్రులు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి జీవిత గమనానికి దారి చూపి మార్గదర్శి లుగా నిలబడే క్రమంలో తండ్రి పాత్ర మరింత గొప్పది.
పిల్లలను పెంచి పోషించే క్రమంలో కుటుంబ ఆదాయము ఆస్తిపాస్తులు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇప్పటికీ అనేక కుటుంబాలలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ కష్టాలను పిల్లల కంట కనబడకుండా తండ్రి తన కళ్ళలో పెదాలపైన చిరునవ్వును తాత్కాలికంగా కృత్రిమంగా సృష్టించి పిల్లలో మానసిక బలహీనత చోటుచేసుకుండా కుటుంబ లోపాలను కష్టాలను విప్పి చెప్పకుండా వారిని ధైర్యంగా ఆత్మస్థైర్యంగా పెంచి పెద్ద చేసే విషయంలో తండ్రి ఎన్ని రోజులు పస్తులున్నాడో ఎంత కన్నీరు ధారబోసినాడు ఎన్ని రకాల అవమానాలకు గురైనాడో తెలియదు . కానీ తాను పటిష్టంగా నిలబడి కష్టాలు, కన్నీళ్లను మరిచి పిల్లల కోసం ధైర్యంగా నిలబడితేనే వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపవచ్చు అనేటువంటి ఏకైక సజీవ సహజ సూత్రాన్ని ఆధారం చేసుకొని అప్పులు చేసి ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేయించి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలను అధిగమించి తీర్చిదిద్దిన తీరు పిల్లలకు జ్ఞాపకం లేకపోతే ఎలా? కొడుకులు మాత్రమే కావాల్సిన అవసరం లేదు ఇంట పుట్టిన కూతుర్లు వారి పిల్లలు కూడా యజమాని కృషిని గుర్తించకపోతే ఎలా తల్లి లేని కుటుంబాలలో తండ్రి పడే వేదన పిల్లల పెంపకంలో ఎదుర్కొనే సాధకబాధకాలు మరింత కటువుగా ఉంటాయి. తల్లిగా, దండ్రిగా తాను ప్రధాన పాత్రను పోషించి ఏ లోటు రాకుండా పెంచి సమాజంలోకి పంపించే క్రమంలో తండ్రి పడిన బాధలు పోషించిన పాత్ర నిర్వహించిన నిర్వహణ నైపుణ్యం ఎదుర్కొన్న ఆటుపోట్లు ఇబ్బంది కలిగించిన అవాంతరాలకు అంతే లేదు. .అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో కొంత అటు ఇటుగా పేద కుటుంబాలలోను ధనవంతమైన కుటుంబాలలోను ఈ సమస్యలు తప్పనిసరిగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అన్ని ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటేనే సరిపోదు ఇక్కడ తండ్రికి కావాల్సింది భరోసా, ధైర్యం, ఆత్మవిశ్వాసం తో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా తండ్రి తన పాత్రను విజయవంతంగా నిర్వహించడానికి కారణమవుతాయి.
ఎక్కడైతే కుటుంబ సభ్యుల సహకారం 100% ఉంటుందో ఆ కుటుంబంలో తండ్రి విజయపతాన దూసుకువెల్ల గలడు అతని నిర్వహణలో ఆ ఇంటి పిల్లలంతా ప్రయోజకులు కాగలరు. ప్రయోజకులంటే అందరూ ఉద్యోగాలు వ్యాపారాలు చేతినిండా డబ్బు సంపాదించిన వాళ్లు మాత్రమే అనుకుంటే పొరపాటు.... తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారాన్ని పుక్కిట పట్టి తమ తమ నైపుణ్యాలు ప్రతిభకు అనుకూలమైనటువంటి ఉపాధి అవకాశాలను వెతుక్కుని ఆ పనిలో లీనమై సామాజిక సేవలో గడిపే వాళ్ళందరూ కూడా ప్రయోజకులే. ఉద్యోగాలు చేయని పిల్లల తండ్రి నిష్ప్రయోజకుడు అని అంటే మాత్రం ఒప్పుకోబ డదు. ఉద్యోగం వ్యాపారం సంపదలతో సంబంధాలను కొలవడం మానుకోవాలి పిల్లల కోసం తండ్రి పోషించిన పాత్ర, విడిచినటువంటి కన్నీరు, పంచిన ప్రేమానురాగాలు మాత్రమే గీటురాయిగా పనిచేస్తాయి.
ఆ నేపథ్యంలోనే కన్న పిల్లలు వృద్ధాప్యంలోకి చేరుకున్న తమ తండ్రిని జ్ఞాపకం చేసుకొని సజీవంగా ఉంటే ఆదరించి పలకరించి హృదయపూర్వకంగా పలకరిస్తే చాలు. ఇక ముఖ్యంగా కన్న కొడుకులు వివాహానంతరం అనేక మార్పుల కారణంగా వృద్ధులైన తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని ఇవాళ సర్వసాధారణమైన అంశంగా పరిగణించవలసి వస్తున్నది. వేరే ఇంట పుట్టినటువంటి కోడలు కొంత ఆలోచించకపోవచ్చు కానీ కడుపులో పుట్టిన కొడుకులు కూడా తండ్రిని గేలి చేసి హేళన చేసి అవమానించి ఆదరించక ఇబ్బందులకు గురి చేస్తూ బుక్కెడు మెతుకుల కోసం సూటిపోటి మాటలతో మానసిక క్షోభకు గురి చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకుంటే అనేకచోట్ల ఈ బాధలు పడలేక తల్లిదండ్రులు సజీవంగా ఉన్నప్పుడే తమ చితిని పేర్చుకొని సజీవ దహనమైనటువంటి సందర్భాలను గమనిస్తే తల్లిదండ్రులు ఎంత మానసిక వేదనకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. వృద్ధాప్యం అనేది ప్రతి జీవికి తప్పనిసరి ఆ దశను అర్థం చేసుకోకుండా తమ వరకు మాత్రమే పరిమితం చేసుకొని మిడిమిడి ఆలోచనతో అసంపూర్ణ అవగాహనతో అహంకారపూరితంగా వ్యవహరించడం వల్ల అనేక నిండు జీవితాలు బలవుతున్న సందర్భాలను కూడా గమనించడం ద్వారా ఫాదర్స్ డే సందర్భంగా ఆ పదానికి తగిన ప్రాధాన్యతను గుర్తింపును గౌరవాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరు మన పూర్వకంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చేసిన లోటుపాట్లను ప్రస్తుతం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను ఇకనైనా మార్చుకోవడం ద్వారా ఫాదర్స్ డే ను నిత్యం స్మరించుకోవడం, దాని అనివార్యతను ఆహ్వానించడం, సజీవ మానవ సంబంధాలను మరొక్క మారు స్పృశించుకోవడం ద్వారా తండ్రి పాత్రను ఉదాత్తమయినటువంటి అగ్ర భాగాన నిలవడానికి ప్రయత్నం చేస్తే గతంలో చేసిన లోపాలను సవరించుకోవచ్చు. తప్పులకు ప్రాయశ్చితాన్ని సమర్పించుకుందాం . దృఢ సంకల్పంతో తండ్రి ఔన్నత్యానికి అగ్ర తాంబూలం ఇచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కొ లమానంగా గౌరవించి ఆరాధించుదాం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)