ప్రైవేటు విద్యాసంస్థలకు వేల కోట్ల రూపాయలు బోధనా రుసుము,
ప్రైవేటు విద్యాసంస్థలకు వేల కోట్ల రూపాయలు బోధనా రుసుము, ఉపకార వేతనాలు బకాయి పడడం విచారకరం. టిఆర్ఎస్ హయాoలో తడిసి మోపడైన బకాయిలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిదుల విడుదలకు డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు. విద్యను ప్రభుత్వరంగంలో నిర్వహించడo పరిష్కారం
వడ్డేపల్లి మల్లేశం
ఇంటర్మీడియట్ నుండి ఉన్నత విద్య వరకు ప్రైవేటు రంగంలో విద్యను కొనసాగిస్తున్న కారణంగా ఆ విద్యా సంస్థల్లో చదువుకునే పేద విద్యార్థులకు అనేక బాధలు తప్పడం లేదు. ప్రభుత్వము కల్పించే ఉపకార వేతనాలు బోధనా రుసుము చెల్లింపులపై ఆధారపడి లక్షలాది పేద కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేటు కళాశాలలో చదివిస్తున్నారు. తాము చెల్లించే ఫీజ లక్షల్లో ఉంటే వేల రూపాయలు కూడా ప్రభుత్వం నుండి రావడం లేదు అవి కూడా గత నాలుగు సంవత్సరాలకు పైగా ప్రభుత్వము చెల్లించని కారణంగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో ఆ పేద కుటుంబాలు అప్పు చేసి చెల్లించి తమ పిల్లలను పై చదువులకు పంపించవలసివస్తున్నది. ఇక అనేక కళాశాలలు తమకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాకపోవడంతో కళాశాలలను నిర్వహించడం కష్టంగా మారిందని కొన్ని కళాశాల యజమానులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు పత్రికా కథనాల ద్వారా తెలుస్తుంది . గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన బకాయి కోట్ల రూపాయలకు చేరినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుంటే కనీసమైన స్పందన లేని ప్రభుత్వాలు చోద్యంగా చూడడం వాంఛనీయం కాదు. ప్రభుత్వo ఇంటర్మీడియట్ నుండి పీజీ స్థాయి వరకు గాలికి వదిలేసిన కారణంగా ప్రైవేటు కళాశాలలో విద్యను అభ్యసించక తప్పడం లేదు. ముఖ్యంగా ప్రైవేటు కళాశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఉపకార వేతనాలు బోధనా రుసుముల పేరుతో కొంత మొత్తాన్ని కళాశాలకు ఇవ్వడం ఆనవాయితీగా మారిన నేపథ్యంలో మొత్తము భారాన్ని మోయలేని ప్రభుత్వాలు తమ సామాజిక బాధ్యతను విస్మరించడాన్నీ పౌర సమాజం ఖండించాలి . ప్రభుత్వ విద్యారంగం పైన ఏనాడూ సమీక్షించని నాటి ప్రభుత్వం కోట్లాది రూపాయలు బకాయిలైన పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం తమది ప్రజా పాలన అంటున్న నేపథ్యంలోనైనా సామాన్య ప్రజలు పేద కుటుంబాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ బకాయిల పైన దృష్టి సారించి వెంటనే బకాయిలను విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు చేస్తున్న డిమాండ్ ను పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతగానో ఉన్నది .
ప్రైవేటు విద్యారంగం కొన్ని గణాంకాలు :-
***********
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1400 ఇంటర్ కళాశాలలో 9 లక్షల మంది విద్యార్థులు, 944 డిగ్రీ కళాశాలలో 6 లక్షల మంది విద్యార్థులు, 262 ఇంజనీరింగ్ కళాశాలలో 1,20,000 మంది విద్యార్థులు, 200 పీజీ కళాశాలల లో 20,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే వీరంతా ప్రధానంగా ఉపకార వేతనాల మీదనే ఆధారపడిన కారణంగా సకాలంలో మంజూరు కాకపోవడంతో అటు కళాశాలలు ఇటు విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం పాలకులకు తెలియదా ? కోట్లాది రూపాయలను తప్పించుకొని ఉన్నత విద్యారంగాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వo ఉచిత విద్య తమ సామాజిక బాధ్యత అని ఇప్పటికీ గుర్తించకపోవడం, పేద వర్గాలను విస్మరించడం రాజ్యాంగబద్ధమైన ద్రోహం కాదా? ప్రతి ఏటా సుమారు 12.5 లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాలు బోధన రుసుముల కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉండగా 2021 నుండి 24 వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ బీసీ వర్గాలకు కలిపి మొత్తం 7,700 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఈ బకాయిల ప్రస్తావన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీదృష్టికి రాగా ఎన్నికల ప్రచారంలో బకాయిలను విడుదల చేస్తామని, విద్యార్థుల సంక్షేమాన్ని కట్టుబడి ఉంటామ ని ప్రకటించినప్పటికీ ప్రభుత్వము వచ్చి తొమ్మిది మాసాలు గడిచిపోయిన నిధులు విడుదల చేయకపోవడంపై నిరసన తెలియజేస్తూ ఆందోళన చేయడానికి అన్ని సంఘాలను కలుపుకొని సంసిద్ధతను వ్యక్తం చేయడాన్నీ ప్రభుత్వం లోతుగా ఆలోచించాలి.
కేజీ నుండి పీజీ వరకు ఉచిత,నాణ్యమైన విద్యను ప్రభుత్వమే అందించాలి:-
**********
కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అని ప్రకటించిన గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోగా ఏనాడూ విద్యారంగం పైన సమీక్ష చేయలేదు పైగా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పైన నియంత్రణ లేని కారణంగా లక్షలాది రూపాయలతో పాటు అక్రమంగా అనేక రూపాలలో వసూలు చేస్తున్నట్లు ఇప్పటికీ కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. బూట్లు, టై బెల్టులు, నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, డ్రెస్సుల పేరుతో నిర్బంధంగా వసూలు చేయడమే కాకుండా ఫీజుల పైన ఎలాంటి నియంత్రణ లేకపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం గత ప్రభుత్వం కమిటీతో పాటు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినా ఫీజుల నియంత్రణ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణకు కమిటీనీ వేసి ఫీజులను తగ్గించాలి. నిజంగా ప్రజాపాలన అనుకుంటే ప్రైవేటు పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని పాఠశాల విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం ప్రజాస్వామిక శక్తుల ప్రధాన డిమాండ్.
ఇక ఇంటర్మీడియట్ నుండి పీజీ స్థాయి వరకు ప్రభుత్వ కళాశాలలు నామాత్రం కాగా పెద్ద మొత్తంలో ప్రైవేటు కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు ఏ మూలకు సరిపోవడం లేదు. అందుకే ఉన్నత విద్యను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం ద్వారా పేద వర్గాలకు ఉచితంగా అందించడానికి నిబద్ధతగా పనిచేయాలి. ప్రభుత్వం కోటాను కోట్ల రూపాయలను ప్రైవేటు కళాశాలలకు ఇవ్వడం ఎందుకు? బకాయి పడి బదనాము ఎందుకు? పేద వర్గాల దృష్టిలో ప్రైవేట్ రంగం కొమ్ముకాస్తున్నట్లు ప్రచారం ఎందుకు? ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ప్రైవేటు రంగము కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలో విద్యను కొనసాగించడానికి సిద్ధంగా ఉండవు. ఈ అంశాన్ని నాడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది "ఎందుకంటే విద్యను ఉచితంగా నాణ్యమైన స్థాయిలో ప్రభుత్వమే అందిస్తే విద్యార్థులు చైతన్యమై పాలకుల యొక్క లోపాలను తప్పిదాలను ప్రశ్నిస్తారు ప్రతిఘటిస్తారు.అందుకోసమే ప్రభుత్వం ఉచిత విద్యను అమలు చేయడానికి అంగీకరించకపోవచ్చును అని." ప్రజల ప్రాథమిక మానవ హక్కులను గౌరవిస్తామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ఈ రాష్ట్రంలో పునరుద్ధరిస్తామని ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇవ్వడం సంతోషం . ఆ హామీ మేరకైనా ఈ రాష్ట్రంలో ఉచిత విద్యను ఒకటవ తరగతి నుండి స్నాతకోత్తర స్థాయి వరకు అందించడం ద్వారా చిత్త శుద్ధిని రుజువు చేసుకుంటే బాగుంటుంది . ఇందుకు సంబంధించినటువంటి సిఫారసును కొత్తగా ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తన నివేదికలో పొందుపరుస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే ఆ కమిషన్ కు చైర్మన్ గా నియామకమైన ఆకునూరి మురళి గారు " ప్రైవేటు పాఠశాలలను రాష్ట్రంలో లేకుండా చేయడమే ప్రభూత్వరంగంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచ డానికి తోడ్పడతాయి" అని పదేపదే చేసిన హెచ్చరిక ఈ సందర్భంగా నివేదిక తయారీలో తోడ్పడుతుందని ఆశిద్దాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు (చౌటపల్లి) హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)