ప్రమాదాల్లో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు రూ.3 కోట్ల బీమా అందజేసిన డిజిపి సి. వి. ఆనంద్
ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున చెక్కుల అందజేత
హైదరాబాద్, ఆగస్టు 31: విధి నిర్వహణలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు తెలంగాణ డిజిపి సి. వి. ఆనంద్ అండగా నిలిచారు. ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్ల ను సోమవారం డిజిపి కార్యాలయంలో మృతుల కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను డిజిపి అందించారు.
రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
శంకర్పల్లి పరిధిలో 2025 ఫిబ్రవరి 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2018 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వెలిమడ తండా తెల్లపుర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముత్తంగి శ్రీనివాస్ మృతి చెందారు. ఆయన తండ్రి ముత్తంగి యాదయ్యకు డిజిపి సి. వి. ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు.
ఇద్దరు సిబ్బంది కూడా..
నల్లగొండ జిల్లా కనగల్ లో పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న 2004 బ్యాచ్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ బోలెపల్లి సైదులు 2025 జూన్ 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వరంగల్ కు చెందిన మరో పోలీసు కానిస్టేబుల్ కె.వెంకటరెడ్డి 2026 మార్చి 10న లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందారు. వెంకట్ రెడ్డి వరంగల్ లోని ఏఆర్పిసిగా హెడ్ క్వార్టర్స్ లో విధిని నిర్వహిస్తుండగా వెనుక నుంచి లారీ తాకడంతో వెంకట్ రెడ్డి మృతి చెందారు.
ఈ మృతులందరికీ ఎస్బిఐలో ఇన్సూరెన్స్ అకౌంట్ ఉండటం వలన బ్యాంక్ అధికారులతో సంప్రదించి డిజిపి వీరి కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున బీమా పరిహారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు డిజిపి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబాల సంక్షేమానికి శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిజిపి తో పాటు ఎస్బీఐ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.