పెన్షనర్ల స్ఫూర్తి ప్రదాత ధరం స్వరూప్ నకార గారిని జ్ఞప్తికి చేసుకోవడం మన అందరి బాధ్యత
పెన్షనర్ల స్ఫూర్తి ప్రదాత ధరం స్వరూప్ నకార గారిని జ్ఞప్తికి చేసుకోవడం మన అందరి బాధ్యత. వేతనాలు, పెన్షన్లకు సమాజానికి ఎంతో సంబంధం ఉంది. ఎందుకంటే ఉద్యోగులైనా ముందుగా ఈ దేశ పౌరులు ఆ తర్వాతే పెన్షనర్లు, వేతనజీవులు, అధికారులు . ప్రజల సమస్యల పరిష్కారం తోనే ఉద్యోగులు పెన్షనర్లవి కూడా పరిష్కారమౌ తాయి .
వడ్డేపల్లి మల్లేశం
17...12...2024
సమాజంలో భాగమైన ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెర్సనర్లు వాళ్ల సమస్యల కోసం అనునిత్యం పోరాటం చేస్తున్న సందర్భంలో ఒక అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యల పరిష్కారంలో ఉద్యోగులుగా మనం పాల్గొన్నప్పుడు మాత్రమే మన సమస్యలకు ప్రజల మద్దతు లభిస్తుంది అనేది చారిత్రక సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1995 ప్రాంతంలో ఆనాటి ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమ సంస్థ పక్షాన ఉద్యోగులు ఉపాధ్యాయులతో పాటు ప్రజల సమస్యలను కూడా డిమాండ్ చేయడం జరిగింది. అధిక ధరలను తగ్గించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, నాణ్యమైన విత్తనాలు పురుగుమందులు సరఫరా చేయాలని, కల్తీని అరికట్టాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయడం ఆనాటి ఉపాధ్యాయ సంఘం కొనసాగించినటువంటి చారిత్రక బాధ్యతను తెలియజేస్తుంది.అంతేకాదు వేతనాలు పెంచడం ఉద్యోగులకు ప్రయోజనం కావచ్చు కానీ ప్రజలకు ఏం ప్రయోజనం? "అందుకే జీతాలు పెంచడం కాదు ధరలు తగ్గించాలి" అని నాటి ఉద్యమనేత ఆకుల భూమయ్య గారు ఇచ్చిన పిలుపు అందుకున్న ఉపాధ్యాయ ఉద్యమం ప్రజలను, ప్రభుత్వాన్ని ఆలోచింప జేసింది". తద్వారా ఆనాడు ఆ ఉపాధ్యాయ సంఘం నిర్వహించిన అనేక నిరసన పోరాట కార్యక్రమాలకు ప్రజలు ప్రజాసంఘాలు రాజకీయ పక్షాల వాళ్లు కూడా హాజరైన విషయాన్ని గమనిస్తే ఎంత ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటే అంత ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యలు కూడా చర్చకు వస్తాయి అనే విషయం రూ డీ అయినది. అందుకే పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా కూడా, ప్రజల్లో భాగంగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ఆలోచన చేస్తూ, ప్రజలతో మమేకం కావలసినటువంటి అవసరాన్ని ఈ దినోత్సవం సందర్భంగా యావత్ పెన్షనర్లు ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. అందుకే పెన్షనర్స్ డే పట్ల ప్రజలకు కూడా అవగాహన కల్పించవలసిన భాద్యత మనపై ఉన్నది.
పెన్షనర్ల దినోత్సవం నేపథ్యం - ధరం స్వరూప్ నకారా (D. S. నకారా) కృషి :- భారతదేశంలో 1977 కంటే ముందు ఉద్యోగ విరమణ చేసిన వారి పెన్షన్లలో రకరకాల కోతలను విధించేవారు. అంతే కాదు ఆ రోజుల్లో 675 పెన్షన్ మాత్రమే అత్యధిక పెన్షన్ గా గుర్తించబడిందంటే ఆనాటి గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 1979లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం చేసిన పెన్షనర్ల చట్టం కూడా వివక్షతను చూపిన కారణంగా కూడా పెన్షనర్ల ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది అందుకు నాయకత్వం వహించింది డిఎస్ నకారా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 1979లో చేసిన చట్టం ప్రకారంగా 79 కంటే ముందు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఉన్న పెన్షన్ 79 తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఉన్న పెన్షన్లలో తీవ్రమైన ఆర్థిక వ్యత్యాసాలు ఉండడంతో ఆనాటి పెన్షనర్లు తీవ్రంగా వ్యతిరేకించడం ఒక ఎత్తు అయితే 72లో ఉద్యోగ విరమణ చేసినటువంటి డిఎస్ నకార కూడా ఈ వివక్షతకు బలికా వడంతో పాటు పెన్షనర్ల తరఫున పోరాడటానికి సిద్ధపడి రాజ్యాంగంలోని 32 ఆర్టికల్ ప్రకారంగా ఆర్థిక వేతన వ్యత్యాసాలలో వివక్షతను రూపుమాపే లక్ష్యంతో 19 79లో డిఎస్ నకార సుప్రీంకోర్టులో దా వా వేయడం జరిగింది. ఇటీవల వరకు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి డివై చంద్ర చూడు తండ్రి ఆనాడు ప్రదాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి Y. V. చంద్రచూడ్ పెన్షనర్ల న్యాయపరమైన అంశాల పైన లోతుగా పరిశీలించిన అనంతరం ఐదుగురు సభ్యుల ధర్మాసనం1982 డిసెంబర్ 17వ తేదీన చారిత్రాత్మకమైన తీర్పును ఇవ్వడం ద్వారా పెన్షనర్ల హక్కులను ఆత్మస్థైర్యాన్ని పెంచడం అభినందనీయం. అలాగే ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలకు సంబంధించిన ఏ అంశము లోపల నైనా రాజ్యాంగబద్ధంగా హక్కులు పొందలేని పరిస్థితిలో వారికి అండగా ఉండడం ద్వారా పెన్షనర్లుగా మనము కూడా ప్రజల సమస్యల పరిష్కారంలో కృషి చేయడానికి ఈ తీర్పును ప్రస్తుతం పొందుతున్న వేతనాలను స్ఫూర్తిగా తీసుకోవలసిన అవసరం మనకు ఉన్నది.తీర్పులోని ముఖ్యాంశాలను ప్రస్తావించినప్పుడు పెన్షన్ అనేది యజమాని లేదా ప్రభుత్వం ఇచ్చే దయాభిక్ష కాదు అది ఉద్యోగ హక్కు. పెన్షన్ అనేది కేవలం సానుభూతితో ఇచ్చేది మాత్రం కాదు ఉద్యోగ కాలంలో గతంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఇచ్చే గౌరవ భృతి అని గుర్తించాలి.ఉద్యోగి ఉద్యోగ విరమణ అనంతరం అతని వృద్ధాప్య జీవితం గౌరవప్రదంగా స్వశ క్తి పైన ఆధారపడి జీవించాలి.ఒక నిర్దిష్టమైన తేదీని నిర్ణయించి ముందు వెనుక పెన్షన్లలో వ్యత్యాసం శాస్త్రీయత కాదు ఒక క్యాడర్లో రిటైర్డ్ అయిన వారిని ఒకే తరగతి గా గుర్తించి పెన్షన్ మంజూరు చేయాలి.అత్యుత్తమ ఆదర్శవంతమైన పెన్షనర్ యొక్క గౌరవాన్ని గుర్తించే విధంగా ఇచ్చిన ఈ తీర్పు వల్ల దేశంలోని లక్షలాదిమంది పెన్షనర్లకు ఆనాడు మేలు జరగడమే కాకుండా ప్రభుత్వం ఆమోదించి కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో అమలుచేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా చారిత్రాత్మక తీర్పు వచ్చిన డిసెంబర్ 17వ తేదీని అఖిల భారత పెన్షనర్ల దినోత్సవం గా జరుపుకోవదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.తద్వారా పరస్పర అవగాహనతో జీవించడానికి అవసరమైన సందర్భంలో మద్దతు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంతటి పోరాటానికి సగౌరవంగా సుప్రీంకోర్టులో గెలుపు సాధించడానికి నాయకత్వం వహించిన డి.ఎస్ నకార వ్యక్తిగత జీవితాన్ని కూడా తెలుసుకోవడం అవసరమే కదా!డి ఎస్ నకార 8 ఏప్రిల్ 1914 న ముంబైలో జన్మించి అలహాబాద్ యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్ లిటరేచర్ లో పట్టా తీసుకోవడంతో పాటు ఉర్దూ తదితర భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసులో 1934 డిఫెన్స్ అకౌంటింగ్ శాఖలో ఉద్యోగంలో ప్రవేశించి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో సేవలందించి ప్రాగా టూల్స్ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి రక్షణ శాఖలో ఆర్థిక సలహాదారుగా నిజాయితీగా సేవలు అందించి 1972లో పదవి విరమణ చేయడం జరిగింది. అప్పటికి పెన్షన్ మంజూరు లో ఉన్నటువంటి అసంబద్ధ విధానాలు, అవకతవకలు, వివక్షత పైన దృష్టి సారించిన డిఎస్ నకారా పోరాట అవశ్యకతను అందరికీ తెలియజేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. 19 79 లో చేసిన కేంద్ర ప్రభుత్వ చట్టం కూడా మరింత వివక్షతకు గురి చేయడంతో డిఎస్ నకార మరింత పట్టుదలగా న్యాయ పోరాటం చేయడం ద్వారా పైన తెలిపినటువంటి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు సాధ్యమైంది. నిరంతర పోరాటము, సాధన, పట్టుదల లేకుండా ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమాల డిమాండ్ కూడా సాధ్యం కాలేదు.ఆ కోవలోనే పట్టువదలని విక్రమార్కుడిలా కృషిచేసి పె న్షనర్లకు హక్కులు సాధించి పెట్టిన డి.ఎస్ నకార 94 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని గడిపి 29 జూలై 2009న మరణించినప్పటికీ ఆయన పెన్షనర్ల ఆశాజ్యోతి గా ఇప్పటికీ దేశంలోని పెన్షనర్ల గుండెల్లో నిరంతరం చైతన్యం కలిగిస్తూనే ఉంటాడు. అతని ప్రోద్బలం ప్రోత్సాహం స్ఫూర్తితో ప్రజల సమస్యల పరిష్కారం లోనూ ఉద్యోగులు పెన్షనర్లుగా సామాజిక బాధ్యతగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే ఆయనకు మనం నిజమైన నివాళి అర్పించగలం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)