పూజలు చేయడం,  శ్రీరామనవమి జరుపుకోవడం,  

రాముని తలుచుకోవడం  దేశద్రోహం ఏమీ కాదు.*

May 11, 2024 - 22:29
Jun 6, 2024 - 17:11
 0  25
పూజలు చేయడం,  శ్రీరామనవమి జరుపుకోవడం,  

కానీ ప్రజల గురించి పట్టించుకున్న వాళ్లకు  దేశద్రోహం అంటగడితే ఎలా  ?

ఎన్నికల సమయంలో ప్రజా ఎజెండా  ముఖ్యం మతం  

వ్యక్తిగతానికి   వదిలిపెడితే మంచిది.

---  వడ్డేపల్లి మల్లేశం

ప్రజాస్వామ్యంలో   ప్రజలే గీటురాయి  ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్  అంటూ ప్రజాస్వామ్యాన్ని  నిర్వచించుకున్న మనం  అన్ని విషయాలలో మాత్రం ప్రజలను విస్మరించడం,  ప్రజా జీవితంతో సంబంధము లేని  నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపని అంశాలతో  రాజకీయ ఎజెండాను తయారు చేసుకుని దానిని ప్రజల ముందు ఉంచడం, ఎన్నికల్లో  పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా ప్రజల విశ్వాసాల పునాదులపై  లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయింది. "రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఓటు హక్కు ఆధారంగా  చైతన్యవంతులై  ప్రజలు రాజకీయాలను శాసించాలని,  సామాన్య ప్రజలు పాలకులుగా ఎదగాలని, ప్రలోభాలకు గురి అయ్యి బానిసలుగా మారకూడదని  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఒకవైపు ప్రజలను హెచ్చరించి ప్రజాస్వామ్యం అంటే  ఇది అని తేల్చి చెప్పిన సందర్భం మనందరికీ తెలుసు. కానీ దానికి భిన్నంగా  పరిపాలనలో ప్రజా విధానాలు లేకుండా ప్రజల విశ్వాసాలు దేవాలయాలు, రామాలయాలు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై  అనే నినాదాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ద్వారా  పార్టీ వైపు ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తే  ఆ విశ్వాసాల పునాదుల మీద ఏర్పడే ప్రభుత్వం ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుందో జనం అర్థం చేసుకోవాలి.

  సవాల్ కు జవాబు లాగా రాజకీయ పార్టీలు  ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, లేదా తమ పరిపాలనలో  అమలు చేసినటువంటి సౌకర్యాలు, విధానపరమైన నిర్ణయాలు  ప్రజల ముందు ఉంచడం ద్వారా  తమ నిబద్ధతను చాటుకోవాలి. కానీ  ఒక రాజకీయ పార్టీ  పదేళ్లుగా ఈ దేశాన్ని  పరిపాలిస్తే ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా  ప్రజల విశ్వాసాల మీద ఆధారపడి కొనసాగుతుంటే  అది నిజమైనటువంటి లౌకిక సామ్యవాద రాజ్యాంగబద్ధమైన పార్టీ ఎలా అవుతుంది?  ఇక మరొక పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని  గత పది సంవత్సరాలు పరిపాలన చేసి  ఇచ్చిన హామీలను పదేళ్లలో అమలు చేయకుండా పెట్టుబడుదారి భూస్వామ్య వర్గానికి వంత పాడి  తమ వర్గపు వారిని అధికార యంత్రాంగంలోనూ ప్రజా ప్రతినిధులుగా ఎదిగి  వచ్చేలా ప్రోత్సహించడంతోపాటు ప్రజాసంపదను దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి  నిన్నగాక మొన్న ఎన్నికైన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  హామీలు అమలు చేయడం లేదు ఎందుకని ప్రశ్నిస్తే  ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు .

 బాధ్యతలు నిర్వహించని వారికి హక్కులు ఉండనట్లే  తమ పదేళ్ల పాలనలో  ప్రజలను విస్మరించిన రాజకీయ పార్టీకి  ప్రశ్నించే అధికారం ఉండదని తెలుసుకోవడం అవసరం . అందుకే కదా మెజారిటీ మేధావులు బుద్ధి జీవులు ప్రజాసంఘాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించాలని పిలిపించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం బీజేపీ పట్ల అదే వైఖరితో వున్న విషయాన్ని గమనించాలి.

మరికొన్ని విషయాలలోకి వెళ్తే *

ప్రస్తుతం 18వ లోక్సభ ఎన్నికలు  సుమారు 44 రోజులపాటు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన జరగనున్న వేల  గత కొన్ని రోజులుగా జరిగిన ప్రచారంలో ప్రచార అంశాలను సరళని పరిశీలిస్తే  చెప్పుకోవడానికి ప్రజలు వినడానికి అర్థం చేసుకొని తమ ఓటును సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉండాలి కదా !అలాంటిదే లేకుండా  ఎదుటి పక్షాన్ని మాత్రమే విమర్శిస్తే నీ గురించి ఎదుటి ప్రజలు ఎలా నమ్ముతారు ఎలా విశ్వసిస్తారు నీ సత్తా ఎలా తెలుస్తుంది అర్థం చేసుకోవాలి . ఇక దేశవ్యాప్తంగా  బిజెపి సారధ్యంలోని  ఎన్ డి ఏ  ఈ దేశంలో రామాలయాన్ని నిర్మించినామని , రాముని పూజించడం , శ్రీరామనవమి ఉత్సవం జరుపుకోవడం భక్తిని కలిగి ఉండడం దేశద్రోహమా  అనే చర్చ  జాతీయ స్థాయి నాయకులే ప్రజల ముందు ఉంచినప్పుడు ప్రజలు బుద్ధి జీవులు మేధావులు ఆలోచించవలసిన అవసరం ఉంది.

 ఎందుకంటే  సమ్మతమైన జీవన విధానం మతం అది వ్యక్తిగతమైనటువంటిది . ఆయా మతాలవారీగా ఉండే సాంప్రదాయాలు ఆచారాలను అనుభవించి ఆచరించే క్రమంలో పరమత సహనం కూడా అవసరమని మతాలు ఉద్బోధిస్తున్నాయి . ఆ సందర్భంలోపల రామాలయాన్ని నిర్మించడం కానీ పూజించడం కానీ ఉత్సవాలు జరుపుకోవడం కానీ దేశద్రోహం కానేకాదు.  పైగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే చేసిన ప్రసంగంలో  దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అని కూడా ఒక ముగింపు ఇవ్వడం జరిగింది  .సర్వ సాధారణంగా ఎన్నికలవేళ ఎప్పుడైనా కూడా  భక్తి ఆధ్యాత్మిక విషయాలు  వ్యక్తిగతంగానే చూడవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది.

 కానీ ప్రజా యజెండాను విస్మరించి  ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఇచ్చిన హామీలను విస్మరించి నమ్మకాల మీద ఆధారపడి మాత్రమే  ఎన్నికల్లో గెలుస్తామని 400 పైగా సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చుతామని పదేపదే  పార్టీ నాయకులు ఎక్కడికక్కడ మాట్లాడడం ప్రధానమంత్రి మాత్రం అలాంటి ప్రస్తావన లేదు అని చెప్పడం గమనించాలి.  పూజలు చేయడం ఉత్సవాలు జరుపుకోవడం దేశద్రోహమా? అని ప్రశ్నిస్తే కాదు అని మనం సమాధానం చెప్పాలి. కానీ ఈ దేశంలో అశేష కొట్లాది ప్రజానీకం అట్టడుగు స్థాయిలో జీవిస్తూ అనేక కష్టనష్టాలు   అసమానతలు అంతరాలు దోపిడీ పీడన వంచన  కు గురవుతున్న వర్గాల పక్షాన  మేధావులు బుద్ధి జీవులు అభ్యుదయవాదులు రచయితలు కవులు కళాకారులు   పెట్టుబడిదారీ వర్గంతో పాలకులతో  భూస్వామ్య వర్గంతో ప్రజా ఉద్యమాలలో పోరాడితే  ప్రభుత్వం వారిని దేశ ద్రోహ చట్టం కింద జైలు పాలు చేసి  సంవత్సరాల తరబడి  శిక్షించే అధికారం ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారు? గత పది ఏళ్లలో  ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా  సుమారు 9 1/2 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించి ఇటీవలనే సుప్రీంకోర్టు చే నిర్దోషి అని ప్రకటించబడినప్పుడు

  శిక్ష అనుభవించిన కాలానికి ఎవరు జవాబు దారి అవుతారు తెలియజేయవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది . పౌర హక్కుల నాయకులు వరవరరావు లాంటి అనేకమంది మేధావులు దేశవ్యాప్తంగా   జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్యం పాలై  ఈ దేశ ప్రజల కోసం తమ జీవితాలను బలి పెడుతుంటే  వీరు చేసిన దేశద్రోహం ఏమిటో   చెప్పగలరా?  మోపినటువంటి నేరాన్ని  రుజువు చేయలేని ప్రభుత్వ అసమర్థత కారణంగానే సర్వోన్నత న్యాయస్థానం  నిర్దోషి అని సుమారు 10 ఏళ్ల తర్వాత  విడుదల చేసింది అంటే ఇలాంటి అక్రమ కేసులు విచారణ ఖైదీల పేరుతో సంవత్సరాల తరబడి అనుభవిస్తున్నటువంటి వారు ఈ దేశంలో లక్షలాదిమంది ఉన్నప్పుడు వారికి సమాధానం ఎవరు చెప్పాలి? వారు చేసిన దేశద్రోహం ఏమిటో  ప్రకటించకుండా కేవలం  పూజలు చేస్తే దేశద్రోహమా అని రాజకీయ పార్టీ ప్రజలను ప్రశ్నించడం అంటే  ప్రజలను తప్పుదారి పట్టించడం ప్రజా ఉద్యమాలను ప్రతిఘటన ఉద్యమాలను  అసమానతలు అంతరాలను  చట్టబద్ధం చేయడమే అవుతుంది .

 ఏ వర్గానికి చెందిన నాయకుడు అధికారంలోకి వస్తే తన వర్గం వారిని అధికార పీట0 మీద కూర్చుండబెడుతూ  పదవులను కట్టబెట్టి వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నప్పుడు  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు  దేశ రాజ్యాధికారంలో వాటా లేకుండా  ప్రేక్షక పాత్ర వహిస్తుంటే  ఇది ఎలా సమంజసము  ప్రజలుగా ఇప్పటికీ ఆలోచించుకోవాలి.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  దేశ పర్యటన సందర్భంలోనూ అనేక  ఎన్నికల సభల్లోనూ  90 శాతం గా ఉన్నటువంటి  వర్గాలకు రాజ్యాధికారంలో వాటా కల్పించడమే తమ లక్ష్యమని  ప్రకటించినప్పుడు  ఆ వైపుగా పాలకులు దృష్టిసారించవలసిన బాధ్యత ఉన్నది . ఆ హామీని నెరవేర్చడానికి సిద్ధంగా లేకపోతే ప్రజలు దేశవ్యాప్తంగా ఎప్పుడైనా  ప్రతిఘటిస్తారని తెలుసుకోవడం చాలా అవసరం. ఆ వైపుగా ప్రజా ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి  

 గత పది ఏళ్లలో దేశంలో జన గణన చేయాలని బీసీ జనాభాను  లెక్కించాలని  ప్రణాళికలు ప్రకటించాలని బడ్జెట్లో నిధులను కేటాయించాలని  బీసీ ఉద్యమాలకు  సర్వోన్నత న్యాయస్థానం మద్దతు ప్రకటించినప్పటికీ స్వయంగా ప్రధాని కేంద్ర ప్రభుత్వం  అంగీకరించకపోవడం అంటే మెజారిటీ 56 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలను  నిర్లక్ష్యం చేయడం  నిజంగా  దేశద్రోహం అనుకోవలసిందే.  ఇప్పటికైనా ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కల్పన, పేదరిక నిర్మూలన,  అంతరాలు అసమానతలు నిర్మూలించడం,  సంపద కేంద్రీకృతం కాకుండా చూడడం, పెట్టుబడిదారి వర్గాలకు చేసిన రుణమాఫీని తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయించడం, నల్లధనాన్ని ఇతర దేశాల నుండి తెప్పించి  ప్రజల ఖాతాలకు జమ చేయడం వంటి చర్యలను  ప్రకటించడం ద్వారా  నిజమైన ప్రజా ఎజెండా  ప్రజల ముందు ఉంచినట్లు అవుతుంది .

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు  హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333