పంట మార్పిడి విధానాలతో రైతులకు మేలు

Aug 27, 2026 - 20:01
 0  9
పంట మార్పిడి విధానాలతో రైతులకు మేలు
పంట మార్పిడి విధానాలతో రైతులకు మేలు

నానో యూరియా వినియోగించేలా ప్రోత్సహించాలి. 

ఆయిల్ పామ్ తోటలతోనూ మంచి ఆదాయం.

రైతు బీమా దరఖాస్తులను పెండింగ్ లో ఉంచవద్దు.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

జోగులాంబ గద్వాల 27 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. పంట మార్పిడి విధానాలతో రైతులకు మేలు దిగుబడులు సాధించవచ్చు అని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన భాష షేక్ అన్నారు, ప్రస్తుత ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున అన్నదాతలు ఆరుతడి పంటలు సాగు చేసేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలని వారన్నారు. 

ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ సహకారంతో, వ్యవసాయ, ఇఫ్కో క్రిడ సంస్థల ఆధ్వర్యంలో గురువారం ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులకు నానో ఎరువులపై నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని, అన్నదాతలకు నష్టం వాటిల్లకుండా సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో పనిచేయలన్నారు. జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గడంతో రైతులు కాలువలు ద్వారా సాగునీటిపై ఎక్కువగా ఆధారపడకుండా కూరగాయలు, పప్పు దినుసులు వంటి స్వల్పకాలిక ఆరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ లో పంటలు సాగు చేయని రైతులు రబీ సీజన్ కు త్వరగా వెళ్లే అవకాశం ఉన్నందున రబీ సీజన్ లో కూడా వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల వరి విత్తనాలకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా బోనస్ చెల్లించడం జరుగుతుందని ఇప్పటికే ప్రకటించినందున అధికారులు ఆ రకాలను సాగు చేసిన రైతుల వివరాలను సంబంధిత పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఇప్పటికే ఖరీఫ్ లో వరి సాగు చేసిన రైతులకు సాగునీరు సరిపోని సమయంలో బోరుబావులపై ఆధారపడాల్సి వస్తుందని, రబీలో ఎట్టి పరిస్థితుల్లో రైతులు వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలకే ప్రోత్సహించాలన్నారు. సాధారణ యూరియాను అధిక మొత్తంలో వాడడం వలన నేల సారవంతత కోల్పోతుందని దీని స్థానంలో రైతులు నానో యూరియాను పెద్ద ఎత్తున వినియోగించేలా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కలిగించాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలతో మహిళా రైతులు డ్రోన్లను కొనుగోలు చేసి కూడా ఎరువుల పిచికారికి వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే శాతం పెరగాలని, రైతు భీమా దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లెయిమ్ చేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ తోటలతో రైతులకు మంచి రాబడులు ఉంటాయని, ఇందులో అంతర పంటలు సాగు చేసి కూడా అదనపు ఆదాయాన్ని అర్జించవచ్చన్నారు. పిఎండిడికేవై పారామీటర్స్ లో ఉన్నతి సాధించేలా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలన్నారు. ప్రకృతి, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ప్రతి గ్రామం నుంచి చాంపియన్ ఫార్మర్స్ గుర్తించి డేటా పంపాలని ఆదేశించారు. వన మహోత్సవంను విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో న్యూట్రి గార్డెన్స్ కు కృషి చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో రైతుల సంక్షేమానికి వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లవేళలా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పలువురు రైతులు నానో యూరియాను వినియోగించి తాము సాగు చేసిన పంటల గురించి అనుభవాలను తెలియజేశారు. 

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, ఉద్యానవన శాఖ అధికారి రాజ్ కుమార్, ఇఫ్కో మేనేజర్ కృపాశంకర్, క్రిడ సీనియర్ శాస్త్రవేత్త గిరిజాదేవి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333