నిత్య శ్రామికుడు...! నిరంతర ప్రజా సేవకుడు

Feb 17, 2026 - 19:30
 0  56
నిత్య శ్రామికుడు...! నిరంతర ప్రజా సేవకుడు
నిత్య శ్రామికుడు...! నిరంతర ప్రజా సేవకుడు

నిస్వార్థ సేవకు దక్కిన ఫలితం...!

భాయ్ షఫీ... ఆల్వేస్ హ్యాపీ...!!!

✍️ డాక్టర్ కృష్ణ బంటు, గోల్డ్ మెడలిస్ట్

"నీ బాధ్యతను నువ్వు క్రమశిక్షణతో నిర్వర్తించు ఫలితం కోసం ఎదురు చూడకు, ఫలితం తప్పకుండా నీకు అనుకూలంగానే వస్తుంది" అన్న సిద్ధాంతాన్ని మనసంతా నింపుకొని, నిరంతర ప్రజాసేవతోనే ప్రజల హృదయాలలో స్థానాన్ని పదిలం చేసుకున్న 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో  25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ప్రజా ప్రతినిధిగా, ప్రజల అభిమాన నాయకుడుగా వెలుగొందుతున్న షఫీ ఉల్లా కు దక్కిన మరో గొప్ప సత్కారం సూర్యపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి. "విమర్శలు ఎన్ని ఉన్నా వాటన్నింటినీ లెక్క చేయక నీ దారిలో నువ్వు నడువు, మౌనంగా నీ లక్ష్యం కోసం కృషి చెయ్, నీ విజయమే ఈ ప్రపంచానికి అతి పెద్ద శబ్దంగా వినిపిస్తుంది" అన్న సిద్ధాంతానికి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా జీవితమే ఒక ఉదాహరణ. అన్నా అంటే నేనున్నా అంటూ నిద్రలేచింది మొదలు తాను కౌన్సిలర్ గా ఉన్న వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం కోసం కృషి చేసే ఏకైక నాయకుడు షఫీ ఉల్లా గా ఆ ప్రాంత ప్రజలు  నిత్యం స్మరిస్తూ ఉంటారు. నాలుగుసార్లు కౌన్సిలర్ గా, ఒకసారి మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిగా అపార రాజకీయ అనుభవం గడించిన షఫీ ఉల్లా తాను ప్రజాప్రతినిధిగా చేసిన నిస్వార్థ ప్రజా సేవకు దక్కిన ఫలితంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి అని చెప్పుకోవచ్చు. దాదాపు ఆరడుగుల ఆజానుబావుడుగా, నెరసిన గడ్డంతో, ప్రసన్న వదనంతో, సౌమ్యపు పలకరింతతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తలపించే విధంగా "సూర్యాపేట చంద్రబాబు" గా అభివర్ణిస్తుంటారు. ఎవరిని నొప్పింపక తా నొవ్వక తన పని తాను చేసుకుపోతూ, అనవసర విమర్శలకు, కాంట్రవర్సీ విషయాలకు, పరస్పర దూషణలకు, దౌర్జన్యాలకు, అక్రమాలకు, అవినీతికి దూరంగా ఉంటూ మచ్చలేని రాజనీతిజ్ఞుడుగా షఫీ ఉల్లా వెలుగొందడం అంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి రాజకీయ నాయకులు ఈ విధంగా ఉంటారా అని ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తున్నా  షఫీ ఉల్లా విషయంలో అది వందకు రెండు వందల శాతం సత్యంగా పేర్కొనవచ్చు. ఒక సినీ కవి రాసినట్టు "ఎదిగిన కొద్దీ ఒదగమనీ"అన్న సూత్రాన్ని వంట పట్టించుకున్న షఫీ ఉల్లా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం గుండెల నిండా నింపుకొని తను వెల్లా పునికి పుచ్చుకున్న ఒక నీతి, నిజాయితీ, నైతికతలకు నిలువుటద్దం. జీవితంలో ఎన్నో కష్టాలను, కన్నీళ్లను చవి చూసిన ఆయన ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి, కష్టాలనే ఇష్టాలుగా చేసుకొని, బాధలనే ఆయుధాలుగా మలుచుకుని, పేదరికంలో మగ్గుతున్నప్పటికీ ఎవరి వద్ద చేయి చాచని ధీరత్వం కూడిన వ్యక్తిత్వం ఆయన సొంతం. పదవుల కోసం పరువు ప్రతిష్టలను తాకట్టుబట్టే నేటి కుహనా రాజకీయ మేధావులు ఉన్న ఈ కాలంలో, పదవుల కోసం ఆయన ఏనాడు ప్రాకులాడలేదు, ప్రాధేయపడలేదు, అర్రులు   చాచలేదు, అతిగా ఆశపడలేదు, ఆడంబరాలకు పోలేదు, అందుకే పదవుల కోసం ఆయన కాదు, పదవులే షఫీ ఉల్లాను వెతుక్కుంటూ వచ్చాయి. మొదట తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాక ఎన్నో అవకాశవాద రాజకీయాలు, ప్రలోభాలు తన వద్ద కు వచ్చినప్పటికీ నిజాయితీగల, నికార్సైన నాయకుడుగా వ్యవహరించాడు తప్ప ఎవరితోనూ లాలూచీ పడలేదు, ఎవరితోనీ కుమ్మక్కు కాలేదు, ఎక్కడా కుయుక్తులు పన్నలేదు."ఏదైనా పదవికి తాను అర్హుడను అయితే ఆ పదవి దక్కుతుంది, ఒకవేళ నేను అర్హుడిని కాకపోతే నాకు ఎలాంటి పదవి వద్దు" అన్న నైతిక సూత్రాలను మదిలో నింపుకొని మెదిలే నిత్య శ్రామికుడు, నిరంతర ప్రజా సేవకుడు షఫీ ఉల్లా. జీవన సమరంలో సంసార నావ సాగటానికి ఉన్నత విద్యావంతుడైన ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే  కుటుంబాన్ని పోషించుకుంటున్నారు."సింపుల్ గా జీవించు, ఉన్నతంగా ఆలోచించు"అన్న షఫీ ఉల్లా స్వభావం ఇతరులకు ఆదర్శం. పారదర్శకత (ట్రాన్స్పరెన్సీ)ఆయనలో మరో గుణం. దోచుకో దాచుకో అన్న దానికి ఆయన బద్ధ వ్యతిరేకి. దాచుకొని, మూసుకొని, మభ్యపెట్టి, మాయ మాటలు చెప్పి, అవసరాలు తీరడానికి అవకాశవాద రాజకీయాలు ఆయన ఏనాడూ చేయలేదు. గ్రూపు రాజకీయాలకు, వెన్నుపోటు రాజకీయాలకు ఆయన బహుదూరపు బాటసారి. కుండ బద్దలు కొట్టినట్టు ముక్కు సీటుగా వ్యవహరించడం, తన వల్ల ఏదైనా చేయగలిగితే చేయడం, అది న్యాయబద్ధం కాదంటే చేయనని ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేయడం, సత్యం మాత్రమే మాట్లాడటం, ఆపదలో ఉన్న వారికి చేతనైన సహాయం చేయటం ఆయనలోని సుగుణాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అర్హులకు తప్పకుండా పదవులు వస్తాయో, రావో మన నిర్ణయించలేం కానీ అర్హుడైన షఫీ ఉల్లాలాంటి వ్యక్తికి మాత్రం మున్సిపల్ వైస్ చైర్మన్ దక్కడం అంటే అర్హుడికి దక్కిన అరుదైన గౌరవంగా మన భావించవచ్చు. తనను  మెచ్చి తనకు ఇచ్చిన ఇంత గొప్ప మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని కాంగ్రేస్ అధిష్టానం  కట్టబెట్టడం పట్ల షఫీ ఉల్లా సంతోషం వ్యక్తం చేస్తూ ఇందుకు కారకులైన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిజాయితీగా, నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333