నిందల పాలవుతున్న టిఆర్ఎస్ పార్టీ
ఇతర విపక్షాల విమర్శతో దిక్కు తోచని స్థితిలో ప్రధాన ప్రతిపక్షం. ప్రజలు చీత్కరించినా గుణపాఠం రాలేదా అని పలువురి అసహనం.
శాసనసభ్యుల కొనుగోళ్లకు పాల్పడింది నిజం కాదా అని సీపీఐ సూటి ప్రశ్న.
ఓటమిని తట్టుకోలేక రెచ్చిపోతే ప్రజలు, బుద్ధిజీవులు దాడి చేయడం ఖాయం.
--- వడ్డేపల్లి మల్లేశం
ప్రజల నాడిని బట్టి పరిపాలన కొనసాగిస్తే అది కొంతవరకు సుపరిపాలన అవుతుంది. ప్రజలను ఖాతరు చేయకుండా బానిసలుగా చూసి, ఆదిపత్యాన్ని చలాయించి, అహంకారాన్ని ప్రదర్శించి, అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఏ ప్రభుత్వానికైనా ఓటమి, అవమానము, ఛీత్కారాలు తప్పవు. పరిపాలనకు ఉన్న ఈ కనీస ధర్మాలను రాజ్యాంగ నేపథ్యంలో సామాజిక బాధ్యతలను ఏ ప్రభుత్వాలు అయితే విస్మరిస్తాయో అవి శాశ్వతంగా ప్రజల చేతిలో ఓటమి పాలు కాక తప్పదు . అయితే సవరించుకొని, తప్పులను అంగీకరించి, ప్రజల ముందు మోకరిల్లి, ప్రజలను ప్రభువులు గా చూసే సంస్కారాన్ని ప్రదర్శించే రాజకీయ పార్టీలకు కొంత అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ అదే అహాన్ని ఓటమి తర్వాత కూడా చట్టసభల్లో ప్రదర్శించి,
ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకుండా, తమ ఓటమికి కల కారణాలను విశ్లేషించుకోకుండా, ప్రభుత్వం మీద నియంతృత్వ ధోరణితో విమర్శలకు పాల్పడి సభను విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఆ రాజకీయ పార్టీకి ప్రజలు ప్రభుత్వం చేతిలో పరాభవమే మిగులుతుంది. ఈనాడు అలాంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వంతో సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కొనసాగుతున్నప్పటికీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన టిఆర్ఎస్ పోషిస్తున్న పాత్ర అక్షరాల ఈ సన్నివేశానికి వర్తిస్తుంది. ఇతర విపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రభుత్వం ముప్పేట విమర్శలకు దిగినా చేసిన నేరాన్ని అంగీకరించని ప్రజల ముందు తలవంచని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో చూడవచ్చు.
9న్నర ఏళ్ల సుదీర్ఘ పాలనలో వెనుక ముందు చూడకుండా చేసిన అప్పులు, యువతకు చేసిన ద్రోహం, పరిపాలనలో చోటు చేసుకున్న డొల్లతనం, రాజకీయ ఉద్యోగ వర్గాలలో నెలకొన్న అవినీతి అంతా అంతా కాదు. ఈ దుస్థితికి బాధ్యురాలైన టిఆర్ఎస్ పార్టీ బాధ్యులు మాజీ ముఖ్యమంత్రి మంత్రివర్గం పైన విచారణ జరిపించి దోషులను శిక్షించవలసిన అవసరం ఉందని అనేక వర్గాల నుండి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో కూడా రాజీ పడకపోతే సభా కార్యక్రమాలకు విఘ్నం కలిగిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ప్రజాధనంతో ప్రజల కోసం పనిచేసే సుపరిపాలన కోరుకునే కోట్లాది ప్రజల ఆకాంక్ష.
టిఆర్ఎస్ పార్టీ వైఖరిపై విపక్షాల ఘాటైన విమర్శలు:-
కెసిఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారి పైన తగు చర్యలు తీసుకొని శిక్షించాలంటే బాధ్యులైన టిఆర్ఎస్ నాయకుల పాస్పోర్టులను సీ జు చేయాలని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం పెద్ద సవాల్. విచ్చలవిడి నేరాలతో ఉన్న వారంతా తప్పించుకుపోయే ప్రమాదం ఉన్నదని ఆ కుటుంబ పెద్దలకు సహకరించిన అధికారుల పాస్పోర్టులను కూడా సీజ్ చేయాలని కోరడం ఆసక్తికరంగా మారింది . భూ కబ్జాలు ఇతర అవినీతి ఆరోపణల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కూరుకుపోయారని కాలేశ్వరం ప్రాజెక్టుతో సహా ఇతర అవినీతి సంఘటనలపై విచారణ జరిపించాలని ఆయన చేసిన డిమాండు కేవలం ఒక పార్టీది కాదు ప్రజల పక్షాన ప్రభుత్వానికి చేసిన డిమాండ్ గా భావించవలసి ఉంటుంది. అయినా టిఆర్ఎస్ ప్రధాన బాధ్యులకు తలకెక్కడం లేదంటే తమ గోతిని తామే తవ్వుకోవడానికి సిద్ధంగా ఉన్నారని భావించవలసి ఉంటుంది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో తలపెట్టిన నిర్మాణాలకు వ్యతిరేకంగా గత ఆరేళ్లుగా ఆ ప్రాంత ప్రజలు ధర్నాలు రాస్తారోకోలు పాదయాత్రలు చేసిన పట్టించుకోలేదని నిర్బంధంగా అమలు చేసే ప్రయత్నం చేశారని అనివార్యంగా టిఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వైపు దృష్టి సారించక తప్పలేదని టిఆర్ఎస్ పార్టీ ఓటమి ప్రజల ఆకాంక్ష అని ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులు జిల్లా రైతులు కేటీఆర్ కు హెచ్చరిక చేశారు ఇప్పటికైనా ప్రజా తీర్పును ఒప్పుకొని ఓటమిని అంగీకరించాలని చేసిన డిమాండు గత పాలన పట్ల వివిధ వర్గాలకు ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలియజేస్తున్నది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో అట్టర్ ప్లాప్ అవుతుందని శాపనార్థాలు పెట్టడం పలు విమర్శలకు గురికాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014 నుండి బారాస ప్రభుత్వమే పరిపాలించినప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీని విమర్శించే అధికారం ఎక్కడిదని పలువురు ఆక్షేపణ తెలిపారు. మాట మాటకు 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన గూర్చి మాట్లాడి విమర్శలకు గురైన కేటీఆర్ హరీష్ రావులపై ఒక దశలో సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అసహనం వ్యక్తం చేయడంతో పాటు బే రసారాలు మొదలు పెడతారా? ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారా? కేటీఆర్ అలా మాట్లాడడం మంచిది కాదు అని హెచ్చరించిన తీరు బి ఆర్ ఎస్ శాసనసభ్యుల అసంధర్భ వాదనకు చెక్ పెట్టినట్లుగా భావించాలి . పదే పదే కాంగ్రెస్కు 64 మంది సభ్యులు ఉంటే తమకు 39 మంది సభ్యులు ఉన్నారని ఎలా పరిపాలన చేస్తారో చూస్తామని కేటీఆర్ బెదిరించడం అహంకారానికి నిదర్శనం కాదా అని ప్రజలు ప్రజాస్వామికవాదులు ఇతర విపక్షాలు అభ్యంతరం తెలియచేస్తున్నారు .
ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం ఏడాది కూడా ఉండదు అని టిఆర్ఎస్ శాసనసభ్యులు హెచ్చరిస్తున్నారంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కొంతమంది శాసనసభ్యులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని అది మంచిది కాదని సీనియర్ శాసనసభ్యులుగా ఆయన హితవు పలకడం శాసనసభలో శనివారం 16 డిసెంబర్ రోజున చోటు చేసుకున్న ప్రధాన సంఘటనగా భావించవచ్చు. ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని సూచిస్తూనే గత పది ఏళ్ల కాలంలో కొనుగోలు అమ్మకాలు విపరీత స్థాయిలో జరిగినాయని ఈ విషయం పైన ప్రజల్లో సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నదని చర్చకు అవకాశం ఇస్తున్నామంటే మనం చట్టసభల సభ్యులుగా అర్హులం కాదు అని పరోక్షంగా చురకలంటించడం టిఆర్ఎస్ వికృత ధోరణికి హెచ్చరికగా భావించవలసిన అవసరాన్ని చాటి చెబుతున్నది. స్వేచ్ఛ లేని జీవితాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించబోరని టిఆర్ఎస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేని కారణంగానే ప్రజలు తిరుగుబాటు చేసి ఓడించినారని అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన ప్రసంగం ఇకనైనా బాధ్యులలో సోయి తెప్పిస్తే సంతోషం . తెలంగాణ ధనిక రాష్ట్రమని, అన్నింటిలో నంబర్ వన్ అని, బంగారు తెలంగాణ అని పదే పదే ప్రచారం చేసుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏనాడైనా ఒకటో తేదీన జీతాలు చెల్లించినారా? అని ప్రశ్నించడంతోపాటు ఇప్పటికీ విద్యార్థులకు సుమారు 7000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదంటే గత పాలన ఎంత దుర్మార్గం అయిందో అర్థం చేసుకోవాలని సాంబశివరావు చేసిన ప్రకటన కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం . సాంబశివరావు ప్రసంగిస్తుంటే పదేపదే అడ్డు తగిలిన బిఆర్ఎస్ సభ్యులను "సభలో ఇంత మంది ఇబ్బంది పెడతారా నన్ను బెదిరించలేరు" అని వారించ వలసి వచ్చిందంటే ప్రభుత్వంతోపాటు ఇతర విపక్షాలను కూడా టిఆర్ఎస్ సభ్యులు ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఎంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారో మన అర్థం చేసుకోవచ్చు. ఇదంతా టీవీ ప్రసారాల ద్వారా ప్రజలు గమనిస్తున్నారు, అవసరమైన సందర్భంలో ప్రతిస్పందిస్తారు, గత ఎన్నికల్లో ఓటమిపాలైనారంటే ప్రజల ఆకాంక్షల పరిశీలన మేరకే కదా!
ఇక ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేకమంది శాసనసభ్యులు అడ్డు తగలడం కొత్తగా శాసనసభ్యునిగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి ప్రసంగాన్ని కొనసాగానివ్వకుండా వ్యవహరించిన తీరుపైన స్పీకర్ కలగజేసుకొని " కొత్త సభ్యుడివి శాసనసభలో గడ్ బడ్ చేయకు" అని చేసిన హెచ్చరిక ఆ పార్టీ మొత్తానికి గుణపాఠమైతే బాగుండు. టీవీలు పత్రికలు ప్రసార మాధ్యమాలతో పాటు అన్నింటా వారి ప్రవర్తన ప్రజలు గమనించడం చర్చనీయాంశం కాగా సుపరిపాలనకు ఏ రకంగాను ఈ పార్టీ సహకరించే పరిస్థితులు లేవని అందరూ కూడా అసహ్యించుకోవడం గమనించదగిన విషయం ."ఇదే పరిస్థితి కొనసాగితే సభలో కూడా కొనసాగలేరు తరిమి కొడతాం" అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించవలసి వచ్చింది అంటే టిఆర్ఎస్ పార్టీ యొక్క దిగజారుడుతనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా , ప్రజా తీర్పును శిరసా వహించి, ప్రజల పక్షాన పనిచేయడం ద్వారా విశ్వాసాన్ని చూర గొనాలి కానీ అడుగడుగునా అడ్డు తలిగి అహంకారాన్ని ప్రదర్శిస్తే నిత్యం ఎదురయ్యేది చేదు అనుభవాలే జాగ్రత్త!
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)