తీవ్ర అక్రమాలకు పాల్పడితేనే  తొలగించాలి

Jul 27, 2026 - 00:30
 0  2

చట్టాలు శాసనాలను వ్యాఖ్యానించి వాటి రూపకల్పనలో చట్టసభల సభ్యుల ప్రభుత్వాల తొందరపాటు పొరపాట్లను నిర్ధారణ చేసి ప్రభుత్వాలను సైతం ఆదేశించే అధికారం భారతదేశంలో న్యాయ వ్యవస్థకు ఉంది. న్యాయవ్యవస్థకు ఉన్నటువంటి ఈ అధికారం పేద మధ్యతరగతి అట్టడుగు వర్గాలకు తాడిత పీడితులకు భరోసాగా పనిచేస్తుందని ఈ దేశ ప్రజలు బుద్ధి జీవులు మేధావులు విశ్వసిస్తున్నారు. పాలకులు పెట్టుబడిదారీ వ్యవస్థ  సామ్రాజ్యవాద  ఆదేశాలకు తలఒగ్గి  దేశ ప్రజలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ప్రజలకు అన్యాయం జరగకుండా రాజ్యాంగంలో రూపొందించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించే క్రమంలో న్యాయవ్యవస్థ అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన నిలబడిన దృష్టాంతాలు మనకు చరిత్రలో కనబడతాయి. అదే సందర్భంలో నేరస్తులుగా నిర్ధారణ కాకుండా  దోషిగా ఆరోపించబడిన వేలు లక్షలాది మంది ఇప్పటికీ కారాగారాలలో బంధించబడి చేయని నేరానికి దశాబ్దాలుగా శిక్షించబడుతూ  కుటుంబాలకు దూరమై ప్రాణాలు విడిచిన వారు కూడా అనేకం. నేరం చేస్తేనే శిక్షకు అర్హుడు కానీ నేరం నిర్ధారణ కాకుండానే అక్రమంగా నిర్బంధించబడి శిక్ష అనుభవిస్తే ఎవరిని ప్రశ్నించాలో అర్థం కాని పరిస్థితి ఇది ఒక రకంగా న్యాయవ్యవస్థకు మరొక పార్శ్వంగా భావించవచ్చు. ఈ దేశంలో న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి గలది అని స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొనబడింది కానీ  ప్రభుత్వాలు రాజకీయ నాయకులు  ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ న్యాయ వ్యవస్థను  ప్రభావితం చేస్తున్నప్పుడు  పేద వర్గాలకు న్యాయం కూడా ఎండమావిగానే భావించాల్సి ఉంది.  అయితే అనేక సందర్భాలలో పేదలు అట్టడుగు వర్గాలు  కార్మికులు ఉద్యోగులు అనేక  ఇబ్బందులకు గురైన వాళ్లు డిస్మిస్ అయిన వాళ్ళు  ఆస్తులు కోల్పోయి ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి  వివిధ సందర్భాలలో బలైన వాళ్ళ పట్ల న్యాయ వ్యవస్థ ఈ దేశంలో కఠినంగా ఆదేశించిన సందర్భాలు కూడా అనేకం. అంతెందుకు 1983లో పెన్షనర్లకు పెన్షన్ న్యాయబద్ధమైనటువంటి హక్కు అని ఇది బిక్ష కాదని ఆనాటి సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి  వైవిచంద్ర చూడు గారు ఇచ్చిన ఆదేశమే నేటి పెన్షనర్లకు రక్షణగా ఉందంటే అతిశయోక్తి కాదు కదా!

తీవ్ర అక్రమాలకు పాల్పడితేనే  తొలగించాలి :-

మహారాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలో  ఉద్యోగంలో చేరిన సురేఖ అనే మహిళ బదిలీల వ్యవహారములో  ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసి  హేతుబద్ధంగా అవకాశాన్ని పొందడం  సహించనటువంటి  ఆ సంస్థ కక్ష సాధింపు చర్యగా ఆమె పైన  తూతూ మంత్రంగా అంతర్గత విచారణ జరిపి 2006లో సస్పెండ్ చేసింది. 2017లో ఆమెను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించడంతోపాటు  ఈ మధ్య 11 ఏళ్ల సస్పెన్షన్ కాలాన్ని కూడా శిక్షగా మారుస్తూ  ఆమెకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేసింది ప్రభుత్వం.  ఈ సంఘటన పైన సురేఖ సుప్రీంకోర్టును ఆశ్రయించగా  సర్వోన్నత న్యాయస్థానం ఈ క్రింది విధంగా  ఆదేశించింది.

"ఒక ఉద్యోగి అక్రమాలకు పాల్పడి తీవ్రమైన తప్పులు చేసినప్పుడు తప్ప  ఉద్యోగము నుండి తొలగించడం  సబబు కాదని సుప్రీంకోర్టు  రూలింగ్ ఇచ్చింది  డిస్మిస్ చేయడం అనేది ఒక ఉద్యోగి జీవితాన్ని రోడ్డున పడేవేయడమేనని  ఇది చాలా కఠినమైన శిక్ష అని  వ్యాఖ్యానిస్తూ  ఒక ఉద్యోగి పైన చర్యలు తీసుకునే ముందు  సుదీర్ఘ  వయస్సు సంస్థకు చేసిన సేవ  నష్టం జరిగితే అంచనాతో  నిర్ణయం తీసుకోవాలి కానీ విచారణ పెండింగ్లో ఉన్న కాలంలో  సస్పెన్షన్  చేయడం ఎంత మాత్రం సబబు కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.  2006లో సస్పెండ్ అయిన తర్వాత 2017 వరకు  11 ఏళ్ల పాటు ఆమె చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత  ఆ మహిళా ఉద్యోగికి ఊరట కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు  కారు చీకటిలో కాంతిరేఖ లాగా  ప్రభుత్వాల యొక్క  ఒంటెద్దు పోకడను ప్రశ్నించే తీర్పుకు  నిదర్శనం గా భావించవలసి ఉన్నది.

 న్యాయస్థానం గుర్తించిన అంశాలు

ఈ కేసు పూర్వాపరాలలోకి వెళితే  ఆ ప్రభుత్వ సంస్థను  వ్యతిరేకించి తన బదిలీ హక్కును సాధించుకున్నందుకు క్రమశిక్షణ చర్యగానే కాకుండా  అంతకు మించిన స్థాయిలో తీవ్రమైన ఆరోపణల ముద్ర వేసి  సస్పెండ్ చేయడం అంటే  ప్రభుత్వం యొక్క స్పష్టమైన పొరపాటని, అవినీతికి అధికారుల మాట వినకపోవడానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నదని  పోరాడి తన హక్కును సాధించుకున్నంత మాత్రాన  అది  క్రమశిక్షణ రాహిత్యం క్రిందికి రాదని  ఆ అభాగ్యురాలికి అండగా నిలబడింది సర్వోన్నత న్యాయస్థానం. అంతేకాదు  అవినీతి లంచగొండితనం నిధుల దుర్వినియోగం  అక్రమాస్తులను కూడా పెట్టడం  వంటి తీవ్రమైన నేరాలకు  ఈ ఉద్యోగికి ఎక్కడ పొంతనలేదని  అలాంటప్పుడు ఉద్యోగం నుంచి తొలగించడం అంటే  నేరం లేని ఘోరమైన శిక్ష అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు తెలుస్తున్నది. అక్రమంగా సస్పెండ్ చేయడం వల్ల  దాదాపు 11 ఏళ్ల పాటు ఉన్న సస్పెన్షన్ కాలాన్ని  కూడా అదనపు శిక్షగా  మార్చడాన్ని  రావలసిన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేయడాన్ని  సుప్రీంకోర్టు తప్పు పట్టడం అంటే  ప్రభుత్వాల ఒంటెద్దు పోకడ ఏ రకంగా  ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా సస్పెన్షన్ కాలానికి సంబంధించి 11 సంవత్సరాల  వేతన లావాదేవీలను  ఇతర ఆర్థిక ప్రయోజనాలను   చెల్లించాలని  సుప్రీంకోర్టు ధర్మాసనం  జూన్ 2026 మాసంలో  అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించడం  భారతదేశంలోని ఉద్యోగ వర్గానికి  ప్రభుత్వాల యొక్క  ఆర్థిక అరాచక చర్యల నుండి  కొంత ఉపశమనం పొందడానికి అవకాశం ఉన్నదని  ఈ తీర్పు  ఉద్యోగ వర్గాలకు  భరోసా నిస్తుంది.

 ఈ తీర్పు నుండి ఉద్యోగులు ఏం నేర్చుకోవాలి

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో అనేకమంది ఉన్నత ఉద్యోగులు  అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలను అక్రమార్జన చేసి   ప్రభుత్వానికి పట్టుబడిన సందర్భం మనకు స్పష్టంగా కనబడుతున్నది.  ఇలాంటి కేసుల్లో  పట్టుబడిన సొమ్ము ఏమవుతుందో వారికి ఉద్యోగాలు తిరిగి ఇస్తారో ఏం జరుగుతుందో తెలియదు కానీ  పైన తెలిపిన సురేఖ అనే ఉద్యోగి యొక్క  న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ కనుకనే సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించి అక్కడి ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన విషయాన్ని గమనిస్తే  ఉద్యోగ వర్గం ఎక్కడైనా నిజాయితీగా తన బాధ్యతను నిర్వర్తించే క్రమంలో  క్రమశిక్షణకు భిన్నంగా నడుచుకోకపోతే హక్కులకు ఎలాంటి డోకా ఉండదని ఈ తీర్పు తెలియచేస్తుంది. అంతేకాదు పెన్షన్లను తగ్గిస్తామని రద్దు చేస్తామని  సిపిఎస్ పేరునా   ఉద్యోగులను దోపిడీ చేస్తున్న ప్రభుత్వాల చర్యలను  ఉద్యోగుల పోరాటం   ప్రతిఘటించినప్పటికీ  ఫలితం చేకూరలేదు. ఇలాంటి అంశాలలో కూడా సర్వోన్నత న్యాయస్థానం ఉద్యోగుల పట్ల ఆసరాగా బాసటగా నిలబడి  ప్రభుత్వాల యొక్క  దుందుడుకు చర్యలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది.

మరొకవైపు  అక్రమార్జన చేస్తూ అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయలను అప్పనంగా  సొమ్ము చేసుకున్నటువంటి అవినీతిపరులు  కచ్చితంగా చట్టానికి  చిక్కిన సొర చేపలు  వీరికి శిక్ష పడాల్సిందే.  అవినీతిని ప్రోత్సహించే ఎవరికైనా  వారి బాధ్యత రాహిత్యానికి  కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వాలకు ఉంటుంది.అయితే ప్రభుత్వంలోని పెద్దలే  అవినీతికి పాల్పడుతూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న ఈ సందర్భంలో  ఉద్యోగుల తప్పిదాలపై విచారణ జరిపిస్తున్నారు కానీ  రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల పైన మాత్రం ఆరోపణలతోనే సరిపెట్టడం కూడా సబబు కాదు.  ఆరోపించబడిన నేరాలకు సంబంధించి పూర్తి విచారణ జరిపించి దోషులని తేలితే  కటకటాల్లోకి తోసి  జరిమానా విధించాలి.  భవిష్యత్తులో రాజకీయాల్లోకి  నిషేధించాలి. వ్యవస్థ ముందు ఉన్న  బాధ్యతలను  సామాన్య ప్రజానీకం దృష్టిలో ఉంచుకొని  ఖచ్చితంగా ప్రజల పక్షపాతిగా న్యాయ వ్యవస్థ పని చేస్తుందని  గతంలో పని చేసినటువంటి అనుభవాలను  ఆస్వాదిస్తూనే భవిష్యత్తులో కూడా  అవినీతికి ఎవరు పాల్పడిన ఉక్కు పాదం మోపడానికి సర్వోన్నత న్యాయస్థానం  ముందు వరసలో ఉండాలని మనసారా  ప్రజలందరి విజ్ఞప్తి..

అదే సందర్భంలో నేరం చేయకుండా శిక్షకు గురైనటువంటి వాళ్లను ఆదుకోవడంలో కూడా న్యాయవ్యవస్థ  సురేఖ గారి కేసు లాగా  బాసటగా నిలబడుతుందని ఆశిద్దాం. అయితే ప్రతి వ్యక్తి న్యాయవ్యవస్థను ఉపయోగించుకున్నప్పుడు న్యాయస్థానం తలుపు తట్టినప్పుడు మాత్రమే  అన్యాయాలను అవినీతిని అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ చైతన్యం ప్రజలకు  కలిగించే బాధ్యత ప్రజాస్వామ్యవాదులు మేధావులు  సాహిత్య కళా రంగాల వారిది.

( వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333