తాత నేను విన్నాను...నీకు నేనున్నాను

Aug 3, 2026 - 21:17
Aug 3, 2026 - 23:16
 0  1
తాత నేను విన్నాను...నీకు నేనున్నాను

కొన్ని భరోసాలకు మాటలు అవసరం లేదు, ఒక ఆత్మీయమైన స్పర్శ చాలు....

 ఓ వృద్ధుడి భుజంపై కలెక్టర్ చేయి వేసి దైర్యం కల్పించిన మానవత్వపు ఆత్మీయ క్షణం......

"బాట కోసం 80 ఏళ్ల వృద్ధుడు పోరాటం

సారు.. నా భూమికి బాట ఇప్పించండంటూ కలెక్టర్ ఎదుట వృద్ధ రైతు హనుమంతు ఆవేదన వ్యక్తం ... 

  తిరుమలగిరి 04 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సారు.. నాకు నా పొలానికి వెళ్లే బాట ఇప్పించండి. ఆరేళ్లుగా భూమి పడావుగా ఉంది. నన్ను వేధిస్తున్నారు. నా కొడుకులపై కేసులు పెట్టి భయపెడుతున్నారు.." అంటూ 80 ఏళ్ల వృద్ధ రైతు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఎదుట తన బాధను ఆవేదనతో ఎల్లపుచ్చుకున్నాడు. ఈ ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమంలో చోటుచేసుకుంది.తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన నాయిని హనుమంతు (80) తన తమ వ్యవసాయ భూమికి వెళ్లే బాట సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్ రావడం ఆలస్యం కావడంతో నిరాశగా బయటకు వెళ్తుండగా, అదే సమయంలో అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్ ఆయనను గమనించి ఆపి, "ఏమైంది..? ఎందుకు వచ్చారు..?" అని స్వయంగా ఆరా తీశారు. తన సమస్యను వివరించిన వృద్ధుడిని లోపలికి ఆహ్వానించిన కలెక్టర్ పూర్తి వివరాలు తెలుసుకుని సంబంధిత రెవెన్యూ అధికారులతో ఈ సమస్యను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సమస్యపై ఇప్పటికే.... 

హనుమంతు తెలిపిన వివరాల ప్రకారం.. తనకు సర్వే నంబర్ 346/1లో 1 ఎకరం 12 గుంటల భూమి ఉందని, గతంలో ఆ భూమిలో సాగు చేసేవాడినని చెప్పారు. అయితే బంధువులే తన పొలానికి వెళ్లే దారిని మూసివేయడంతో గత ఆరేళ్లుగా భూమిలో వ్యవసాయం చేయలేక బీడుగా వదిలేయాల్సి వచ్చిందన్నారు. బాట కోసం ప్రశ్నించినందుకే తన కుమారులపై పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశానని, మంత్రి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారని తెలిపారు. గతంలో ఉన్న విధంగానే తన పొలానికి వెళ్లే దారిని పునరుద్ధరించి న్యాయం చేయాలని వృద్ధ రైతు అధికారులను వేడుకున్నారు.ప్రజావాణిలో వృద్ధుడి ఆవేదనను ఓర్పుగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులకు తక్షణమే విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి