జాతిని గాయపరిచిoది నాటి ఎమర్జెన్సీ
ప్రకటన లేకుండానే అమలవుతుoది నేటి పరిస్థితి.* జాతి ప్రయోజనాలకు విఘాతం కలగడానికి పాలకుల ఆధిపత్య ధోరణితో పాటు ప్రజల బలహీనత కూడా కా రణమే.అంబేద్కర్ హెచ్చరించాడు కూడా.
**************
--- వడ్డేపల్లి మల్లేశం 9014206412
---25...06....2025********---*
పాలకుల దుశ్చర్యలు దుర్బుద్ధుని ముందుగానే గ్రహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ " రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ దాన్ని అమలు చేసే పాలకులు చెడ్డవారైతే ప్రజా ప్రయోజనాలు నెరవేరవు" అని హెచ్చరించడం జరిగింది. అంతేకాదు ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ పాలకులు ఆమోదించరు అమలు చేయరు ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండడం విజ్ఞానవంతులు కావడం పాలకులకు నచ్చదు కనుక అని కూడా అంబేద్కర్ చేసిన హెచ్చరిక ప్రజలకు నిరంతరం స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1975 జూన్ 25వ తేదీన భారతదేశంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తూ ఆనాటి రాష్ట్రపతి పకృతి అలీ అహ్మద్ గారు ఉత్తరువు జారీ చేసిన విషయాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ రేడియోలో ప్రకటించడంతో ప్రారంభమైన కష్టాలు, కన్నీళ్లు బుద్ధి జీవులు మేధావులు హక్కుల కార్యకర్తల అగచాట్లు 1977 మార్చి 21 తో అంటే ఇరవై ఒక్క మాసాలపాటు ఈ దేశంలో జరిగినటువంటి ప్రజా వ్యతిరేక పాలన అంతా ఇంతా కాదు. రాజు నారాయణ ఇందిరాగాంధీ మధ్య జరిగిన 1971 పార్లమెంటు ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ఇచ్చినటువంటి అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత భారత సర్వోన్నత న్యాయస్థానం 1975 జూన్ 24న ఇచ్చినటువంటి తీర్పుతో కూడా ఇందిర ఎన్నికకు విఘాతం కలిగిన నేపథ్యంలో కఠినమైన చట్టాలకు సంబంధించి మంత్రివర్గ తీర్మానం ఆమోదించడంతో రాష్ట్రపతి ప్రకటన ద్వారా తన ఎన్నికను తాత్కాలికంగా కాపాడుకున్నప్పటికీ రాజ్యాంగ ప్రయోజనాలకు జరిగిన విధ్వంసం, స్వేచ్ఛ, స్వతంత్రాలు, సమన్యాయ పాలన, సమాఖ్య విలువలు కుప్పకూ లడానికి కారణమైన ఎమర్జెన్సీ చీకటి రోజుల ప్రస్తావన నేటితోపాటు వ్యవస్థ ఉన్నంత కాలం కూడా ప్రస్తావనకు రాక తప్పదు. అయితే నాటి ఎమర్జెన్సీ ప్రకటితమైనదైతే నేడు భారతదేశంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అప్రకటిత అత్యవసర పరిస్థితిని తలపిస్తున్నాయని విజ్ఞుల అభిప్రాయం.
ఎమర్జెన్సీలో జరిగిన ఆకృత్యాలు :-
**-***----**----------------
స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థపైన దాడి జరిగింది, పౌరహక్కులను కాల రాయడంతో పాటు పత్రికల మీడియా గొంతులపై ఆంక్షలు విధించడంతోపాటు దేశంలో అసమ్మతిని పూర్తిగా నిర్మూ లించడం ఆవైపుగా ప్రతిపక్ష నేతలు కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులు మేధావులు పాత్రికేయులు కవులు రచయితలు ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్గా చేసి సుమారు లక్షన్నర మందిని కటకటాల్లో చెర పట్టిన ఎమర్జెన్సీ కన్నీటిగాధ అంతా ఇంతా కాదు. జనాభా కట్టడి పేరుతో ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ నాయకత్వంలో బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో అనేక అనర్థాలు చోటు చేసుకోగా పట్టణాల సుందరీకరణ పేరుతో మురికివాడల్లోని పేద జనాలను
చోటు లేకుండా చేసి రోడ్డున పడేసిన చరిత్ర కూడా ఆనాటిది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి వ్యవస్థీకృతమైన చీకటి అధ్యాయం మరొకటి లేదు ఉండకూడదు అని రాజకీయ విశ్లేషకులు పండితులు హెచ్చరిస్తున్నారు.
రాజకీయాలలో మితిమీరిన వ్యక్తి పూజ ఎమర్జెన్సీకి కారణమని విజ్ఞులు అభిప్రాయపడుతూ ఉంటే ప్రజాస్వామ్య దృక్పథమైన చర్చలు సంప్రదింపులకు అవకాశం లేని నిరంకుశత్వం ప్రతిచోట దర్శనం ఇచ్చింది. చట్టసభలు నిర్జీవం కాగా వ్యక్తి పేరున మాత్రమే పాలన కొనసాగడం తో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, రాజ్యాంగ వ్యవస్థల పైన ఉక్కు పాదం మోపి నామమాత్రపు సంస్థలుగా మి గిల్చింది.
గుణపాఠం సాధించినామా?
*******
స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవించడంతోపాటు శ్రమకు తగిన ఫలితాన్ని అనుభవించడం దేశ సంపదను హక్కుగా పొందడంతో పాటు ప్రజల ఎదుగుదలకు అన్ని అవకాశాలను రాజ్యం కల్పించవలసిన ఉదాత్త రాజ్యాంగం కలిగిన పాలనకు అర్ధాంతరంగా ఏర్పడిన అత్యవసర చీకటి రోజుల పాలన ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగించినా ఆ తర్వాత వచ్చిన 1977 ఎన్నికల్లో ప్రజలు తమ నిరసనను తమ వ్యతిరేకతను ఆసరా చేసుకుని తీసుకున్న నిర్ణయం కారణంగా ఇందిరా గాంధీ ఓడిపోవడం లోపాలను సరి చేసుకోవడానికి గుణపాఠం రావడానికి అవకాశం ఏర్పడింది .అయితే ఎమర్జెన్సీ కాలంలో వివిధ శ్రేణులలో ఏర్పడినటువంటి ప్రజా వ్యతిరేక ధోరణి అక్రమాలు అధికార దాహం మాత్రం విస్తృతమై దాని పర్యవసానంగా ఈనాడు ఎలాంటి ప్రకటనలు లేకపోయినా కూడా అప్రకటితంగా వ్యతిరేక పాలన కొనసాగించడానికి మార్గం సుగమయిందని దానికి బీజాలు ఎమర్జెన్సీ కాలంలోనే పడ్డాయని రాజకీయ పండితుల భావన. దాని కారణంగా ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక అపసవ్యాలతో పాటు ప్రజా హక్కులను కాలరాచే శక్తుల సంఖ్య పెరగడం, స్వేచ్ఛ స్వాతంత్రాలకు చరమగీతం పాడే పాలకుల అభిప్రాయం బలపడుతున్న కారణంగా నేడు అప్రకటిత రాజ్యాంగం ఈ దేశంలో అమలవుతున్నది.
గౌరవప్రదంగా ఆత్మగౌరవంతో స్వేచ్ఛ స్వాతంత్రాలను రాజ్యాంగబద్ధంగా అనుభవించడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవడంలో చైతన్యముతో జాగరూగతతో ప్రజలు ఎమర్జెన్సీ నాటి ఓటమిని తరిమి కొట్టడానికి ఉద్యమ శక్తులై కదిలితే తప్ప ఈ అనారోగ్యకరమైనటువంటి ఆధిపత్య ధోరణి ఈ దేశంలో సమసి పోదు. ప్రజాతంత్ర సాంప్రదాయాల స్థానంలో నిరంకుశత్వం నియంతృత్వం రాజ్యమేలడం ప్రగతిశీల భారతావని నిర్మాణానికి పోరాడుతున్నటువంటి ఉద్యమ శక్తులను అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాలకుల ఆలోచనలను నిర్మూలించే క్రమములో ఐక్య ఉద్యమాలను నిర్మించుకోకుండా ప్రజాస్వామ్య విజయాన్ని ఆశించడం అత్యాశ అవుతుంది. స్వతంత్ర పోరాట కాలంలో 1929లో లాహోర్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన పూర్ణ స్వరాజ్ తీర్మానం కూడా" ప్రజల హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రాలను అణచివేసే ప్రభుత్వాన్ని గద్దె దించే హక్కు ప్రజలకు ఉంటుంది " అని తేల్చి చెప్పడం ప్రజలు ప్రజాస్వామిక వాదులకు కొండంత ధైర్యం. పాలకులు విదేశీయులైన స్వదేశీయులైన ఈ సిద్ధాంతం సర్వత్ర వర్తిస్తుంది. "చీకటిని తిట్టుకుంటూ చిన్నబోయి కూర్చుంటే సరిపోదు. చిరుదివ్వే వెలిగించే కృషి సమయస్ఫూర్తితో కూడుకున్నది. అదే కార్రుకాల్చి వాత పెట్టె ప్రజాదృక్పదం కావాలి.