పిల్లల చైతన్యం - పెద్దల ప్రాణాలకు రక్షణ కవచం
➤హెల్మెట్ ధరించమని గుర్తు చేసే పిల్లలు - కుటుంబాన్ని కాపాడే హీరోలు
➤ భావి పౌరుల చేతుల్లోనే - సురక్షిత భారత్ భవిష్యత్తు.
➤ హెల్మెట్ ఒక అలవాటు కాదు… ప్రాణాల రక్షణ కవచం”
------ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, IPS.
జోగులాంబ గద్వాల 15 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. ప్రయాణం లో వాహనదారులు హెల్మెట్ ధరించడo అనేదే బాధ్యతగా భావించాలని, హెల్మెట్ ధరించడం అలవాటుగా చేసుకోవడం ద్వారా మన ప్రాణాలకు, కుటుంబాల కు రక్షణ గా నిలుస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,IPS అన్నారు.
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా లోని అలంపూర్ పట్టణంలోని మౌంటేశ్వరి హై స్కూల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం విద్యార్థుల్లో విశేష చైతన్యం నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్ , భావి భారత పౌరులైన విద్యార్థులకు భద్రతపై స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ‘నా వల్ల నాకు గానీ, ఇతరులకు గానీ ప్రమాదం జరగకూడదు’ అనే ఆలోచనతో ప్రయాణం ప్రారంభిస్తేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలం” అని అయన పేర్కొన్నారు. ప్రపంచం అంతరిక్షంలో అద్భుతాలు సాధిస్తున్న ఈ కాలంలో కూడా, మన రోడ్లపై అవగాహన లోపం వల్ల ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులే కుటుంబాల్లో మార్పుకు దూతలుగా మారాలని, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ, వారి భావోద్వేగ ప్రభావం కుటుంబంపై ఎక్కువగా ఉంటుందని, తండ్రులు, అన్నలు బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించమని ప్రేమగా కోరితే అది అలవాటుగా మారుతుందని సూచించారు. స్కూల్‌లో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, రోడ్డు పై కూడా అదే క్రమశిక్షణ ప్రాణాలను కాపాడుతుందని ఆయన స్పష్టం చేశారు. తదుపరి దేశంలో ఉన్న అందరి చేత రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించే సరైన విధానం, జీబ్రా క్రాసింగ్ ఉపయోగం వంటి అంశాలను ప్రాక్టికల్ డెమో ద్వారా విద్యార్థులకు వివరించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు సీట్ బెల్ట్ అవసరాన్ని వివరిస్తూ, ప్రతి ప్రయాణం భద్రంగా ఉండాలంటే నియమాలు పాటించడం తప్పనిసరి అని చెప్పారు.
అత్యంత ప్రభావవంతంగా, రెండు బైక్‌లు ఢీకొన్న సందర్భంలో జరిగిన ప్రమాదo పై నిర్వహించిన స్కిట్ విద్యార్థులను ఆలోచింపజేసింది. హెల్మెట్ లేని వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, హెల్మెట్ ధరించిన వారు క్షేమంగా బయటపడడం ద్వారా భద్రత యొక్క అసలు విలువను స్పష్టంగా చూపించారు. అనంతరం విద్యార్థులు “Arrive Alive” సందేశంతో మానవహారం నిర్మించి సమాజానికి శక్తివంతమైన సందేశం అందించారు.
గద్వాల్ డీఎస్పీ మొగిలయ్య మాట్లాడుతూ, మైనర్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు ఉంటాయని, రూ.25,000 జరిమానా మరియు తల్లిదండ్రులకు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదని స్పష్టం చేశారు. స్కూల్ యాజమాన్యం “Accident is not an incident, it is a disaster” అనే సందేశంతో ప్రమాదాల తీవ్రతను వివరించింది.
ఈ కార్యక్రమంలో గద్వాల్ డీఎస్పీ వై. మొగిలయ్య, సీఐ ప్రదీప్ కుమార్, ఎంవీఐ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో పద్మావతి, ఎంఈఓ అశోక్ కుమార్, స్కూల్ కరస్పాండెంట్ & ప్రిన్సిపాల్ కేఎన్‌వి రవిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.