జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించాలి
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక
రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ
హైదరాబాద్ 30 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ చేసి రిజర్వేషన్లు ప్రకటించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ కోరారు. శుక్రవారం హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కులగణన చేపట్టడం ద్వారానే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కులాల జనాభా ఉప కులాల వారీగా ఎంత ఉందో తెలుస్తుందని అన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ కులాల్లోని అన్ని కులాలకు ఆయా జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు అందుతాయి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణను దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో చేపడతామని ప్రకటించడాని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగానే కుల గణన పూర్తి చేసి వెనువెంటనే ఏబిసిడి వర్గీకరించి రిజర్వేషన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల శాతం 50% మించరాదన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్ట్ పునసమీక్షించాలని కోరారు. ఎస్సీ రిజర్వేషన్లను 15% నుండి పెంచాలని అన్నారు . ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇటీవల అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాలలు గౌరవించాలని అన్నారు. దేశంలో షెడ్యూల్ కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్న రాజకీయ నాయకుల మాటలను దళితులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మాల మాదిగల మధ్య ఉన్న మిత్ర వైరుధ్యాన్ని కొంతమంది రాజకీయ నాయకులు శత్రువైరుద్యంగా మార్చుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారు పొందడం కోసం పోరాడాలి తప్ప అంతర్గత కుమ్ములాటలు మానుకొని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూనే రాజ్యాధికారం వైపు దిశగా పయనించాలని సూచించారు.