గ్రామీణ, గిరిజన  ప్రాంతాలు  వెనుకబడడానికి  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణం కాదా?

Mar 31, 2026 - 12:17
Mar 31, 2026 - 12:21
 0  0

గ్రామీణ, గిరిజన  ప్రాంతాలు  వెనుకబడడానికి  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణం కాదా? నిధులన్నీ పట్టణాల్లో కుమ్మరించి,  తిండి పెట్టే రైతన్న పొలానికి బాట మరిచి, కనీస రహదారులు సౌకర్యాలు కరువు అo టే  ఇది వివక్షతే కదా!
---వడ్డేపల్లి మల్లేశం 9014206412  +**
----29....04....2025*****--**
-రోడ్డు సౌకర్యం లేని  గ్రామాలు ఈ దేశంలో లేవని  లోతట్టు  మారుమూల ప్రాంతాలకు సైతం రవాణా సౌకర్యాలు  కల్పించినట్లు    ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి కానీ  మారుమూల ప్రాంతాలే కాకుండా మైదాన ప్రాంతాలలో సైతము  ముఖ్యంగా అటవీ గిరిజన ప్రాంతాలతో సహా  సరైన రహదారి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలను మనం స్పష్టంగా చూడవచ్చు. చిన్న పట్టణాలకు పొలిమేరలో ఉన్నటువంటి గ్రామాలలో కూడా  వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి ఒక గ్రామానికి మరొక గ్రామానికి ప్రయాణం చేయడానికి  శాశ్వతమైనటువంటి రహదారులు లేకపోగా చాలాచోట్ల  బండ్ల బాటలు  గ్రామీణులు ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లబాటలు  మాత్రమే ఇప్పటికీ  ఏకైక అవకాశాలుగా  మిగిలిపోవడాన్ని గమనిo చవచ్చు. గ్రామీణ ప్రాంతాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్నటువంటి ఖర్చు లేదా కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు నామ మాత్రమే.  అదే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన  వివిధ సౌకర్యాలు  విద్యా విజ్ఞాన వైద్య సంస్థల ఏర్పాటుతో పాటు  రింగ్ రోడ్లు  మినీ రైల్వే సౌకర్యాలు విద్యాలయాలు  వంతెనలు  ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ వంటి వాటి పైన చేస్తున్న ఖర్చు  వందలు, వేల కోట్లు దాటుతున్నది.  గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కనీస సౌకర్యాలు కల్పించడానికి  శాశ్వత రోడ్డు సౌకర్యాలను విస్తరింప చేయడానికి మాత్రం ప్రభుత్వాలకు మనసొ ప్పదు.  ఒకవేళ రోడ్డు సౌకర్యం కల్పించిన అది సింగల్ రోడ్డు రూపంలో  ఒక్క వాహనం మాత్రమే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటే ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు సంగతేమిటి?  అంతెందుకు  గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా వ్యవసాయదారులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణ ణా తీతం. బావుల వద్దకు  వ్యవసాయ భూముల దగ్గరికి  వెళ్లడానికి  ట్రాక్టర్,  కోత, కలుపు, నాటు మిషన్లు  తమ తమ కార్యక్రమాలను కొనసాగించడానికి  రహదారులు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిలో  అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని కూడా గమనించాలి. దశాబ్దాల క్రితం  ఉన్నటువంటి పిల్ల బాటలే తప్ప ఇప్పటికీ  రహదారుల స్థితిగతులు మారనటువంటి ప్రాంతాలు కూడా అనేకం. ఇక బాటకు ఇరువైపులా చెత్తాచెదారం ముండ్ల కంపలు  రాళ్లు రప్పలతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో బాటలు రహదారులు  ఉంటే  గ్రామాలలో జీవించేవాళ్లు మనుషులు కాదా? లేక వీళ్లకు కనీస అవసరాలు ఉండవా? లేక వీళ్లు కనీసమైన సౌకర్యాలకు నోచుకోకూడదా?అనే మీ మాంస కలగక మానదు.  ఇటీవల తెలంగాణ రాష్ట్ర శాసనసభలో  ప్రతిపక్ష సభ్యులు కొందరు   గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రస్తావిస్తూ  బావులు చేల వద్దకు వెళ్లడానికి కచ్చితంగా రహదారులను ప్రభుత్వమే నిర్మించాలని  అప్పటికి అరకొరగా ఉన్నటువంటి దారులను విస్తరింప చేయడం ద్వారా  సులభంగా ప్రయాణించడానికి సౌకర్యాలు కల్పించాలని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించవలసిన అవసరం ఉంటుంది .
        పట్టణాలపై ఇంత మోజె o దుకు?  నగరీకరణ దీర్ఘకాలంలో ప్రమాదకరమే!
***---******
అనేక ప్రమాదకరమైన స్థితులలో ఉన్నటువంటి నిర్మాణాలను  అత్యంత సాహసంతో నిర్వహిస్తున్న మాట వాస్తవమే కానీ అప్పుడప్పుడు అది  ప్రమాదాలకు గురై  ఎంతోమంది చావులకు బలవుతున్నటువంటి సందర్భాన్ని గమనించవచ్చు. భూగర్భ ప్రయాణాలు, రసాయన పరిశ్రమలు,  జల ప్రయాణాలు  విమాన ప్రయాణాలలో  ఇటీవల అనేక ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి భూమార్గాలకు అత్యధిక ప్రాధాన్యత నివ్వడం ద్వారా కొంత రక్షణ పొందే అవకాశం ఉంటుంది  అందుకు నె లవైనటువంటి ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలే కనక గ్రామీణ ప్రాంతాలను విస్తరింప చేయడం, చిన్న పట్టణాలను అభివృద్ధి చేయడం, అభివృద్ధి కేంద్రాలుగా చిన్న పట్టణాలను తీర్చిదిద్దడం, ముఖ్యమైనటువంటి  విద్యాసంస్థలు  సాంకేతిక కేంద్రాలుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లయితే జనాభాను కేంద్రీకరించకుండా అరికట్టడానికి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక  పరిధిలో కేటాయించిన నిధులలో అత్యంత  అగ్ర భాగం పట్టణ ప్రాంతాలకు  ఉన్నత వర్గాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు పేద మధ్యతరగతి వర్గాలకు నామమాత్రంగానే నిధులు కేటాయించబడుతున్నట్లు మేధావులు సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.   ఈ దేశానికి తిండి పెట్టే రైతన్నలు, కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, కార్మికులు, ఎక్కువగా  నివసిస్తూ  ఉత్పత్తులు పెంచుతూ దేశాభివృద్ధిలో పాల్గొంటున్న వాళ్లంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తున్న వాళ్లు కానీ గ్రామీణ ప్రాంతాలకు మాత్రం సౌకర్యాలు అరకొ రగా ఉండడాన్ని ఏ రకంగా సహించవచ్చు? జన సంచారము లేని దగ్గర  కిలోమీటర్ల పొడవునా కూడా  ఒకవైపు విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉంటే  గ్రామాలలో మాత్రం ప్రజలు జీవించే చోట  చిన్న సందులలో  నెలల తరబడిగా వీధిలైట్లు వెలగకపోవడాన్ని గమనించినప్పుడు  ఈ దేశంలో పట్టణాలకు ఇచ్చిన ప్రాధాన్యతలో ఈశన్ మాత్రం కూడా గ్రామ ప్రాంతాలకు ఇవ్వడం లేదని అర్థం అవుతున్నది .అందువల్లనే  సకల సమస్యలకు పరిష్కారాన్ని చూపే గ్రామాలను విడిచి ప్రజలు పట్టణ ప్రాంతాలకు తరలిపోవడానికి పట్టణ జీవితానికి అలవాటు పడుతూ గ్రామాలను  పాత గోడలకు పరిమితం చేయడాన్ని గమనించినప్పుడు ప్రభుత్వాల యొక్క ద్వంద్వ వైఖరి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా విద్యాసంస్థలు  ఆసుపత్రులు  ఉపాధి కల్పించే పరిశ్రమలు  సాఫ్ట్వేర్ రంగాలను కూడా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింప చేయడం ద్వారా ప్రజలు ఎక్కడైనా ఈ దేశంలో బ్రతకవచ్చు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది.  ప్రస్తుతము పట్టణ ప్రాంతాలు లక్షలు కోట్ల జనాభా కు చేరుకోవడంతో  కనీస సౌకర్యాలు మృగ్యమై  ప్రజలకు ఉపాధి కరువై,  పోటీ తత్వం పెరిగి, మురికి కాలువల పక్కన,  రోడ్డు కిరు వైపులా  అనాధలుగా జీవిస్తున్నటువంటి  సన్నివేశాలను గమనించినప్పుడు పట్టణాలు ఎదగడం అంటే ఇదేనా?లేక పట్టణ జనాభా పెరగడం అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినట్లా? ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. 
     మింగ మెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా భారతదేశంలో  పేదరికం నిరుద్యోగము ఆకలి చావులు ఆత్మహత్యలు యదేచ్ఛగా కొనసాగుతుంటే సౌకర్యాల లేమితో  పేదరికం తాండవిస్తూ ఉంటే  పట్టణాలను మాత్రం అభివృద్ధి చేసే క్రమంలో కోట్ల నిధులను కేటాయిస్తు  అందాల పోటీలు నిర్వహించడం, దాబా లు,  క్లబ్బులు పబ్బులు ఈవెంట్ల పేరుతో కొనసాగుతూ ఉంటే వాటికి అనుమతించి  తద్వారా లభించే ఆదాయాన్ని పట్టణాల మీద కుమ్మరిస్తూ  ప్రభుత్వాలు తమ ఖర్చులు తీర్చుకోవడానికి పనిచేస్తున్నాయి తప్ప ఈ దేశంలో అధమ స్థాయిలో ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి, ఆరోగ్య పరిరక్షణకు, విద్య  సౌకర్యాల విస్తరణకు మాత్రం పూనుకోవడం లేదు. దానివలన గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ముఖ్యంగా పేద వర్గాలు విద్యా వైద్యానికి తమ ఆదాయంలో 60 --70% ఖర్చు చేయడం వల్ల పేదవాళ్లు మరీ పేదలుగా మారిపోతున్నారు.  సౌకగాలు గ్రామీణ ప్రాంతాలలో లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాలలోనే ఉండవలసి రావడంతో ఖర్చులు కూడా భారీగా పెరగడంతో సామాన్య ప్రజలకు కార్మికులకు విద్యార్థులకు కూడా అధిక భారం అవుతున్న విషయాన్ని కూడా పాలకులు  గమనించి  పట్టణ గ్రామీణ ప్రాంతాల జీవిత  ప్రమాణాలను  కాపాడే ప్రయత్నంలో పల్లెటూర్లను కూడా  బాధ్యతగా స్వీకరించి అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే  పాలకులను ప్రజలు  గుర్తుంచుకుంటారు.  ఇప్పటికీ కొంతమంది పలుకుబడి కలిగినటువంటి ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలను మాత్రమే బాగు చేసుకున్న  పరిస్థితి గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కారణంగా  వివిధ ప్రాంతాల మధ్యన వివక్షత ఏర్పడిన విషయం మనకు  తెలుసు. నాయకత్వాన్ని బట్టి నియోజకవర్గాల మధ్యనే ఇంత తేడా ఉన్నప్పుడు పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్యన ఎంత తేడా???  ప్రభుత్వాల యొక్క వివక్షత,  సౌకర్యాల లేమి,గ్రామీణ ప్రజల పట్ల చిన్నచూపు అనే అంశాలు  క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కానీ తెలియదు. ఇప్పటికీ చట్టసభలలో కొద్ది మంది  గ్రామీణ ప్రాంత నేపథ్యం కలిగినటువంటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వాల దృష్టికి వెళుతున్నది. కా ని ప్రభుత్వాలు ఆ రకమైన ఆలోచన చేయడం లేదు. పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య విస్తృతమైనటువంటి వ్యత్యాసాన్ని గనక చూపితే అది  అసమతుల్యతకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.  పట్టణ గ్రామీణ ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ప్రాంతం వారికి కనీసం అయినటువంటి సౌకర్యాలను  భారీగా కల్పించినప్పుడు మాత్రమే  గ్రామీణులలో ఆ రకమైనటువంటి  దురభిప్రాయాన్ని తొలగించవచ్చు. .మారుమూల గిరిజన ప్రాంతాలలో ఇప్పటికీ  విద్య వైద్యం వంటి కనీస వసతులు  కనుచూపుమేరలో అందుబాటులో లేకపోవడం నిజంగా  సిగ్గుచేటు. ప్రకృతిలో జీవించే గిరిజనులు ప్రకృతి వైద్యం  ద్వారా మాత్రమే తమ అవసరాలను తీర్చుకుంటున్నారని తెలిసినప్పుడు  ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం సౌకర్యాలు ఏ పాటివో  ప్రశ్నించుకోవలసి ఉంటుంది .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా  సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333