గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలకు ప్రయత్నం – 08 మంది అరెస్ట్, ఇద్దరు పరారీ
చివ్వెంల పోలీస్ స్టేషన్లో అరెస్ట్ వివరాలు వెల్లడించిన సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. రాజశేఖర్
చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పురాతన ఆలయాల పరిసర ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేసేందుకు ప్రయత్నించిన 10 మందిని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే చివ్వెంల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, 06.09.2026 తెల్లవారుజామున సుమారు 04:00 గంటల సమయంలో కేషరాజు కుంట కట్ట వద్ద అనుమానాస్పదంగా తవ్వకాలు చేస్తున్న వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద నుంచి గుప్త నిధుల కోసం వినియోగిస్తున్న మెటల్ డిటెక్టర్, స్కానర్, లొకేటర్ తదితర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ఛైర్మన్ చకిలం కృష్ణ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సూర్యాపేట రూరల్ సీఐ జి. రాజశేఖర్ ఆధ్వర్యంలో చివ్వెంల ఎస్ఐ వి. మహేశ్వర్ మరియు పోలీసు సిబ్బంది దర్యాప్తు కొనసాగిస్తూ 08 మంది నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
అరెస్టైన నిందితుల వివరాలు
1. పచ్చిపాల మధు
2. యల్లాల శ్రీకాంత్
3. భూతరాజు శివ
4. నకిరేకంటి గోపి
5. చర్లపల్లి ప్రణయ్ కుమార్
6. రాపాని తిరుపయ్య
7. కడారి సైదులు
8. భూక్యా తులశ్య
పరారీలో ఉన్న వారి పేర్లు :
1.వేలాద్రి,
2.మధు
స్వాధీనం చేసుకున్న వస్తువులు
1. మెటల్ డిటెక్టర్
2. స్కానర్
3. లొకేటర్
4. 06 సెల్ఫోన్లు, 01 ట్యాబ్
5. 01 డ్యూయట్ స్కూటీ
గుప్త నిధుల పేరుతో జరిగే మోసాలను ప్రజలు నమ్మవద్దని పోలీసులు సూచించారు. గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఎవరైనా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించినా, లేదా అనుమానాస్పదంగా తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల భద్రతకు విఘాతం కలిగించే అక్రమ కార్యకలాపాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.