కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎమ్మెల్యే మందుల సామేలు బహిరంగ క్షమాపణ చెప్పాలి

Jul 26, 2026 - 21:50
 0  1
కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎమ్మెల్యే మందుల సామేలు బహిరంగ క్షమాపణ చెప్పాలి

  తిరుమలగిరి 27 జులై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

 తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కోమటిరెడ్డి బ్రదర్స్ కు భేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ పర్రెపాటి యుగేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం వంగపల్లి నరసయ్య ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని కులాల ఓట్లతో 50 వేల మెజార్టీతో గెలిచిన మందుల సామెల్ దళితుల కార్డుతో తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీ తీసుకువస్తున్నాడని అందుకు తుంగతుర్తిలోని 66 వేల దళితుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గతంలో రాజగోపాల్ రెడ్డి దయవల్లే టికెట్ వచ్చిందని చెప్పిన సామెల్ ఈరోజు ఎవరి దయా వల్ల టికెట్ రాలేదని చెప్పడం విడ్డూరమని అన్నారు. ఎమ్మెల్యే తప్పును కప్పిపుచ్చుకోవడం వల్ల కులం ప్రస్తావన తీసుకొస్తున్నాడని అన్నారు. నియోజకవర్గంలో నిన్ను గెలిపించిన ఏ ఒక్క దళితునికి నువ్వు పదవులు ఇచ్చావో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ని అభివృద్ధి చేయకుండా నీ అభివృద్ధి కోసమే పాలన కొనసాగిస్తున్నావని విమర్శించారు. తుంగతుర్తి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరగవద్దని అన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలలో తప్పేముందో చెప్పాలని అన్నారు. మంత్రి వెంకట్ రెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుని కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తే నీకు కలిగిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

ఎస్సీ సెల్ ఉపాధ్యక్షునిగా నీ పెద్ద కొడుకు కి ఇచ్చినావు, రెండో కొడుకుకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నావు, నీ కొడుకులు నియోజకవర్గం లోని ఏ కార్యకర్తను, నాయకుడిని ఆదుకున్నారో చెప్పాలని అన్నారు. 20 సంవత్సరాలుగా కాంగ్రెస్లో నిక్కాస్ అయిన కార్యకర్తగా పనిచేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా, కాసుల కక్కుర్తి కోసం మండల అధ్యక్ష పదవులు అమ్ముకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. నియోజకవర్గంలో గాంధీభవంలో ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వాలని పోరాటం చేసిన గూడెపు నాగరాజుకు ఏం చేసావో చెప్పాలని ప్రశ్నించారు. జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీ ల కోసం పోరాటం చేసి కేసుల పాలైన కందుకూరి అంబేద్కర్ కు కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వకపోవడం విడ్డురం అని అన్నారు. గత ఎమ్మెల్యే కిషోర్ అనుచరులు నాపై దాడి చేసి చావు అంచులకు వెళ్లిన నాకు ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి కిషోర్లను నమ్మవద్దని ప్రచారంలో ఉంది. ఇప్పుడు నీ దిక్కుమాలిన చర్యల వల్ల దళితులను కూడా నమ్మని పరిస్థితి వస్తుందని అన్నారు. 11 మంది దళిత కాంట్రాక్టర్లలు నియోజకవర్గంలో ఉంటే ఒక్కరికి ఏ కాంట్రాక్టు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 6 మండలాల్లో రెండు మండలాలు రిజర్వేషన్ ప్రకారం మాదిగలకు అధ్యక్ష పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాక్స్ చైర్మన్ పదవులకు మాదిగలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో మందుల సామేలు కాంగ్రెస్ జెండా మాత్రమే ఎగిరితే, నికాసైన కాంగ్రెస్ నాయకులు అందరం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తుంటే, తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇష్టరాజ్యపు పాలన నడుస్తుందని విమర్శించారు. వారం రోజుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు, ఎంపీ చామల కిరణ్ కు, కాంగ్రెస్ అధిష్టానానికి బేశరదుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పిసిసి ఉపాధ్యక్షుడు జగ్గారెడ్డి వెంటనే ఎమ్మెల్యే సామేలను కట్టడి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరి అంబేద్కర్, గూడెపు నాగరాజు, పంది శ్రీనివాస్, కార్తీక్ పాల్వాయి, సైదులు, మల్లేష్, యాదగిరి, వీరమల్లు దళిత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి