కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు...
దిశా కమిటీ చైర్మన్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు... దిశా కమిటీ చైర్మన్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి
గురుకులాలు, పాఠశాలల్లో ఆహార నాణ్యతపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి
గిరిజన ప్రాంతాల్లో 124 ఐసోలేటెడ్ ఆవాసాలకు శాశ్వత త్రాగునీటి సౌకర్యం కల్పించాలి
అటవీ అనుమతుల సమస్యలతో అభివృద్ధి పనులు, రైతులు ఇబ్బందులు పడకుండా పరిష్కరించాలి
అమృత్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసి దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించాలి
పీఎంఏవై, ఉపాధి హామీ పథకాల పెండింగ్ చెల్లింపులను త్వరగా పరిష్కరించాలి
దిశా కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 18:- కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని దిశా కమిటీ చైర్మన్, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం ఖమ్మం ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ రామ సహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన దిశా కమిటీ సర్వసభ్య సమావేశాన్ని మహబూబాబాద్ ఎంపీ పి. బలరాం నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లతో కలిసి నిర్వహించారు. గత దిశా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అధికారులు సమర్పించిన యాక్షన్ టేకన్ రిపోర్టును సమావేశంలో పరిశీలించారు.
ఆరోగ్యం, త్రాగునీటి సరఫరా, విద్య, ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బీఎస్ఎన్ఎల్, రైల్వేలు, జాతీయ రహదారులు, స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ ల, తదితర కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.
*ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ*ఆసుపత్రులకు అవసరమైన సిటీ స్కాన్ వంటి వైద్య పరికరాల కొనుగోలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. అవసరమైన వైద్య పరికరాల కోసం సంబంధిత ప్రజాప్రతినిధులు సీఎస్ఆర్ నిధులను సమీకరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని, దీనిపై నివేదిక సమర్పించి ప్రభుత్వ స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు.
జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ 80 శాతం పూర్తయిందని, మిగిలిన అర్హులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అన్నారు. గుండాల ఘటనకు ఎవరు బాధ్యులో, ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటో పూర్తి వివరాలతో డీఎంహెచ్ఓ 48 గంటల్లో కలెక్టర్‌కు యాక్షన్ టేకన్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. పనుల మంజూరు లేదా నిధులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, నిధుల కోసం తాము ప్రభుత్వ స్థాయిలో ఫాలోఅప్ చేస్తామని అన్నారు. అయితే పనులను పెండింగ్‌లో ఉంచి కాలయాపన చేయవద్దని, సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు వెంటనే త్రాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని, అవసరమైన హ్యాండ్‌పంపుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులు, పైప్లైన్లకు ప్రతిపాదించిన పనుల ప్రస్తుత స్థితిపై నివేదిక సమర్పించాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో త్రాగునీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీటిని అందించాలని సూచించారు.
గురుకులాలను సందర్శించిన సమయంలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలు, గుడ్లు వంటి సరుకులు తగినంతగా లేవని గుర్తించినట్లు ఎంపీ తెలిపారు. టమాటాలను ఎలుకలు కొరికిన పరిస్థితిలో ఉన్నాయని, సరుకుల బ్యాగులు తెరిచి ఉంచారని, నిర్దేశించిన డైట్లో 50 శాతం కూడా అమలు కావడం లేదని, మూడు రోజుల పాటు ఒకే కూర వడ్డించిన పరిస్థితిని గమనించినట్లు చెప్పారు.
జిల్లాలోని అన్ని గురుకులాలు, పాఠశాలల జాబితాను సిద్ధం చేసి సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి వారం కనీసం ఐదు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని సూచించారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందకపోవడం ఆమోదయోగ్యం కాదన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణ ప్రాంతాలకు పీఎంఏవై కింద మంజూరైన 1,590 ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సమర్పించాలని అన్నారు. పీఎంఏవై చెల్లింపులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, సమస్యాత్మక కేసుల వివరాలను ప్రత్యేకంగా నివేదించాలని సూచించారు.
కొత్తగూడెం వంటి ముఖ్యమైన రైల్వే స్టేషన్‌కు అమృత్ స్టేషన్ పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, ఈ విషయాన్ని తాను రైల్వే మంత్రికి కూడా తెలియజేసినట్లు ఎంపీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి మార్పిడి చేయడంతో పాటు భూమి విలువను కూడా చెల్లించినప్పటికీ, రెండేళ్లు గడిచినా రైల్వే భూమిని రాష్ట్రానికి అప్పగించలేదని తెలిపారు.
అమృత్ పథకం కింద మంజూరైన అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అన్నారు. పైప్‌లైన్ పనుల్లో శాఖల మధ్య సరైన సమన్వయం ఉండేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, పైప్లైన్లు వేసిన తర్వాత రహదారులను గతంలో ఉన్న విధంగానే పునరుద్ధరించాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో అటవీ అనుమతుల కారణంగా విద్యుత్ లైన్లు, రహదారులు, పట్టా భూములకు సంబంధించిన సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డీఎఫ్ఓలు స్థానిక ఎమ్మెల్యేలతో సమయం కేటాయించి సమస్యలను నమోదు చేసుకుని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అడవులను ధ్వంసం చేయాలని తాము కోరడం లేదని, అడవులను సంరక్షిస్తూనే ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
మహబూబాబాద్ ఎంపీ పి. బలరాం నాయక్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని అన్నారు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల మంత్రులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా స్థాయి నుంచి సంపూర్ణ నివేదిక అందలేదని తెలిసిందని, అవసరమైన వైద్య పరికరాలు, ఇతర అవసరాలకు సంబంధించి సమగ్ర నివేదిక అందించాలని కోరారు.
విద్య, వైద్యం, రైల్వేలు తదితర రంగాలకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి తాము నిరంతరం కేంద్ర మంత్రులతో ఫాలోఅప్ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖకు అవసరమైన నిధుల కోసం కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
జిల్లాలోని 124 ఐసోలేటెడ్ హ్యాబిటేషన్లకు శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్న నేపథ్యంలో రహదారులు, త్రాగునీరు, ఇతర మౌళిక వసతుల కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అన్నారు. ప్రతిపాదనలు లేకుండా కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకురాగలమని అన్నారు.
అటవీ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, పోడు రైతులు తమ పశువులను అడవిలోకి తీసుకెళ్లినప్పుడు రోజుల తరబడి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో 44 సబ్ సెంటర్లు, 14 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు వైద్య ఆరోగ్య శాఖకు సమర్పించినట్లు చెప్పారు. గుండాలలో 5 పడకల డయాలసిస్ కేంద్రం మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీ క్రింద ఏజెన్సీ ప్రాంతాల్లో సిటీ స్కాన్ మంజూరు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. జిల్లాలో 124 ఐసోలేటెడ్ హ్యాబిటేషన్లు ఉన్నాయని, ప్రస్తుతం స్థానిక నీటి వనరుల ఆధారంగా సోలార్ వ్యవస్థల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. అటవీ అనుమతుల సమస్యల కారణంగా వాటికి శాశ్వత త్రాగునీటి సరఫరా కల్పించలేక పోతున్నామని వివరించారు. కొత్తగూడెం జిల్లాలో ఉపాధి హామీ పథకం క్రింద రూ.17 కోట్ల వేతన బకాయిలు, రూ.50 కోట్ల మెటీరియల్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇకపై దిశా సమావేశాలకు అటవీ, పోలీస్ శాఖల అధికారులు కూడా తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని కోరారు. వైద్య శాఖలో అధికారుల బాధ్యతలను స్పష్టంగా విభజించాలని సూచించారు.
జిల్లాలో 116 మంది వైద్యులు, 52 మంది నర్సులు, 45 మంది పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. స్థానిక అభివృద్ధి పనులకు డీఎంఎఫ్టీ నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం మరింత మెరుగు పడాలని, ఆసుపత్రులు సక్రమంగా పనిచేయకపోతే దాని ప్రభావం ప్రజాప్రతినిధులపై కూడా పడుతుందని అన్నారు.
అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందించాలని, వృద్ధుల లైవ్ అథెంటికేషన్ లో వేలిముద్రలు పడకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను ఐరిస్ సాంకేతికతను వినియోగించి పరిష్కరించాలని కోరారు.
రైల్వే స్టేషన్ పేరును ‘భద్రాచలం రోడ్’ నుంచి ‘కొత్తగూడెం’గా మార్చేందుకు ఎంపీ ద్వారా అవసరమైన అభ్యర్థన లేఖ, ప్రతిపాదనను సమర్పించాలని కోరారు. అమృత్ పథకం క్రింద పైప్‌లైన్ పనుల సమయంలో దెబ్బతిన్న రహదారులను వెంటనే పునరుద్ధరించాలని, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని అన్నారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా వైద్య సిబ్బందిని బదిలీ చేయడం, డిప్యూటేషన్‌పై పంపడం చేయకూడదని అన్నారు. శివలింగాపురం పీహెచ్సీలో వైద్యులను బదిలీ చేయడంతో ప్రస్తుతం ఖాళీ ఏర్పడి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
100 పడకల ఆసుపత్రి ప్రస్తుతం బాగా పనిచేస్తోందని, అయితే ఇటీవల గడువు ముగిసిన సెలైన్ బాటిల్‌ను రోగికి అందించడం వల్ల పరిస్థితి విషమించిన ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
మేఘా కాంట్రాక్టర్‌కు సంబంధించిన ఓహెచ్ సిబ్బంది సమ్మె కారణంగా మూడు రోజుల పాటు త్రాగునీటి సరఫరా నిలిచి పోయిందని, దీనికి బాధ్యత ఎవరిదో పరిశీలించాలని కోరారు. నీటి సరఫరా మూడు రోజుల పాటు ఎందుకు నిలిచిపోయిందో, ప్రజలు రోడ్లపైకి వచ్చి సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో సమీక్షించాలని అన్నారు.
అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, గిరిజన ప్రాంతాల్లో కనెక్టివిటీ తక్కువగా ఉన్నందున గ్రామస్థాయిలో అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
అమృత్ పథకం క్రింద మంజూరైన వాటర్ ట్యాంకులు, కొత్త పైప్‌లైన్ పనులను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని, క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అవసరమైన పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లను ప్రతిపాదించి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఇల్లందు ఏరియా ఆసుపత్రిలో సీడీపీ మెషిన్, ఎక్స్‌రే, టిఫా స్కానింగ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇల్లందు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణంలో ఉందని, ఇక్కడ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఆసుపత్రుల అభివృద్ధిపై నిర్వహించే సమావేశాల్లో ప్రజాప్రతి నిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. తమకు సమాచారం లేకుండా వైద్య శాఖ సిబ్బందిని బదిలీ చేయకూడదని కోరారు. పీజీ వైద్యులను రిలీవ్ చేసే సమయంలో ప్రత్యామ్నాయ వైద్యుడిని ఏర్పాటు చేసిన తర్వాతే రిలీవ్ చేయాలని సూచించారు.
అటవీ ప్రాంతాల్లో విద్యుత్ కనెక్షన్లు, రహదారులు, కనీస మౌలిక వసతుల కల్పనకు అవసరమైన అటవీ అనుమతులు ఇవ్వాలని అన్నారు. అడవులను సంరక్షించడంతో పాటు గిరిజన ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కూడా ఉందని తెలిపారు.
అనంతరం జిల్లాలో ఇటీవల మరణించిన అటవీ శాఖ సిబ్బంది బానోత్ నవీన్ బీటీ ఆఫీసర్ కు దిశా సమావేశం ఒక నిమిషం మౌనం పాటించి నివాళులు అర్పించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్, ఐటిడిఏ పిఓ రాహుల్, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్ మూడ్ గణేష్, డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డిఆర్డిఓ విద్యా చందన, మునిసిపల్ చైర్ పర్సన్లు, దిశ కమిటీ సభ్యులు, సర్పంచ్‌లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.