కార్పొరేట్ ల వల లో

టెన్త్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు

Apr 10, 2024 - 22:02
Jun 27, 2024 - 20:51
 0  24

ఇంటిబాట పట్టిన పీఆర్‌ఓలు

ఫలితాలు రాక ముందే

ఇంటర్‌ అడ్మిషన్లకు వేట

 నిబంధనలు పాటించని
ప్రైవేటు కళాశాలలు

హలో..  నమస్కారమండి. 

మీ పాప, బాబు పదో తరగతి అయిపోయింది కదండి. 

ఇంటర్‌కు ఏం ప్లాన్‌ చేస్తున్నారు? మాది కార్పొరేట్‌ కాలేజీ. ఐఐటీ, మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, ఏసీ, నాన్‌ ఏసీ స్పెషల్‌ బ్యాచ్‌లున్నాయి. ఇప్పుడు జాయిన్‌ అయితే డిస్కౌంట్‌ కూడా ఇస్తున్నాం. రిజల్ట్స్‌ వచ్చాక సీట్లు ఉండవు. ఫీజులు పెరుగుతాయి. మీ ఇష్టం.. ఆలోచించుకోండి' ఈ తరహా ఫోన్‌కాల్స్‌ జిల్లాలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతి రోజూ వస్తున్నాయి. ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేకంగా పీఆర్‌ఓలను నియమించుకుని మరీ విద్యార్థుల కోసం గాలం వేస్తున్నాయి.

తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదనే సాధారణంగా తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కూలీనాలి చేసో, ఆస్తులు అమ్ముకునో మంచి కళాశాలలో చదివించాలని అనుకుంటారు. దీనిని అవకాశంగా తీసుకుని అందినకాడికి దండుకునేందుకు కార్పొరేట్‌ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి.. రంగురంగుల బ్రోచర్లు చూపి.. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్‌ నెలల్లో అడ్మిషన్లు ప్రారంభించాలి. కానీ, దీనికి విరుద్ధంగా ఇంకా టెన్త్‌ ఫలితాలు రాకముందే కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల వేట ప్రారంభించేశాయి.

ఆయా కళాశాలలు నియమించుకున్న పీఆర్‌ఓలు ఇప్పటికే టెన్త్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. మూడు నెలల ముందు నుంచే ఈ తతంగం మొదలైంది. వీరు ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు, ఫోన్‌ నంబర్లు, చిరునామా ఇప్పటికే సేకరించారు. వివరాలు ఇచ్చినందుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలకు విందులు, నజరానాలు అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవ్వరికీ ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఈవిధంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన పలు కళాశాలల వారు జిల్లాలో 50 మంది వరకూ పీఆర్‌ఓలను నియమించుకున్నారు. వారు ఉదయం నుంచి రాత్రి వరకూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం, వారి కళాశాలల్లో బోధన, వసతులు, ఏసీ క్యాంపస్‌లు, ఆఫర్లు తదితర విషయాలు వివరించడం ద్వారా వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కొన్ని యాజమాన్యాలు పీఆర్‌ఓలను ప్రత్యేకంగా నియమించుకుని ఏడాది పాటు వేతనాలు ఇస్తున్నాయి. ఎక్కువ అడ్మిషన్లు చేసిన వారికి ఇన్సెంటివ్‌లు సైతం అందిస్తున్నాయి. మరోవైపు ఆయా కళాశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి సైతం ఒక్కొక్కరికి 25 చొప్పున అడ్మిషన్లు తీసుకుని రావాలని టార్గెట్లు పెట్టారు. వేసవిలో తరగతులు ఉండకపోవడంతో వారికి సగం వేతనమే చెల్లిస్తున్నారు. అడ్మిషన్లు తెచ్చిన వారికి మాత్రం ఇన్సెంటివ్‌, కొంత కమిషన్‌ ఇస్తున్నారు. లెక్చరర్లు, ఇతరులు ఎవరైనా అడ్మిషన్లు చేస్తే సాధారణ కళాశాలకు రూ.వెయ్యి, కార్పొరేట్‌ కళాశాలకు రూ.5 వేల వరకూ, హాస్టల్‌ క్యాంపస్‌ ఉన్న కళాశాలల్లో చేర్పిస్తే రూ.2,500 వరకూ అందజేస్తున్నారు. అయితే, ఈ డబ్బంతా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నదే కావడం గమనార్హం.

జిల్లాలో కార్పొరేట్‌ కళాశాలల్లో ఏటా 5 వేల నుంచి 8 వేల మంది వరకూ విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఐఐటీ, నీట్‌, ఏసీ సౌకర్యాలున్న కళాశాలల్లో ఏడాదికి రూ.3 లక్షలు, సాధారణ చదువుకు రూ1.50 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి

ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన లెక్చరర్ల ఆధ్వర్యాన నాణ్యమైన విద్య అందిస్తున్నారు. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలి. అడ్మిషన్లతో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందిస్తున్నారు. స్కాలర్‌షిప్‌ కూడా పొందవచ్చు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333