కరెంటు కోతలతో యాసంగి పంటలు ప్రమాదంలో.... రైతులను ఆదుకోవాలి
వేముల శ్రీను 24 జనవరి *తెలంగాణ వార్త ప్రతినిధి : బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకుడు వేముల సహదేవుడు డిమాండ్ నకిరేకల్, నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, వాస్తవంగా నల్లగొండ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సరిపడా విద్యుత్ సరఫరా అందడం లేదని బహుజన సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా నాయకుడు వేముల సహదేవుడు ఆవేదన వ్యక్తం చేశారు.
నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారని, అందులో 50.49 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేసినట్టు తెలిపారు. ఇలాంటి కీలక సమయంలో నిరంతర కరెంటు కోతలు, నిర్దిష్ట సమయవేళలు పాటించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
పంటలకు అవసరమైన సమయంలో నీరు అందించలేకపోవడం వల్ల పొలాల్లో వరి ఎండిపోతున్న పరిస్థితి నెలకొంటోందని, ఇది రైతుల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. రైతు శ్రమకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించాలని కోరారు.
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అమలు చేయాలని, కనీసం నిర్దిష్ట సమయపట్టికతో విద్యుత్ అందించేలా చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని యాసంగి పంటలను కాపాడాలని, రైతుల్లో నమ్మకం కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
లేనియెడల, రైతుల హక్కుల కోసం బహుజన సమాజ్ పార్టీ రైతులతో కలిసి శాంతియుత ఉద్యమాలకు సిద్ధంగా ఉందని వేముల సహదేవుడు స్పష్టం చేశారు.