ఓటరు జాబితాను సమగ్రంగా రూపొందించేందుకు సహకరించాలి

May 21, 2026 - 20:30
May 21, 2026 - 20:31
 0  2
ఓటరు జాబితాను సమగ్రంగా రూపొందించేందుకు సహకరించాలి

జోగులాంబ గద్వాల 21 మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- ఓటరు జాబితాను సమగ్రంగా, పారదర్శకంగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టిందని, రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల నేతల సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించే లక్ష్యంతో ప్రత్యేక ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం 25 జూన్ 2026 నుంచి ప్రారంభమై 01 అక్టోబర్ 2026న తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 25 జూన్ నుంచి 24 జూలై వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ముందుగానే ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని చెప్పారు. అనంతరం 31 జూలై 2026న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, 31 జూలై నుంచి 31 ఆగస్టు వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. 31 జూలై నుంచి 30 సెప్టెంబర్ వరకు విచారణలు, ధృవీకరణ ప్రక్రియ కొనసాగి, 01 అక్టోబర్ 2026న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారని వెల్లడించారు. ప్రతి ఇంటికి బిఎల్ఓ లు కనీసం మూడు సార్లు వెళ్లి ఫారాల పంపిణీ, సేకరణ చేపడతారని పేర్కొన్నారు. మరణించిన, వలస వెళ్లిన, తదితర ఓటర్ల విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. బూత్ లెవెల్ లో ఏజెంట్లను నియమించి తమ ఎన్నికల యంత్రాంగానికి సహకరించేలా చూడాలన్నారు. మ్యాపింగ్ పూర్తికాని ఓటర్లు జనన, పాస్‌పోర్ట్, విద్యార్హత , కుల, తదితర 12 రకాలు డాక్యుమెంట్స్ ను సమర్పించవలసి ఉందని పేర్కొన్నారు. ఓటర్లు అందరూ ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పాల్గొని సరైన వివరాలు అందించేలా తద్వారా పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఆదనపు కలెక్టర్ మధుమోహన్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, ఆర్డీవో శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారి మంజుల, తహసిల్దార్ హరికృష్ణ, వివిధ రాజకీయ పార్టీల నేతలు, తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State