ఒక్క తండ్రి ఆవేదన
రాజమండ్రిలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంకను మెరుగైన చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
కానీ కొద్దిసేపటి క్రితం కిమ్స్ వైద్యులు డాక్టర్ ప్రియాంక మృతి చెందినట్లు ధృవీకరించారు.
డాక్టర్ ప్రియాంక జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం ఏక్లాస్పూర్ గ్రామానికి చెందినవారు. MBBS పూర్తి చేసి రాజమండ్రిలో PG చదువుతున్నారు.
ఈ విషాదాన్ని తట్టుకోలేక ప్రియాంక తండ్రి వెంకటేష్ గుండెలు పగిలేలా రోదించారు.
"నాకు ముగ్గురు కూతుళ్లు. ప్రియాంక పెద్ద కూతురు. నాకు కొడుకులా ధైర్యంగా ఉండేది" అని ఆయన కన్నీరుమున్నీరయ్యారు.
"ఇది అదుపు తప్పి జరిగిన ప్రమాదం కాదు. కక్షపూరితంగానే చేశారు. దుర్మార్గులు డ్రగ్స్ సేవించి అహంకారంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మా అనుమానం. కాబట్టి ఏపీ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాను" అని ఆయన డిమాండ్ చేశారు.
"ఇకపై ఏ తండ్రికీ ఇలాంటి దుస్థితి రాకూడదు. ఇలాంటి అహంకారపు దుర్మార్గపు చేతుల్లో ఎవరూ బలికాకూడదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అందరూ దీనిపై స్పందించి, ఆ దుర్మార్గులకు కఠిన శిక్ష పడేలా చూడాలి. చేతులు జోడించి అందరినీ వేడుకుంటున్నాను" అని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఈ రోజు నా కూతురు అవయవదానం చేస్తోంది. ప్రాణాలతో లేకపోయినా, మరికొంతమందిలో బతికే ఉంటుందని గర్వపడుతున్నాను. కానీ ప్రియాంక బతికి ఉండి డాక్టర్‌గా సేవలు అందించి ఉంటే ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడి ఉండేది. నా కూతురు నాకు దూరమైంది అనే బాధను తట్టుకోలేకపోతున్నాను" అని వెంకటేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.