ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించని ఓటర్లు వెంటనే సంబంధిత బిఎల్ఓ లకు అందజేయాలి
ఎస్.ఐ.ఆర్. ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్.. రిజ్వాన్ భాషా షేక్
జోగులాంబ గద్వాల 29 జూలై 2026 తెలంగాణ వార్త ప్రతిని ధి : గద్వాల. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్.ఐ.ఆర్.) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఓటరు ఎన్యూమరేషన్ పత్రాల సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని, జిల్లాలో ఇప్పటికే దాదాపు 89 శాతం పూర్తయిందని, మిగిలిన 11 శాతాన్ని కూడా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) సమన్వయంతో పూర్తి చేసి వందశాతం లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్యూమరేషన్ పత్రాల సేకరణ అనంతరం రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని, ఇంకా మిగిలిన 11 శాతం ఓటర్లలో కొందరి పేర్లు రెండు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని, తమ ఓటు ఎక్కడ కొనసాగించాలనే సందిగ్ధంలో వారు ఉండవచ్చని పేర్కొన్నారు. ఒక ఓటరుకు ఒకే చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలని, రెండు చోట్ల ఓటరు పేర్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ఓటర్లు తమ ఓటు ఎక్కడ కొనసాగించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని, మరో ప్రాంతంలోని ఓటును రద్దు చేయించుకునేందుకు సంబంధిత బీఎల్‌వోకు సమాచారం అందించాలన్నారు. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్ల పేర్లు ముసాయిద ఓటర్ల జాబితాలో నమోదు కావని, వారు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. కావున అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని నిర్ణీత సమయంలో బిఎల్ఓ లకు సమర్పించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు తమ పరిధిలో ఇంకా ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించని ఓటర్లకు అవగాహన కల్పించి, వారు త్వరితగతిన పత్రాలు పూర్తి చేసి అందజేసేలా చర్యలు తీసుకోని అధికారులకు సహకరించాలన్నారు.