ఉండవెల్లి మండలంలో ఎల్ నినో ప్రభావం నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు రైతుల ఆవేదన
శేషన్ గౌడ్ మాజీ సర్పంచ్
జోగులాంబ గద్వాల 5సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో వర్షాలు లేక, కాలువలకు నీళ్లు రాక, బోర్లలో నీటిమట్టం పడిపోవడంతో వేసిన పంటలు కళ్ళ ముందే ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో మొక్కజొన్న, పత్తి,మిరప ఉల్లిగడ్డ,కందులు వంటి పంటలు నీటి ఎద్దడి కారణంగా ఎండుముఖం పట్టాయి. లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు ఇప్పుడు చేతికి పంట వస్తుందో లేదో అనే భయం పట్టుకుంది.
ఈ సందర్భంగా కంచుపాడు మాజీ సర్పంచ్ శేషన్ గౌడ్ మాట్లాడుతూ "ఉండవెల్లి మండల రైతాంగం చాలా దయనీయ స్థితిలో ఉంది. ఎల్ నినో కారణంగా వర్షాలు లేవు. కాలువలకు అధికారులు నీళ్లు వదలడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటాయి. రైతు వేసిన పంట ఎండిపోతుంటే చూసి ఉండవెల్లి మండల రైతులు తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, మండలంలో పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులను ఆదుకోవాలి. మాకు దగ్గరలో ఉన్న జూరాల ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. రైతుల బాధను అర్థం చేసుకొని జిల్లా నాయకులు, తాలుకా నాయకులు చోరవ చూపి ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి పసులకు, పంటలకు నీరు అందే విధంగా కాలువలకు నీళ్లు విడుదల చేయాలని, దీనితో భూగర్భ జలాలు పెరిగి కాస్త కూసో ప్రకృతి విపత్తును తట్టుకునే విధంగా తప్పనిసరి జూరాల కాలువకు నీళ్లు వదిలి ఉండవల్లి మండలంలోని గ్రామాల చిరాయకట్టు వరకు వదలాలని రైతులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాను. వర్షాలు లేక పంట నష్టపోయిన రైతులను, మరీ ముఖ్యంగా కౌవులు రైతులను గుర్తించి నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు వెంటనే వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి, ఎండిపోయిన పంటలకు ఎకరాకు 50వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని, పకృతి విపత్తు కింద నష్టపరిహారం అందజేసి రైతులకు భరోసా కల్పించాలని రైతు సంఘం నాయకులు శేషన్ గౌడ్ మాజీ సర్పంచ్ కోరారు.