ఆరు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలి . సీఐటీయూ డిమాండ్
జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2025తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికుల వేతనాలు విడుదల చేయాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ గారికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు నియమించిందని అన్నారు. ఈ కార్మికులకు గత ఆరు నెలల నుండి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు . కార్మికులకు జిల్లాలో సుమారుగా ఒక కోటి 92 లక్షల 90000 రావలసి ఉందన్నారు ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్న సమయంలోనే అకౌంట్ నెంబర్లు సరిగా లేవని చెక్ బుక్కులు లేవని పేర్లు తప్పుగా పడ్డాయని వంటి అనేక రకాల కారణాలతో కార్మికుల వేతనాలు ఆలస్యంగా తీసుకున్నారని అన్నారు ఈనెల 24 నుండి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించిందని దీనివల్ల కార్మికులు వేతనాల కోసం మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు కార్మికులకు ఇచ్చే వేతనాల పైన మండల జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు ప్రభుత్వం ఎటువంటి రక్షణ పరికరాలు అందజేయకున్నా,అదనపు పని భారాలను మోస్తూ, ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థుల ఆరోగ్యాలను కాపాడుతున్న కార్మికులకు నెల నెల వేతనాలు చెల్లించకుండా నెలల తరబడి కార్మికుల వేతనాలు పెండింగ్ లో ఉంచడం సరైనది కాదన్నారు అదేవిధంగా కార్మికులకు ఇచ్చే వేతనాలు మహిళా సంఘాల ద్వారా కాకుండా నేరుగా కార్మికుల ఖాతాలో జమ చేయకపోవడం వల్ల కార్మికులు సకాలంలో వేతనాలను తీసుకోలేకపోతున్నారని అన్నారు .పెండింగ్ లో ఉన్న ఆరు నెలల వేతనాలు విడుదల చేసి కార్మికుల ఖాతాలో నేరుగా వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు రేణుక సంతోషమ్మ మల్లమ్మ హనీఫా మన్నెమ్మ జయమ్మ శాంతమ్మ రాధ హజురంభి డివైఎఫ్ఐ నాయకులు ఉప్పేర్ అంజి తదితరులు పాల్గొన్నారు.