ఆయిల్ ఫామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా స్థిర ఆదాయం అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు.

జోగులాంబ గద్వాల 3 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ధరూర్ అయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా స్థిర ఆదాయాన్ని అందించే పంటగా నిలుస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు అన్నారు.మంగళవారం ధరూర్ మండలం ర్యాలంపాడు గ్రామంలో హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ పామ్ మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొని స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆయిల్ పామ్ సాగు ప్రాధాన్యత,దీని ద్వారా రైతులకు లభించే ఆదాయ మార్గాల గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు.అయిల్ పామ్ ఒక శాశ్వత పెట్టుబడి లాంటి పంట – ఒకసారి నాటితే పలు సంవత్సరాలపాటు ఆదాయం ఇస్తుందని అన్నారు.ఇది నీటి వినియోగం తక్కువగా ఉండే పంటగా రైతులకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు.ప్రభుత్వం ప్రోత్సాహక కార్యక్రమాల కారణంగా సాగు మరింత లాభదాయకంగా మారుతోందని అన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద నాటిన మామిడి తోటను అదనపు కలెక్టర్ పరిశీలించారు. మొక్కల పెరుగుదల,నిర్వహణ, నీటి సరఫరా తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి అక్బర్,రైతులు, తదితరులు పాల్గొన్నారు.