అపరిస్కృత కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం న్యాయ వ్యవస్థకు సవాలుగా మారింది
అపరిస్కృత కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం న్యాయ వ్యవస్థకు సవాలుగా మారింది.
నిరపరాదులు, పేద వర్గాలకు తీరని మానసిక క్షో భకు కారణమవుతున్నాయి.
సంస్థాగత లోపాల సవరణ, ప్రభుత్వాల చిత్తశుద్ధి, నిధులు ఈ దశలో కీలకం .
----వడ్డేపల్లి మల్లేశం
భారతదేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టుతో పాటు వివిధ హైకోర్టులు సబార్డినేట్ కోర్టులలో 5 కోట్లకు పైగా కేసులు ఫిబ్రవరి 2025 నాటికి పెండింగ్లో ఉంటే అందులో 87% కేసులు సబర్డినేట్ కోర్టులలోనే ఉండడాన్ని గమనించాలి. రాష్ట్రాల హైకోర్టులలో 12.5% కేసులు పెండింగ్లో ఉంటే సుప్రీంకోర్టులో 81, 274 కేసులు పెండింగ్లో ఉండి భారత న్యాయ వ్యవస్థకు సవాల్ విసురుతున్నా యి.ఈ పరిస్థితికి సంస్థాగతంగా ప్రభుత్వ పరంగా సామాజిక రాజకీయo గా కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ తద్వారా అన్యాయంగా నేరం ఆరోపించబడిన వారు కక్షిదారులు పేద వర్గాలు నేరంతో సంబంధం లేకుండా చట్టాల పైన అవగాహన లేని సామాన్య ప్రజానీకం మానసిక క్షోభకు గురికావడాన్ని గమనించాలి.ఒక సంవత్సరంలోపు కేసులు ఒక లక్ష 63 వేలు పెండింగ్లో ఉంటే 30 సంవత్సరాల పైబడి నటువంటి కేసులు లక్షపైగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. దేశంలోని 24 హైకోర్టులలో 12.5% కేసులు పెండింగ్లో ఉంటే ఒక్క అలహాబాద్ హైకోర్టులోనే 10 లక్షల కేసులు అపరిస్కృతంగా ఉండడాన్ని గమనించవచ్చు. కేసుల విచారణలో ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత తొందరగా నేరస్తులకు శిక్ష పడడానికి నిర్దోషులకు తగిన న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది.కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దశాబ్దాల తరబడిగా కేసులు పెండింగ్లో ఉన్న కారణంగా నేరం రుజువు కాకుండానే అపరిస్కృతంగా ఉన్న కాలానికి శిక్ష అనుభవిస్తూ అనేకమంది న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కోల్పోతు తమ కుటుంబాలకు దూరమవుతున్నారు.
ఇది ప్రభుత్వ సంస్థాపరంగా న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న కారణం ఏదైనా సామాన్య ప్రజలకు తీరని దుఃఖం మిగలడానికి కారణం అవుతున్న నేపథ్యంలో న్యాయ వ్యవస్థ ప్రభుత్వాలు ఉమ్మడిగా బాధ్యత వహించడం ద్వారా తక్షణ విచారణతో పాటు దోషులకు వెంటనే శిక్ష పడాలి.నిర్దోషులను వెంటనే వదిలిపెట్టి న్యాయాన్ని రక్షించాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నాను .ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రొఫెసర్ సాయిబాబా సత్వర విచారణ జరగని కారణంగా సుమారు దశాబ్దం పాటు విచారణ ఖైదీగా శిక్ష అనుభవించి చివరికి నిర్దోషి అని విడుదల కాగానే మృత్యు, కుహరం లోకి చేరుకోవడాన్ని గమనిస్తే ఇది ఎంత దయనీయ పరిస్థితియో, ఇలాంటి అనుభవాలు ఈ దేశంలో ఎన్ని ఉన్నాయో ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుంది. అందునా ప్రొఫెసర్ సాయిబాబా 90% అంగవైకల్యం కలిగి అనేక అనారోగ్యాలతో సతమతమవుతున్న నిర్దోషి అయిన ఖైదీ కూడా. ఇలాంటి సందర్భాలు సామాన్య ప్రజలకు న్యాయ వ్యవస్థ, ప్రభుత్వాలు, చట్టసభల మీద విశ్వాసం సన్నగి ళ్లడానికి కారణమవుతున్నాయి కూడా.
ఇటీవల కాలంలో న్యాయవ్యవస్థ కొన్ని ఆరోపణలకు గురైన విషయాన్ని గమనించినప్పుడు పరోక్షంగా ప్రభుత్వాల యొక్క వైఫల్యమే కారణమని మేధావులు గుర్తించడాన్ని గమనించాలి. ఎందరో న్యాయమూర్తులు అవినీతికి పాల్పడినట్లు అక్రమ సంపాదనతో దారి తప్పినట్లు పత్రికల్లో వచ్చినప్పటికీ అర్ధాంతరంగా ఆగిపోవడంలోని ఔచిత్యం ఏమిటో సామాన్యులకు కూడా అర్థం కావడం లేదు.
పెండింగ్ కేసుల అంతరార్థం ఏమిటి ?
న్యాయమూర్తుల యొక్క కొరత, మౌలిక సౌకర్యాలు అవసరాలు ప్రభుత్వాలు సకాలంలో తీర్చకపోవడం, కేసులను పదేపదే వాయిదాలు వేసే సంస్కృతి బలంగా ఉండడం, అనేక కేసులలో ప్రభుత్వాలే కక్షిదారుగా ఉంటున్న కారణంగా కూడా దశాబ్దాలు గడిచిపోతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేయడంతో పాటు అర్థ బలాన్ని అంగ బలాన్ని పార్టీ బలాన్ని వినియోగిస్తున్న కారణంగా కూడా న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయలేకపోతున్న మాట కూడా వాస్తవం. ఇక" సామాన్య ప్రజల దైనందిన జీవితాలకు సంబంధించి నేరస్తులు అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాలు సామాన్య ప్రజలను చిత్రహింసలకు గురి చేసిన సందర్భం కానీ అత్యాచారాలు హత్యలు చేసిన సందర్భంలో కానీ పేద వర్గాలకు సరైనటువంటి సాక్ష్యాలను దొరకకుండా తమ పలుకుబడి ఉపయోగించి అక్రమాలకు తెరదీస్తున్నందున కూడా కేసుల పరిష్కారం ఏళ్లు గడుస్తుంటే న్యాయం నత్త నడక నడవడం వలన పేద వర్గాలు అన్యాయానికి గురైన వారు శాశ్వతంగా శిక్షించబడుతూ వెలి వేయబడుతూ అపరిస్కృతంగా తీర్పులు లేకుండానే శిక్షలను అనుభవిస్తున్నారు.
" ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పష్టమైనటువంటి న్యాయ పాలిక కొనసాగుతున్న రోజులలో కూడా నేరస్తులకు శిక్షలు పడకపోవడం నిర్దోషులు చట్టాన్ని గౌరవించి నమ్ముకున్న వాళ్లకు న్యాయం జరగకపోవడం అనే విచిత్ర పరిస్థితులకు ఈ దేశం నిలయం కావడం కూడా బాధాకరం. ఇవన్నీ 0టికి కారణం కేసుల సత్వర పరిష్కారం లేకపోవడమే. ప్రభుత్వాలు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో తాత్సారం చేయడం, న్యాయమూర్తులు తరచుగా బదిలీ కావడంతో పాటు కేసుల సత్వర పరిష్కారానికి సరిపోయే స్థాయిలో నియామకం కాలేకపోవడం, సంస్థాగతమైనటువంటి లోపాలను నివారించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి .వివిధ సంక్షేమ అభివృద్ధి మౌలిక సదుపాయాల కోసం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం కూడా కేసుల తాత్సారానికి ప్రధాన కారణం కావచ్చు. అంతేకాకుండా పరిష్కరించబడుతున్నటువంటి కేసులను మించి నమోదు కావడం తరచుగా వాయిదాలు పడుతున్న కారణంగా కూడా దశాబ్దాలు గడిచిన న్యాయం దక్కకపోవడంతో ఈ దేశ న్యాయ వ్యవస్థ పట్ల అసమ్మతి చోటు చేసుకోవడం కూడా పెద్ద వైఫల్యం.
1) ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా సత్వర పరిష్కారానికి తగు మార్గాలను అన్వేషించాలి.
2) తరచుగా వాయిదాలు వేసే పద్ధతిని పునరాలోచన చేసి మార్చుకోవడం ద్వారా వేగవంతం చేయాలి .
3) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దోషులకు సకాలంలో శిక్ష పడడంతో పాటు న్యాయ వ్యవస్థను ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఆసక్తి మెండుగా ఉండాలి .
4) మౌలిక సౌకర్యాలకు ఇతర అవసరాల కోసం భారీగా నిధులను కేటాయించడం ద్వారా ఈ పరిధిని వేగవంతం చేయాల్సిన అవసరం మెండుగా ఉన్నది. లేకుంటే విశాలమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం పేరుకే కానీ న్యాయ వ్యవస్థలో మచ్చుకైనా లేదు అని సామాన్యుడు కలత చెందితే మేధావులు ఆవేదన పడితే మన వేలితో మన కంట్లోనే పొడుచుకున్నట్టు అవుతుంది. ఈ అన్ని పరిస్థితులకు సత్వర చర్యలకు పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహించాలి.న్యాయ వ్యవస్థను స్వయం ప్రతిపత్తితో నడిపించాలి. న్యాయవ్యవస్థ లో ప్రభుత్వాల జోక్యం కూడా తగదు. అలాంటి జోక్యం తప్పడం లేదని అప్పుడప్పుడు కొందరు ఆవేదన చెందడాన్ని గమనిస్తే పాలనాపరమైనటువంటి సంస్కరణలకు కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నదని తేలిపోతున్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )