అనర్హులకు ప్రధాని మత్స్యసంపద యోజన రుణాలు
ఆగ్రహిస్తున్న మత్స్యకారులు - తహశిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
పోలవరం మార్చి 4 తెలంగాణ వార్త ప్రతినిధి:- ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద అర్హత లేని వారికి 23 లక్షల రూపాయల రుణాలు ఇచ్చిన మత్య్స శాఖ అధికారుల తీరుపై విచారణ జరపాలని పోలవరం గోదావరి ఫిషర్మెన్ బోట్ మాన్ మత్స్యకార సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక మండల తహశిల్దార్ కార్యాలయం వద్ద సొసైటీ సభ్యులు సోమవారం పెద్ద ఎత్తున చేరుకుని ధర్నా చేశారు. మత్స్యశాఖ అధికారుల అవినీతి అక్రమాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికింద నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుకు రుణాలు అర్హులయిన మత్స్యకారులకు, మత్స్యకార సొసైటీ సభ్యులకు మంజూరు చేయాల్సి వుంది. ఈ నాలుగు చక్రాల వాహనాన్ని చేపల రవాణాకు వినియోగించుకోవాల్సి వుంటుంది. అయితే మత్స్యశాఖ అధికారులు దీనికి విరుద్ధంగా మత్స్యకారులతో సంబంధంలేని అర్హత లేని వారికి 23 లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేశారు.మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంలో చేపల రవాణాకు వినియోగించడం కోసం 23 లక్షల రూపాయల నిధులతో 40 శాతం సబ్సిడితో నాలుగు చక్రాల వాహనాన్ని అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన, మత్స్య కారులకు సంబంధంలేని ఒక వ్యక్తికి మంజూరు చేశారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. తాము ఏళ్ల తరబడి వాహనాల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు బుట్టదాఖల చేస్తున్నారని ఆరోపించారు. ఈ సంధర్భంగా ముంగర వెంకటరావు, గోపాల రామకృష్ణ, మల్లి తాతారావు, ముంగర ఏడుకొండలు, ముంగర వెంకటేసులు, మల్లి సుబ్రమణ్యం, మల్లి కొండబాబు ,మల్లి గెరటయ్య లు మాట్లాడుతూ తామంతా గోదావరి, చేపల చెరువులలో చేపల వేట ప్రధానంగా జీవనం సాగిస్తున్నామన్నారు. సొసైటీ పెట్టి 50 సంవత్సరాలు అవుతోందన్నారు. ఇన్నేళ్ళుగా తమకు మత్స్య శాఖ నుండి ఎటువంటి రుణ సహాయం అందలేదని వాపోయారు. కనీసం వలలు ,మరబోట్లు గాని ఇవ్వలేదన్నారు. .చేపలు పట్టి అమ్మగా వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ చేసుకుంటామన్నారు. మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం- 2021-22 లో సొసైటీ నుండి 25 మంది వరకు వాహనాలకు దరఖాస్తు చేసుకున్నామన్నారు. ఈ పధకంలో నాలుగు చక్రాల వాహనంలకు దరఖాస్తులు చేసుకోకూడదని మత్స్యశాఖ అధికారులు నమ్మబలికారు .కేవలం ఎస్.సి.,ఎస్.టిలకు మాత్రమే నాలుగు చక్రాల వాహనాలకు ఈ పధకం వర్థిస్తుందని చెప్పారు. అయితే మత్స్యశాఖ అధికారులు ధనాపేక్షతో, స్వలాభం కోసం నిబంధనలను తుంగలో తొక్కి అనర్హుడికి వాహనాన్ని మంజూరు చేసారని ఆరోపించారు.తమకు డ్రైవింగ్ లైసెన్సు, ఫిషర్ మెన్ లైసెన్స్ తదితర నిభందనలు అంటూ రుణాల దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. అన్ని ధ్రువీకరణ పత్రాలు పెట్టినా రుణాలు మంజూరు చేయ్యడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు చేపల రవాణా వాహనాన్ని మంజూరు చేస్తే పది కుటుంబాలు బ్రతికేవన్నారు. 23 లక్షల రూపాయల నిధుల విషయంలో రుణం పొందిన వారిపై రుణం మంజూరు చేసిన వారిపై మత్స్యశాఖ అధికారులపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో గోదావరి బోట్ మెన్ అండ్ ఫిషర్ మాన్ సొసైటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.