అడుగంటిన జూరాల జలాశయం
జోగులాంబ- గద్వాల 14 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల వర్షాలు లేక ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. కుంటలు, చెరువులు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అందనంత లోతుగా వెళ్లిపోతున్నాయి. సాగుకు నీరందక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.ఎండతాపంతో త్రాగు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్‌లు, చెరువులు, కుంటలలో నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో సాగు, త్రాగు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి సాగు, తాగు నీరు అందించే వారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు పడితే ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండి అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నీరు చేరేది. గత ఏడాది వరద నీటి జాడ లేక పోవడంతో కృష్ణానది బక్కచిక్కి పోయి జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. గత ఏడాది జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో జూరాలకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో నీటిమట్టం తగ్గిపోయింది. జూరాల పై కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టు లు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 9.657 టీఎంసీలకు గాను 2.084 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.
గత సంవత్సరం (2023) జూలైలో ముంచెత్తిన కృష్ణా నది ప్రస్తుతం మూగబోయింది. 2002 నుంచి 2016 వరకు కృష్ణా పరివాహక ప్రాంతంలో కరువు పరిస్థితి నెలకొనడంతో పంటల దిగుబడి తగ్గడంతో పాటుగా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రసుతం అదే పరిస్థితి పునరావృతం అయ్యింది. ఎండాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికి మండుతున్న ఎండలతో నీటి ఆవిరి పెరిగి, జలాశయాల్లో నీరు అడుగంటుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల్లో కురిస్తే తప్ప జూరాలకు కొత్త నీరు వచ్చే అవకాశం లేకపోలేదు. అంత వరకు మంచి నీటికి కటకట తప్పదు. అయితే.. తాగునీటి అవసరాలకోసం కర్నాటకలోని ఆల్మట్టి నుంచి 15 టీఎంసీల నీటిని రాష్ట్రానికి తరలించేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నప్పటికీ సాగుభూములను కాపాడే ప్రయత్నం ఎలా చేస్తుందో ప్రశ్నార్థకమైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మహబూబ్ నగర్ జిల్లాల్లో నీటి ఎద్దడితో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి.
క్రాప్ హాలీ డే..
గత యేడాది ఊహించినంత వర్షాలు కురవకపోవడంతో కృష్ణానదీ మీద ఆధారపడి ఉన్న జూరాల ప్రాజెక్టులోకి నీటి మట్టం పెరగలేదు. జూరాల నీటి మట్టం గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అధికారులు ముందస్తుగానే క్రాప్ హాలిడే ప్రకటించారు. జూరాలలో నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకొని జూరాల కుడి కాలువ, ఎడమ కాలువల ద్వారా వారబందీ విధించి త్రాగు, సాగుకు నీరందిస్తున్నారు.. జూరాల మీద ఆధారపడిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్ ల ద్వారా సాగు నీరు నిలిపివేశారు. ర్యాలంపాడు గూడెం దొడ్డి రిజర్వాయర్‌ల నుంచి రెండో పంటకు సాగు నీరు విడుదల నిలిపి వేయడంతో రైతులు యాసంగి పంటలకు వేయడానికి ముందుకు రాలేదు. బోర్లు, బావులు ఉన్న రైతులు మాత్రమే వరి పంటలు, ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఉమ్మడి జిల్లాలో గత ఏడాది వర్షాలు కురవక, జురాల జలాశయంలో నీటి నిల్వలు తగ్గడం, చెరువులు, కుంటల్లోనూ నీటి మట్టాలు తగ్గడంతో పాటు జిల్లాలో కొన్ని చోట్ల బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఎండల తీవ్రత పెరగకముందే భూగర్భ జలాలు తగ్గుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే భూగర్భ జలాలు భారీగానే పతనమయ్యాయి.
ఎండుతున్న పంటలు
వర్షాకాలంలో సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ ఎండాకాలం నీటి ఎద్దడి అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది. నిరంతరంగా బోరుబావుల వాడకం, నీటి వృథాతో పడిపోతున్న భూగర్భ జలాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరిగిన సాగు విస్తీర్ణంతో చాలాగ్రామాల్లో అడుగంటిన చెరువులు దర్శనమిస్తున్నాయి. దీంతో పాతాలగంగ పతనమవ్వడంతో అన్నదాతల పొలాలు ఎండి మూగజీవాలకు మేత గా మారుతున్నాయి. కొందరు రైతులు పొలాలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తు అప్పులపాలవుతున్నారు వారి ఆవేదన.