అటవీ సంపదకు చిచ్చు పెడుతున్న మంటలు.*
అగ్ని ఆపాలంటే, ప్రకృతి సంపదను రక్షించుకోవాలంటే
ప్రత్యామ్నాయం లేదా?
కేవలం భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా
జరుగుతున్న మారణకాండ కు పరిష్కారాలు ఆలోచించాలి .
యు ఎన్ ఓ ప్రకృతి సంపదను కాపాడడం బాధ్యతగా స్వీకరించాలి
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో అడవులు దహనం అయిపోవడం ప్రకృతి సంపద కొల్లగొట్టబడి ప్రాణులు జీవరాసులు వృక్షాలు ఖనిజాలు విలువైన సంపద ధ్వంసం అవుతుంటే ఐక్యరాజ్యసమితి ఈ విషయంలో గురుతర బాధ్యత వహించవలసిన అవసరం ఉన్నది. ప్రపంచ శాంతి కోసం ఇతరత్రా అనేక సందర్భాలకు సంబంధించి అంతర్జాతీయ దినోత్సవాలు సృష్టించి పలు వేదికల పైన ప్రపంచ ప్రజలకు దిశా నిర్దేశం చేస్తున్న యుఎన్ఓ అమెరికా కెనడా నార్వే గ్రీన్ ల్యాండ్ ఐస్లాండ్ భారతదేశంలో సహా అనేక దేశాలలో ఏటా జరుగుతున్న మారణ హోమాన్ని ఆపడానికి ఒక బలమైన యంత్రాంగాన్ని రూపొందించవలసిన అవసరం కూడా ఉన్నది. ఇది యుఎన్ఓ యొక్క చారిత్రక బాధ్యతగా గుర్తించాలి . వృక్షాలు జీవరాశి ఇతర అడవుల్లో ఉండే సంపద మానవ ప్రమేయంతో కాకుండా వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఏర్పడుతున్నటువంటి అనేక రకాల సంపద ఇలాంటి కార్చిచ్చులో దహనం కావాల్సిందేనా? దేశ ఆర్థిక సంపదను నిర్ధారించే అడవులు ఇలా కాలిపోతే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం రాదా? జీవరాసులు చెట్లు ప్రజలు ఈ మంటల్లో కాలి బూడిద కావాల్సిందేనా?
అందుకే దేశాలు స్వతంత్రంగా అంతర్జాతీయ స్థాయిలో ఉమ్మడిగా ఈ కార్చిచ్చును కబళించడానికి నిర్మూలించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసిన అవసరం ఉన్నది . మానవ ప్రమేయంతో కొంత మానవ ప్రమేయం లేకుండానే ప్రకృతి పరంగా జరుగుతున్నటువంటి ఈ అటవీ సంపద మంటల్లో కాలిపోవడాన్ని ప్రజలు బాధ్యతాయుతంగా తీసుకున్నప్పుడు మరింత భద్రత చేకూరుతుంది రక్షించుకునే అవకాశం మెరుగుపడుతుంది.
కొన్ని సంఘటనలు పరిణామాలు :-
గత 11 మాసాల క్రితం కెనడాలో జరిగినటువంటి భారీ విస్పోటనం కారణంగా వేల మైళ్ళు మంటలు విస్తరించి గ్రీన్ ల్యాండ్ ఐస్లాండ్ మీదుగా నార్వే వరకు అడవులు ధ్వంశమైనట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి . ఇటీవల 2024 ఫిబ్రవరిలో అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో ముఖ్యంగా జరిగినటువంటి అడవుల విధ్వంసం వల్ల 780 కిలోమీటర్ల పరిధిలో రెండు లక్షల ఎకరాల భూమిలో అడవులు దహించుకుపోయినాయి అంటే మనకు జరుగుతున్న అనర్థాన్ని ప్రకృతికీ జరుగుతున్న ద్రోహాన్ని మానవ సంపద కునారెల్లిపోవడాన్ని గమనించవచ్చు. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు జరుగుతున్న నష్టంగా భావించాలి ఆర్థిక సంపద కొల్లగొట్టబడి ఆర్థిక సంక్షోభాలకు ప్రధాన కారణం అవుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు అడవుల దహనాలు ఎక్కడికక్కడ కట్టడి చేయవలసిన అవసరం కూడా చాలా ఉన్నది.
ముఖ్యంగా కెనడా అమెరికా ప్రాంతాలలో నెలల తరబడిగా కార్చిచ్చు అడవులంతా విస్తరించుకుంటూ పోతూ ఉంటే శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఆ మంటలను ఆర్పడం గగనమవుతున్న వేళ అటవీ సంపద నష్టపోవడం బాధాకరం .అంతేకాదు జీవరాశి ప్రజలు సంచార గిరిజన జాతులు కూడా ఆహుతి కావడం ఆందోళన కలిగించే విషయం ప్రాంతాలు ఏవైనా కార్చిచ్చు వల్ల అడవులు తగలబడిపోతున్న వార్తలు సర్వత్రా వినపడుతున్న సందర్భంలో ఆధునిక పరికరాలు సమాచార వ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానం కూడా అటవీశాఖ దగ్గర పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది . ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని దండకారణ్యం, కృష్ణా పరివాహక ప్రాంతంలోని నల్లమల అడవులు ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో ప్రారంభమై అనేక వారాలపాటు కొనసాగి పెద్ద ఎత్తున అడవులు తగలబడుతున్నట్లుగా గణాంకాలు తెలియజేస్తుంటే ఎంతో విలువైన పక్షి, వృక్షజాతులు ఔషధ మొక్కలు త గలబడి భారీగా నష్టం జరుగుతున్నట్లు తెలుస్తున్నది .
తెలంగాణ రాష్ట్రంలోనే గమనిస్తే 2023 మార్చి నుండి 2024 మార్చి 20 వరకు 282 చోట్ల అగ్గిరాజుకున్న సంఘటనలు నమోదు కాగా 2001 నుండి 2022 వరకు రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల కారణంగా 3.30 శాతం అడవులు అంతరించిపోయాయని ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి . వర్షపాతం అభివృద్ధి పర్యావరణ ప్రకృతి అవసరాల రీత్యా 33 శాతం భూమిలో అడవులు ఉండాల్సినది పోయి ఇప్పటికి 20% కూడా దాటడం లేదంటే అందులో మూడు శాతం భూమిలో అడవులను కోల్పోయినామంటే జరుగుతున్న నష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా అంచనా వేయవలసి ఉంటుంది . భారతదేశానికి వస్తే ముఖ్యంగా మిజోరం, మణిపూర్, అస్సాం తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్లు ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మాసాల్లో ఈ ప్రమాదాలు నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది .
ముఖ్యంగా ఇతర దేశాలలో మానవ ప్రమేయం లేకుండా వడగాల్పులు ఉష్ణోగ్రతలు భారీగా ఉండడం కారణంగా ప్రమాదాలు జరిగి అడవులు దహించుకుపోతుంటే భారతదేశంలో మాత్రం మానవ ప్రమేయంతోని మానవ అవసరాల కొరకు అడవులను చెట్లను,చెత్తను స్థానికంగా దహనం చేయడం కారణంగా కూడా ఈ పెద్ద ప్రమాదాలు జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బీడియాకు చెట్ల తొలగింపు కొత్త చిగురు ఆవశ్యకత సందర్భంగా ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి అగ్ని ప్రమాదాల సందర్భంగా పక్షులు పెట్టిన గుడ్లు కాలిపోయి పక్షుల సంతతి అంతరించిపోతున్నట్లు అనేక రకాల ప్రాణికోటి జీవరాశి కూడా తమ ఉనికిని కోల్పోతున్నట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రజా చైతన్యం సామాజిక బాధ్యతతో :-
ఒక కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆరాటపడి తపనతో బాధ్యతతో ఉంటామో అదే రకంగా ప్రకృతి వనరులను కాపాడుకోవడంలో కూడా పౌర సమాజానిది కీలక పాత్ర . ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు చైతన్యముతో ఉండడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చునని విస్తారమైనటువంటి దట్టమైన అడవులు ఉన్న కారణంగా చెట్లు రాసుకోవడంతో లేదా పర్వత ప్రాంతాల్లో అగ్గిరాజుకొని ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంటే అత్యవసరంగా యంత్రాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడం ద్వారా ఇలాంటి వాటిని మరింత కట్టుదిట్టంగా నిర్మూలించవలసిన అవసరం మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన తప్పకుండా ఉన్నది. అశ్రద్ధ నిర్లిప్తత ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ పరిసర ప్రాంతాలలో పండించి
న పంట కొయ్యకాలను కాల్చే సందర్భంలో కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నట్లు పొగ వ్యాపించడం ద్వారా అనేకమంది రోగాల బారిన పడినట్టు తెలుస్తున్నది. ఇదే రకంగా పొగ వల్ల ఆ పరిసర ప్రాంత ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడుతున్న విషయాన్ని కూడా గమనించి వీటిని కట్టుదిట్టంగా నిర్మూలించవలసిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది . ప్రతి విభాగానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము సౌకర్యాలు యాంత్రిక వ్యవస్థ ఉన్నట్లే అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి మరింత అధునాతనమైనటువంటి పరిజ్ఞానాన్ని శాస్త్ర అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రకృతి వనరులు అయినటువంటి అడవులను రక్షించుకొని అగ్ని ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వాలు కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది .అది చారిత్రకమైన సామాజిక బాధ్యత కూడా.
----వడ్డేపల్లి మల్లేశం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)