అందరినీ విమర్శిస్తే మనమే మిగిలిపోతాం

Oct 24, 2026 - 23:32
 0  0

అందరినీ విమర్శిస్తే మనమే మిగిలిపోతాం. అట్లని నేర సామ్రాజ్యాన్ని అంగీకరిద్దామా? చెట్ల పరిరక్షనతో పర్యావరణానికి మేలు జరిగినట్లు మనిషిని మార్చడానికి  ప్రత్యామ్నాయం వెతకాలి.

---  వడ్డేపల్లి మల్లేశం

సంసారం అంటే  భార్యాభర్తల బంధంతో కూడుకున్నటువంటి  జీవన విధానం. సంసార్ అంటే ప్రపంచం . సంసారం కూడా  ప్రపంచమంత విశాలమైనది. సముద్రాన్ని ఈ ద వచ్చు కానీ సంసారాన్ని  ఈదడం చాలా కష్టం అని పెద్దలు అప్పుడప్పుడు  వల్లే వేస్తూ ఉంటారు.  భార్యాభర్తల వ్యవహారం,  ఘర్షణ సమన్వయం, ఐకమత్యం,  కుటుంబ  బంధాలు, పిల్లలు, కుటుంబ పోషణ, ఆర్థిక నేపథ్యం,  ఆదాయ మార్గాలు,  ఇరుగుపొరుగు వారితో సంబంధాలు,  పిల్లల పెంపకం,  మానవ సంబంధాలు, బంధుత్వాలు  మొదలగు అన్ని నిర్వహించే క్రమంలో  సంసారం కూడా ఎంత లోతైనదో నిజ జీవితంలో మన అనుభవం ద్వారా అర్థం చేసుకుంటున్నాం.  అందుకే   సముద్రం కంటే సంసారమే లోతైనదని పోల్చి ఉంటారు.  విస్తృత బంధాలతో  విశాలమైన అవగాహనతో  సమాజం తన  మనుగడ కొనసాగిస్తున్న వేళ  విభిన్న వర్గాలు వృత్తులు  ఉపాధి అవకాశాలు ఆదాయ మార్గాలతో  పరస్పర అవగాహనతో సంబంధాలతో  సమాజం నిరంతరం విలసిల్లుతూ ఉంటుంది. సంబంధాలను పెన వేసుకొని  సంక్లిష్టమైన ఉనికిని కనబరుస్తుంది .వివిధ రకాల వృత్తులు హోదాలు, ఉద్యోగాలు  పదవులలో పని చేస్తున్నటువంటి క్రమంలో  కలిసి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకునే వాళ్ళు, కలిసిరాని అవకాశాల కోసం  ఆరాటపడి పోరాడే వాళ్లు, అవినీతి ఊబిలో కూరుకుపోయిన వాళ్లు,  స్వార్థ చింతనతో  అక్రమ సంపాదన ఆశతో  ఇతరులను దోపిడీ పీడన వంచించడానికి కూడా వెనకాడని క్రమంలో  అవినీతిపరులుగా  అత్యాచారాలకు పాల్పడే వాళ్ళుగా  నేరస్తులుగా
దోపిడీదారులుగా స్వార్థపరులుగా  హంతకులుగా  ఈ సమాజంలో భిన్న రకాలుగా మారు తున్నారు. .సమాజాన్ని ఉన్నతీ కరించి ఉత్తమ సమాజ నిర్మాణానికి  దారులు వెతకడానికి ఉపయోగపడుతుందని భావించిన విద్య  తన సామాజిక ధర్మాన్ని విస్మరిస్తున్న వేళ  దాన్ని నిర్వహిస్తున్న పాలకులు  దాని గమనాన్ని మారుస్తున్న కారణంగా  విద్యా వ్యవస్థ  ఈ సమాజాన్ని మార్చలేకపోతున్నది.  దేశ భవిష్యత్తును తరగతి గదిలో రూపుదిద్దడానికి బోధన ఉపయోగపడుతుందని  ప్రజలందరికి కుల మత ఆర్థిక పరిస్థితులకు అతీతంగా  ప్రాంతాలవారీగా కామన్ స్కూల్ ను  అమలు చేయడమే ఈ దేశంలో ఉన్నటువంటి అసమాన తల నివృత్తికి పరిష్కారమని  కొఠారి కమిషన్ ఎంత హెచ్చరించినా  ఆ ఒక్కటి తప్ప అన్ని అమలు అవుతూనే ఉన్నాయి..  అన్నింట్లో అవినీతి రాజ్యమేలుతూనే ఉంది.  పాలనా వ్యవస్థలు ప్రభుత్వాలు మారినాకొద్దీ లక్ష్యాలు విధానాలు, గమ్యాలను మార్చుతూ పోతూ ఉండటం వల్ల  ఒకనాడు కులాలవారీగా పాఠశాలలు నిర్మించినది ఆదర్శవంతం అయితే  మరొక్క నాటికి కుల వ్యవస్థకు అతీతంగా  అందరికీ ఒకే పాఠశాల అనే ముసుగులో...... భవనాలు లేక ఒకవైపు పాఠశాలలు బోసిపోతూ ఉంటే మరొకవైపు  పిల్లలు లేక మొండి గోడలతో  పాఠశాల గదులు మనలను వెక్కిరిస్తున్నాయి. .ఇదంతా కూడా ఆయా ప్రభుత్వాలు తమ పాలనా కాలంలో స్వార్థ ప్రయోజనాలకు పేరు కోసం పాకులాడి ప్రజాధనాన్ని అప్పనంగా కొల్లగొట్టడం వల్ల జరుగుతున్నటువంటి తప్పిదం గా మనం భావించాలి.

విమర్శించక తప్పదు  అట్లని దూరం పెడితే ఎలా

క్రమంగా నైతిక విలువలు దిగజారుతున్న వేల  ప్రతి చోట అవినీతి రాజ్యమేలుతూ ఉంటే స్వార్థం లంచగొండితనం  అమానవీయ సంస్కృతి విచ్చలవిడిగా జడలు విప్పి  వ్యాపిస్తున్న తరుణంలో  మంచి మనుషులు మనకు కనబడడం  ఇబ్బందికరంగా మారింది.  తల్లిదండ్రులు వివిధ హోదాలు ఉద్యోగాలలో ఉండి లంచం తీసుకుంటూ అవినీతికి పాల్పడుతూ ఉంటే వాళ్ల పిల్లలు కూడా  ప్రశ్నించలేక  సమాధానం చెప్పుకోలేక రాజీ పడి  ఆ అవినీతిలో భాగం కావలసి వస్తున్నది.  సానుకూల దృక్పథాన్ని ఎంత  అందిపుచ్చుకున్నప్పటికీ వ్యతిరేక ఆలోచనలతో ఉన్న వాళ్ళతో ఈ సమాజం నిండిపోవడం నిజంగా బాధాకరం.  అట్లని ఈ  సంఘ వ్యతిరేక శక్తులను వదిలిపెడదామా?  మరి ఎవరి కోసం బతకడం అనేది ఒక పెద్ద ప్రశ్న. గుర్తించకుండా ప్రశ్నించకుండా అంగీకరించి రాజీ పడుతూ తప్పులను  ఒప్పుకుంటూ భయపడుతూ పోతే  ఆ పరిస్థితి కూడా పెద్ద విషాదకరమే. దేశంలో న్యాయ వ్యవస్థలో  కోట్లాదిమంది విచారణ ఖైదీలు గానే శిక్ష అనుభవిస్తూ చివరికి  నిర్దోషులుగా దశాబ్దాల  తర్వాత  విడుదలవుతూ ఉంటే ఇది దేనికి సంకేతం?  దేశానికి మార్గాన్ని చూపించవలసినటువంటి చట్టసభలలోనే  నేరస్తులు రాజ్యాలేలుతూ  నేర సామ్రాజ్యాలను విస్తరిస్తూ ఉంటే  పొంతన లేని రాజకీయ ప్రజా జీవితాల మధ్యన  సామాన్యులు నలిగిపోవాల్సిందేనా?  ప్రభుత్వాలు  తమ విధానాల కారణంగా ప్రజలకు ద్రోహం జరుగుతుందని తెలిసి కూడా  క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు మద్యపానం ధూమపానం ఇతర   అసాంఘిక కార్యక్రమాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ ఉంటే  ఇక నిజాయితీపరులు ఈ దేశంలో ఎవరు ? ఎలా తయారవుతారు? అమెరికా లాంటి దేశాల్లో పాఠశాలల్లో విద్యార్థులు  తోటి విద్యార్థులను ఇస్టా రాజ్యంగా పిస్టల్ తో కాల్చిపారేస్తూ ఉంటే  ఆ దుష్ట సంస్కృతి మీడియా ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాపిస్తున్న సందర్భంలో  తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే పరిస్థితులు ఉన్నాయా? అణువణువునా అడుగడుగునా హత్యలు దోపిడీలు దహ నకాండలు మానభంగాలు పిల్లలతో సహా పెద్దలు వృద్ధుల వరకు కొనసాగుతూ ఉంటే  చట్టంలోని లోపాలు  న్యాయ వ్యవస్థ పైన ఒత్తిడి చేస్తున్న దుష్ప్రభావాల కారణంగా  నే ర సామ్రాజ్యాలు రోజురోజుకు విస్తరిస్తున్నాయే తప్ప  అవినీతిని అరికట్టి నేరాలను సంస్కరించి తగిన శిక్షలు విధించి  మానవీయ కోణంలో ప్రవర్తించే మంచి మనుషులుగా తయారు చేసే అవకాశం ఇవ్వాళ ఎక్కడిది?  దానివల్లనే  ఎటు చూసినా ఎడారి! ఎటు చూసినా యుద్ధ వాతావరణం! శవాల కుప్పలు లాగా  అంధకారం!  నిరాశవాదం ఆవరించిన పరిస్థితులు నిజం కాదా?  ఇ o దుకు ఏ ఒక్కరో బాధ్యులు కాదు అలాగే ఏ ఒక్క వర్గం కూడా  బాధ్యత లేదని తప్పించుకోవడానికి వీలు లేదు.  మౌనంగా  తప్పులు చేస్తూనే స్వార్థపూరిత ప్రయోజనాలకు పాకులాడుతూనే  వర్గ ప్రయోజనాన్ని పెంచి పోషిస్తూ  కులమత రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ని స్తూ వివక్షత  అణచివేత దోపిడీ  ఆధిపత్య భావజాలాన్ని సమాజం నిండా విస్తరింపజేసిన పరిస్థితుల మధ్యన  ఈ దేశం వెలిగిపోతుంది అంటే ఎలా అంగీకరిద్దాం? అట్లనే అంగీకరించకుండా ఉంటే  మనం బాధ్యతాయుతమైన పౌరులం ఎలా అవుతాం? ఇది మనకు సందిగ్ధ పూరిత సంక్లిష్ట ప్రశ్నగా మిగిలిపోయింది వాస్తవం కాదా?  స్వతంత్ర పోరాటంలో ఆ తర్వాత జరిగినటువంటి ప్రజా  సంస్కరణల పోరాటాలు  మనుగడ కోసం సాగిన పోరాటాల సందర్భంగా ప్రజలు పోరాట వీరులు  లక్ష్యంతో పని చేసినారు, తమ ఆత్మల బలిదానం చేశారు,  భవిష్యత్ తరాల కోసం  వారు చేసిన త్యాగం చరిత్రలో మిగిలిపోతే నేడు మనం చేసిన త్యాగం ఏదో చెప్పుకోవడానికి ఎక్కడ ఆనవాలు కూడా లేదు. అంగీకరిస్తారా?

అయినా మనిషిని కాపాడుకోవాల్సిందే

మనిషి బతికి ఉంటే ఒకనాడు కాకపోయినా ఒకనాడు అయినా మనకు తోడ్పడతాడు ఉపయోగపడతాడు  ఒక్కసారి నేరం చేశాడని ప్రతిసారి కూడా నేరస్తుడిగా చూస్తే ఎలా? అనే ఆలోచన కూడా మనకు ఉండాల్సిందే.  తోడెవరు లేకుండా  నువ్వు ఆశించిన లక్ష్యాన్ని ఎలా సాధిస్తావు?  అమాయకులు, మ0ద బుద్ధి గలవారు,  విప్లవకారులు,  వ్యతిరేక శక్తులు అనేక రకాలుగా ఉన్నప్పటికీ  వీరందరినీ  కలుపుకుపోవలసిన బాధ్యత మళ్ళీ మన పైననే ఉంది.  ప్రధానంగా ప్రస్తుతం యువత ఈ దేశంలో ప్రపంచంలో  ఉన్నతమైన పాత్ర పోషిస్తున్న సందర్భంలో  ఇలాంటి సమన్వయానికి  ఈ దేశంలో ప్రజలను బతికించుకోవడానికి అందర్నీ సంరక్షించుకోవడానికి  బాధ్యత తీసుకోవాల్సింది యువతే.  భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించుకోవడానికి తప్పులు ఒప్పులు, బాధలు ఇబ్బందులను అన్నింటి భరించాల్సిందే.  పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని మనం  నినదీస్తూ ఉంటాం  అలాగే  వీలున్న మేరకు ఈ సమాజాన్ని ఉద్ధరించుకోవడానికి మనం మెచ్చిన సమాజాన్ని ఆవిష్కరించుకోవడానికి  కనీసం గానైనా ప్రయత్నించకుండా ఫలితాన్ని ఆశించడం అంటే అత్యాశే అవుతుంది.  చెట్లను కాపాడుకుంటే పర్యావరణం  రక్షించబడి  మన ఆరోగ్యం బలపడుతుంది మనుషులను కాపాడుకుంటే  మానవతా కుసుమాలతో  ఈ సమాజం  సుభిక్షంగా వర్ధిల్లుతుంది.  వ్యతిరేక శక్తులను  వ్యతిరేక లక్షణాలను అంతం చేయడం,  సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం,  త్యాగపూరిత లక్షణాలను  జీర్ణింప చేయడం ద్వారా  ఇక ఎవరూ లేరు నేను ఒక్కడినే ఎలా అని రోధించినటువంటి పరిస్థితుల నుండి  మనం బయటపడాలి. మన సమాజాన్ని  ఒడ్డుకు చేర్చాలి.  అందుకే అందరూ నేరస్తులాగే కనపడిన  మంచి వాళ్లను అందులో నుండే తయారు చేసుకోవాలి.  అవినీతిపరులే అయినా  నీతివంతులుగా మార్చుకోవాలి. సోమరిపోతుల్లాగా కనిపించిన  చైతన్యవంతులుగా తీర్చిదిద్దుకోవాలి.  ఇదంతా మన మీద ఉన్నటువంటి  సామాజిక బాధ్యత.  ఈ మాత్రపు సామాజిక బాధ్యత పాలకులు  తీసుకోని కారణంగా  వ్యవస్థ దశాబ్దాల తరబడి కుo టుబడుతున్నది. పాలకులను మార్చాలన్నా, వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా,  ఉత్తమ సమాజాన్ని నిర్మించాలన్న  లక్ష్యంతో పని చేసే యువత బుద్ధి జీవులు మేధావులు కొందరైనా ఉపక్రమించాలి.  అడుగులో అడు గేసి చేయి చేయి కలిపి  భుజం భుజం  స్పృశించి చైతన్య శక్తిని  పుంజు కోవాలి. అదే  ఇవాళ సకల సమస్యలకు ఈ దేశంలో పరిష్కారం.నిరాశతో ఉంటే ప్రయోజనం శూన్యం.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333