హింస వివాదాలు శాంతిభద్రతల పరిరక్షణ పేరున సమంజసమే!
కానీ విచ్ఛిన్నమవుతున్న కుటుంబ బంధాలు మానవ సంబంధాల
బలోపేతానికి ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం కొంత విఘాతమే! ప్రభుత్వాలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తే బాగుంటుంది...
---వడ్డేపల్లి మల్లేశం
అంతర్జాతీయ యుద్ధ ప్రమాదాలు వాటి పరిణామాలు దేశాల మధ్య తగవులు ఉత్పత్తులు ఎగుమతి దిగుమతుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో వస్తున్న మార్పులు శాస్త్ర సాంకేతిక రంగాలకు విస్తరిస్తున్న ప్రమాద సూచికలు పర్యావరణ విచ్ఛిన్నం ఆహారంలో విష సంస్కృతి అధిక ఎరువుల వాడకం వంటి అంశాలు ఏదో రకంగా మానవ జీవితం పైన నిత్యం ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ అంశాల పైన రాస్తున్న వ్యాసాలు రచనలు వస్తున్నటువంటి సారాంశాలు వర్ణిస్తున్నటువంటి కవితలు ఏదో రకంగా మనుషులను ప్రభావితం చేస్తాయి అనడంలో సందేహం లేదు. కానీ మానవ సంబంధాలు బలోపేతంగా ఉండడం, కుటుంబ బంధాలు బలంగా ఉండడం, హింస కలహాలు, కల్లోలాలు వివాదాలు లేకుండా మనుషుల మధ్య కుటుంబ సభ్యుల మధ్యన శాంతియుత సంబంధాలను కాపాడే విషయంలో మాత్రం అటు పాలకులు ఇటు ప్రజలు ప్రజా సమూహాలు చివరికి ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు కూడా దృష్టి సారించడం లేదు అంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ పరిస్థితులను స్థానిక పరిస్థితులు ప్రభావితం చేసినట్లు దేశ రక్షణ అభివృద్ధి శాంతిభద్రతలు స మ సమాజం వంటి అంశాలను కుటుంబ బంధాలు మానవ సంబంధాలు కూడా ప్రభావితం చేస్తాయని అంగీకరిస్తే కానీ సమాజంలోని భిన్న వర్గాల ప్రజల మధ్యన శాంతి నెలకొనడం సాధ్యం కాదు. ఇటీవల కాలంలో టీవీ యూట్యూబ్ ఛానల్ లో కుటుంబ మానవ సంబంధాలు, భార్యాభర్తల వివాదాల పైన కొంత పరిష్కార దిశలో కొనసాగే కార్యక్రమాలు నిర్వహించడం కారు చీకట్లో కాంతిరేఖ వంటిదే. ఒక న్యాయవాది సామాజిక కార్యకర్త మహిళలు మేధావులు సభ్యులుగా ఉన్నటువంటి ఈ సమూహం విచ్ఛిన్నమైనటువంటి మానవ సంబంధాలకు సంబంధించి తగవులను పరిష్కరించే క్రమంలో కొద్దో గొప్పో కృషి చేయడం భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని పెంచడమే అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ కార్యక్రమాలు కేవలం వారానికి ఒకరోజు టీవీలలో మాత్రమే పరిమితంగా ప్రసారమైతే చర్చ జరిగితే నిగ్గదీసి నిలదీసి ఇ రుపక్షాలను అడిగితే సరిపోదు. విశాలమైన సమాజంలో కుటుంబములో తగవులు, బంధుత్వంలో వివాదాలు, భార్యాభర్తల మధ్యన కయ్యాలు, అనేక చోట్ల కలహాల కాపురాలు చిలికి చిలికి గాలి వానగా మారుతున్న సంఘటనలు హత్యలకు ఆత్మహత్యలకు కుటుంబ విచ్చిన్నా నికి గృహ దహనాలకు క్షణిక ఆవేశంలో జరిగే అనేక మారణకాండలకు కారణం అవుతు నిత్యం అనేక ఉదాహరణలు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి.
భార్యాభర్తల మధ్యన ఆధిపత్య పోరాటం, సర్దుబాట్లు లేక కలహాలు, కుటుంబ సభ్యులు సహకరించకపోవడం, పురుషులకు స్త్రీలకు కూడా అత్తవారింట్లో అనేక సమస్యలు, పరస్పరము కక్షలు పెంచుకొని హత్యలకు ఆత్మహత్యలకు దారి తీయడం, ఆస్తుల విధ్వంసం మనం నిత్యం కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యలకు పరిష్కారాలను వెతికే క్రమంలో కుటుంబ, సమాజపరంగా కొద్దో గొప్పో జరుగుతున్నప్పటికీ చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ లేకపోవడంతో ప్రభుత్వ పరంగా ఎ లాంటి కృషి జరగడం లేదు. మానవ సంబంధాలను కుటుంబ బంధాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత పాలకవర్గాలదే. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న ఈ దేశంలో అంతో ఇంతో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడానికి అదే పరిస్థితిలు కారణమని ఆర్థికవేత్తలు చెబుతున్నప్పటికీ ఆ బంధాలను మాత్రం కాపాడడానికి, ఏర్పడ్డ తగవులను పరిష్కరించడానికి, వారి కృషిని ఉత్పత్తిలోనూ ప్రజాస్వామిక పరిరక్షణలోనూ స్వీకరించడానికి పాలకవర్గాలు ఎక్కడ సిద్ధంగా ఉన్నట్లు కనిపించదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు కుటుంబ బంధాలలో మానవ సంబంధాలలో హత్యలు ఆత్మహత్యలు జరిగిన తర్వాత లేదా గృహ దహనాలు మారను హోమాలు చోటు చేసుకున్న తర్వాత మాత్రమే పోలీసులు వెళ్లి పరిశీలించి విచారణ పేరుతో సంవత్సరాలు గడిపి చివరికి ఎలాంటి ఫలితాలను పొందకుండానే కేసులు కనుమరుగవుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ప్రేమ పేరుతో తగవులు, వివాహాలను నిరాకరించడం, అప్పులను ఎగ బెట్టడం, పరస్పరం దుర్భాషలాడుకోవడం, తల్లిదండ్రులకు పోషణ లో అనేక అవాంతరాలు, చివరికి అనాధలుగా మారుతున్నటువంటి సందర్భాలు, అక్కడో ఇక్కడో కొద్దిమంది బుద్ధిమంతులు ఉంటే అలాంటి సమస్యలను పరిష్కరించడానికి జోక్యం చేసుకుంటున్నప్పటికీ చట్టబద్ధతలేని కారణంగా నిరాదరణకు దాడులకు గురికావడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ పరిస్థితుల్లో ప్రశాంత పరిస్థితులను కొనసాగించడానికి, కుటుంబ మానవ సంబంధాలను మరింత బలోపేతంగా వికసింప చేయడానికి, ప్రజాస్వామ్య పరిరక్షణలోనూ ఆర్థిక అభివృద్ధిలోనూ సమసమాజ స్థాపనలో ప్రతి వ్యక్తి యొక్క పూర్తి సహకారాన్ని పొందడానికి, ప్రజల యొక్క సంతృప్తి మానసిక ఆనందం వికాసం కలహాలు లేని కాపురాలు ఎంతో దోహదపడతాయి .అంతేకాదు ఇలాంటి తగవులను పరిష్కరించే క్రమంలో పోలీసు వ్యవస్థ కూడా పెద్ద మొత్తంలో భారాన్ని మోయవలసి వస్తున్నది . కుటుంబ బంధాలను పరిరక్షించలేని అసమర్ధ ప్రభుత్వాలుగా పాలకవర్గాలకు నిందలు తప్పడం లేదు. ప్రజా సమూహాలు ప్రశాంతంగా మానసిక వికాసంతో కలహాలు లేకుండా ఉన్నప్పుడు ,అభివృద్ధి సంబంధాలు, సేవా కార్యక్రమాలలో మరింత చురుకుగా ప్రజలు పాల్గొనడానికి, ఉత్పత్తులను పెంచడానికి,దేశాభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఈ విలువలతో పాటు ప్రభుత్వాలు మానవ సంబంధాలు కుటుంబ బంధాల బలోపేతానికి ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించడం అవసరం.
టీం సభ్యులతో ప్రత్యేక యంత్రాంగం
------------------------------------------------------=
మానవ సంబంధాలు ముఖ్యంగా కుటుంబ బంధాల్లో వస్తున్నటువంటి పగుళ్లను తొలి దశలోనే పరిష్కరించి
ప్రేమానురాగాలతో సుఖవంతంగా జీవించడానికి జాతి జన జీవితంలో తమ పాత్రను ఉత్కృష్టంగా పోషించడానికి ప్రజల మధ్యన వస్తున్న తగవులను ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగం ద్వారా పరిష్కరించబోనుకోవడం విప్లవాత్మక మార్పు గానే భావించవచ్చు. ఇప్పటికీ టీవీలలో వస్తున్నటువంటి ప్రసారాల మాదిరిగా మరింత విస్తృతంగా రాష్ట్రస్థాయి నుండి మండల గ్రామీణ స్థాయి వరకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా కుటుంబ మానవ బంధాల పరిరక్షణ, బలోపేతానికి చర్యలు తీసుకోవడం కూడా తమ బాధ్యత అని ప్రభుత్వాలు భావించాలి. ఇందుకోసం సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, మానసిక మానవ సంబంధాల నిపుణులతో ప్రత్యేక కమిటీలను జిల్లా రాష్ట్ర మండల స్థాయిలలో ఏర్పాటు చేయడం ద్వారా స్వచ్ఛందంగా ఈ సంస్థలు పనిచేయడానికి వీలు కల్పించాలి. వీటికి పూర్తి చట్టబద్ధత కల్పించడం ద్వారా కమిటీలు చేసే సిఫారసులు లేదా నిర్ణయాలు తీర్మానాలకు సంబంధిత ప్రజలు కట్టుబడి ఉండేలా ప్రత్యేక చట్టం ద్వారా ఈ వ్యవస్థను రూపొందించాలి. ఇప్పటికీ గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్యన,ఇరుగుపొరుగు వారి మధ్యన, మానవ సమూహాల మధ్యన వస్తున్న తగవులను పరిష్కరించడానికి కొంత కృషి జరుగుతున్నప్పటికీ పోలీసు వ్యవస్థ పూర్తిస్థాయిలో పరిష్కరించకపోగా కొంతమంది పేదలు, సామాన్యులు అమాయకులు ఆ వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతున్న సందర్భాలు అనేకం. ఇక్కడ వారికి భరోసా కల్పించి, పరిస్థితుల అర్థం చేయించి, చట్టాల వాస్తవాన్ని వివరించి, న్యాయం వైపు తీర్పులను ఇవ్వడానికి మధ్యే మార్గంగా వ్యక్తులను కలపడానికి సూహృద్ బావ పూర్వక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఈ కమిటీల యొక్క తీర్పులను సిఫారసులను అమలు చేయడానికి ఆమోదించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పోలీసు, కోర్టుల వ్యవస్థ చాలామందికి అందుబాటులో లేకపోగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారి ఆ వైపు తలదూర్చడానికి కొందరు ఇష్టపడడం లేదు. మరి కొందరు అందులో చిక్కితే సంవత్సరాలు దశాబ్దాలు అయినా పరిష్కారం కాదు అనే దురభిప్రాయంతో ఉన్నారు. మరికొందరు పోలీసు వ్యవస్థ చేతిలోకి వెళ్తే జరిమానాలు దెబ్బలు శిక్షలు తప్ప ప్రయోజనం ఉండదని తప్పుడు భావనతో కూడా ఉన్నారు. ఈ తప్పుడు అభిప్రాయాలకు చెక్ పెట్టడానికి, శాంతిభద్రతలకు సంబంధించినటువంటి న్యాయ పోలీసు వ్యవస్థ మీద అదనపు భారాన్ని పడకుండా చూడాలంటే ప్రత్యేక నిపుణులతో మానవ సంబంధాలను పరిరక్షించే ఉద్దేశంతో ఏర్పడే ఇలాంటి కమిటీలు ఎంతగానో తోడ్పడతాయి. అయితే ప్రభుత్వాలు ఇప్పటివరకు ఆ వైపు కన్నెత్తి చూడలేదు కనీసం ఆలోచన చేయలేదు. ఎప్పుడో ఎక్కడో సామాజిక మానసిక నిపుణుల సలహాలను తీసుకోవడం లేదా ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే అప్పుడప్పుడు విని ఆనందపడుతున్నాము కానీ అదే క్షేత్రస్థాయి వరకు వెళ్లి ఇ రువర్గాలను లోతుగా పరిశీలించి అక్కడి ప్రజలతో మమేకమై శాంతి భద్రతలకు విఘాతం కలగని రీతిలో సామరస్య పూరిత వాతావరణంలో అర్థం చేయించడం ద్వారా మనస్పర్ధలను తొలగించడానికి ఈ వ్యవస్థలో ఎంతో అవకాశం ఉంటుంది. సంఘర్షణలు యుద్ధాలు కలహాలు అంటే ఇవాళ అందరికీ ఇష్టమైపోయింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం మద్యపానం, ధూమపానం, అక్రమార్జన, ఆధిపత్య భావన, రాజకీయ పరిస్థితుల యొక్క పునాది కూడా ప్రత్యేక కారణాలు. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని వీటి ప్రభావం ప్రజల మీద పడకుండా ఈ కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకోవడం ఒక అంశమైతే ముఖ్యంగా మద్యపానం ధూమపానం పర్మిట్ రూములు ఇతర విలాసవంతమైనటువంటి అలవాట్లకు ప్రజలను దూరంగా ఉంచగలిగే నూతన వ్యవస్థ ఆవిష్కరించబడినప్పుడు మాత్రమే మానవ సంబంధాలను ప్రస్తుతము కంటే మరింత మెరుగైన స్థితిలో చూడగలం. ఈ దేశంలో ఉచిత విద్య వైద్యం ప్రజలకు అందించాలనే ఆలోచన సోయి ఏ ప్రభుత్వానికి లేదు. అలాగే కలహాలు కన్నీరు వివాదాలు లేకుండా ప్రజలను సంతోషంగా సమన్వయంగా ఉంచాలనే ఆలోచన కూడా ప్రభుత్వాలకి లేదు. ఎందుకంటే నిరంతరం సంఘర్షణ పోరాటం ఆరాటాలు ఆందోళనలు హింస ఉంటేనే ప్రభుత్వాలకు తమ పాలనాపరమైనటువంటి నిబంధనలో నియమాలను అతిక్రమించడానికి ప్రజల మనసులను దాటవేయడానికి ప్రజలు ప్రశ్నించకుండా దారి మళ్ళించడానికి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ఏర్పడినటువంటి మద్యపానము, ధూమపానము, డ్రగ్స్, క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు ఇతరత్రా అన్ని కార్యక్రమాలు... అంతెందుకు దేవాలయాలు విద్యాసంస్థలకు చేరువ లోనే మద్యపానం షాపులను తెరిచి జ్ఞానాన్ని తుంచి అనారోగ్యాన్ని పెంచి సొమ్ము చేసుకుంటున్న వ్యవస్థ మనది. బహుశా ఈ క్రమంలోని నివారణ ఆలోచన కావచ్చు ఇటీవల టీవీకే నాయకత్వంలో ఏర్పడినటువంటి తమిళనాడు ప్రభుత్వం విద్యాసంస్థలు దేవాలయాలకు చేరువలో ఉన్నటువంటి మద్యపానం దుకాణాలను రద్దు చేయడంతో పాటు క్రమక్రమంగా తమిళనాడు రాష్ట్రమంతటా మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి పూను కున్నట్లుగా తెలుస్తున్నది. ఇదే నిజమైతే ఆ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తే మనమందరం స్వాగతించవలసిందే. ఎందుకంటే కక్షలకు వివాదాలకు ప్రధాన కారణం మద్యం డ్రగ్స్ అంటే అతిశయోక్తి కాదు ఇది అందరికీ తెలిసినదే ఇక కావాల్సింది ప్రభుత్వాలకు చిత్తశుద్ధి. ప్రజలను క్షేమంగా, ఆరోగ్యంగా, చైతన్యంగా, అప్పుల పాలు కాకుండా, నిజమైన ప్రజలుగా దేశ పరిపాలనలో భాగస్వాములు కావాలని పాలకులకు ఉన్నప్పుడు మాత్రమే ఇప్పటికీ ఈ దేశంలో పురుడు పోసుకొని కొద్ది మంది మనసుల్లో మాత్రమే గూడు కట్టుకున్నటువంటి చట్టబద్ధమైనటువంటి కుటుంబ బంధాల బలోపేతానికి కమిటీలు అనే ఆలోచన చిగురించే అవకాశం ఉంటుంది. ఏకకాలంలో ప్రజలకు ఉత్సాహం చైతన్యం ప్రశ్నించే తత్వం ఏ మేరకు అవసరమో ఆ స్థాయిలో పాలకులలో చిత్తశుద్ధి స్పృహ సోయి ఉంటే ఈ కొత్త విధానం ఆచరణకు రావడం పెద్ద కష్టమేమీ కాదు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )