సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

Jun 20, 2026 - 20:19
 0  0
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు.

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష.

జోగులాంబ గద్వాల జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్, గద్వాల ఎమ్మెల్యే , అధికారులు.

 రాష్ట్రంలో సాగునీటి రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి , గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, సర్వే, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా  ప్రాజెక్టుల వారీగా, నియోజకవర్గాల వారీగా భూసేకరణ పురోగతిని మంత్రి క్షుణ్ణంగా సమీక్షించారు. ఇప్పటివరకు ఎంత భూమి సేకరించబడింది, ఎంత భూమి పీడీ (ప్రాథమిక నోటిఫికేషన్) దశలో ఉంది, ఎంత భూమి పీఎం స్థాయిలో ఉంది, ఎన్ని అవార్డులు ప్రకటించారు, ఎంత పరిహారం చెల్లించారు, ఇంకా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జిల్లాలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు.
 ఆ దిశగా అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి పెండింగ్‌లో ఉన్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, సాగునీటి వనరుల విస్తరణ ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.  రైతుల అభ్యంతరాలు, భూవివాదాలు, పరిహారం చెల్లింపులకు సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. 

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రెవిన్యూ, ఇరిగేషన్, సర్వే అధికారులతో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి శుక్రవారం భూసేకరణ విషయంపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. 
ఆయా ప్రాజెక్టుల పనులు పూర్తయితే సాగునీటితోపాటు వ్యవసాయాధారిత పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం లభించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టుల పాత్ర అత్యంత కీలకమని వారు  అభిప్రాయపడ్డారు. అనంతరం జిల్లా పరిధిలో కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియపై సమగ్ర నివేదికలను సమర్పించారు. ఇప్పటివరకు జరిగిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్‌లో ఉన్న కేసులు, కోర్టు వివాదాలు, రైతుల అభ్యంతరాలు తదితర అంశాలపై వివరాలు వెల్లడించారు. భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో క్షుణ్ణంగా వివరించారు. అనంతరం నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా ప్రాజెక్టుల పురోగతిని వివరించారు.

ఈ సమావేశంలో సాగు నీటి ప్రాజెక్టుల ఎస్సీలు, ఈఈలు, ఏఈలు, ఆర్డీవోలు, తహసిల్దార్లు, రెవెన్యూ అధికారులు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
........................................................
జారీ చేయువారు: డీపీఆర్ఓ/జోగులాంబ గద్వాల జిల్లా.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333