సరిపోను యూరియా అందక అన్నదాత హరిగోస
బురద నుంచి బువ్వ ను తీస్తున్న ప్రకృతి శాస్త్రవేత్త కు ఎన్ని కష్టాలు... మరిన్నో నష్టాలు...!
ఉద్దెర కు అడుగుతుండ్రా...! ఉచితంగా ఇవ్వమంటుండ్రా... డబ్బులకే కదా అడిగేది...!
చదువు అంతంత మాత్రం... ఇంటర్నెట్ సరిగా ఉండదు... టచ్ ఫోన్లు అందరికీ లేవు... ఆన్లైన్ చేయమంటూ అందరి కాళ్లు మొక్కుతుండ్రు...!
కష్టాల కడలిలో కాగిపోతున్న కర్షకుల కంటిలో కన్నీరు... పాలకులకేమో పన్నీరు... పురుగుల మందు పెరుగన్నం... వరి కంకులే ఉరి కొయ్యలు...!!!
యూరియా యాప్ ల పాపం ఎవరిది...? ఎవరిని వేడాలి... ఎవరిని వాడాలి.. ఎవరిని అడగాలి... ఎవరిని కడగాలి...!
✍️ డాక్టర్ కృష్ణ బంటు, స్వతంత్ర పాత్రికేయులు, రాష్ట్ర ఉత్తమ పాత్రికేయ అవార్డు గ్రహీత, హ్యూమనిస్ట్
వారు ఈ దేశంలోని సుమారు 150 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న అన్నదాతలు. అన్నదాత సుఖీభవ సంగతేమో కానీ అన్నదాతలు నేడు యూరియా కోసం హరిగోస పడుతున్నారు. వారు బురద నుంచి బువ్వ ను తీసే మహత్తరమైన శక్తిని సాధించిన ప్రకృతి శాస్త్రవేత్తలు. అయినప్పటికీ ఈ దేశానికి ఆకలి తీరుస్తున్న వారే నేడు ఎన్నో కష్టాలు, మరెన్నో నష్టాలు అనుభవిస్తున్నారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్టుగా రైతన్నల కష్టాలు రాస్తే రామాయణం అవుతుంది, చెబితే మహా భారతం అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అవకతవకల విధానాల ఫలితంగా రైతులు యూరియా సరిపడా అందక ఇక్కట్లకు గురవుతున్నారు. సరిపడా యూరియా సప్లై కాకపోవడంతో యూరియా కోసం రైతులే కొట్లాటకు దిగి, రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి,యుద్ధాలు చేయాల్సివస్తుంది. వచ్చిన అరకొర యూరియాను రైతులకు నిష్పక్షపాతంగా పంచడానికి అధికారులు చేస్తున్న కృషి బాగానే ఉన్నప్పటికీ గిన్నెలో అన్నం ఉంటేనే కదా అందరికీ పంచేది, అసలు అన్నమే సరిపోయినంత లేనప్పుడు ఎలా పంచుతారు అన్న దానికి యూరియా కూడా ఉదాహరణగా నిలుస్తుంది. యూరియాను ప్రభుత్వాన్ని నుంచి రైతులు ఏమి అప్పు పెట్టమని, ఉద్దెర ఇవ్వమని అడగడం లేదు కదా, పోనీ ఉచితంగా ఇవ్వమని అంటున్నారా, లేదు కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం యూరియా సరిపడ సరఫరా చేయండి మహా ప్రభు అని కాళ్ళ, వేళ్ళ పడుతున్నారు కదా. పారిశ్రామిక పురోగతి సాధిస్తున్నాం, దేశంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది, సరిపడా ఎరువుల కర్మాగారాలు కూడా నిర్మించాం, ఎరువులు సకాలంలో అందిస్తామని పాలకులు ఊదరగొట్టే హామీలే తప్పించి ఆచరణ మాత్రం గుండు సున్న. కాలికి తడి అంటకుండా సముద్రాన్ని ఈద వచ్చేమో కానీ రైతు కంట కన్నీరు పెట్టకుండా వ్యవసాయాన్ని చేయలేం అన్నది అక్షర సత్యం. వ్యవసాయం ప్రపంచీకరణ ఒకవైపు, ఆధునీకరణ ఇంకోవైపు, యాంత్రికరణ మరోవైపు, ఇలా ఎడా పెడ రైతులను నలు దిక్కులా పాలకుల విధానాలు కుల్లబొ డుస్తుంటే, కుక్కి చంపుతుంటే ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి, ఎంతసేపని వేడుకోవాలి, ఇలా జీవితం మొత్తం రైతన్నలు వ్యవసాయం చేయడానికి కావలసిన ఎరువులు, పురుగు మందుల కోసం ప్రాధేయపడటం ఈ జన్మకైనా తప్పుతుందా. ఇలాగే కొనసాగితే వ్యవసాయం అనేది కనుమరుగు కాక తప్పదని పలువురు అనుభవజ్ఞులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయం చేస్తున్నారు అంటే వివాహం కోసం ఆ ఇంటికి, ఆ అబ్బాయికి, అమ్మాయితో సంబంధం కుదరటం లేదు, అమ్మాయిలకు తల్లిదండ్రులు వ్యవసాయదారులకు తమ అమ్మాయిని కట్టబెట్టడానికి సుముఖంగా ఉండడం లేదు. మరి వ్యవసాయం అంతరిస్తే టాబ్లెట్ తిని బతుకుతారా, కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా, మరి ఆ కూడే దొరికినప్పుడు నువ్వు సంపాదించిన కోట్లు ఎవరికోసం, ఎందుకోసం, బొంద మీద వేసుకొని సంతోష పడటానికి, స్మశానకాష్టంలో చల్లి ఆనందపడతానికి అని ఈ సమాజం ప్రశ్నించక మానదు. తిండి కలవాడీకే కండగలదు, కండగలవాడే అసలైన మనిషిగా ఉండగలడు మరి అలాంటి ఉక్కు నరాలతో దృఢత్వం గల మనుషులుగా తయారు కావాలంటే ఆహారం కంపల్సరీ కదా. మరి అలాంటి ఆహారం దొరకాలంటే రైతులు వ్యవసాయం చేయాలి కదా. వ్యవసాయం చేయాలి అంటే రైతులకు అన్ని రకాలుగా విత్తనాల వద్ద నుంచి ఎరువులు, పురుగుమందులు, సబ్సిడీలు, రైతుబంధు, పంట సహాయం ప్రభుత్వం అందిస్తేనే కదా రైతు సంతోషంతో వ్యవసాయం చేసి దిగుబడులు పెంచేది. అసలు ప్రపంచ దేశాల్లో వ్యవసాయం చేసేవారు అంటే ఆయా దేశాల ప్రజలు రైతులను ఎంతో గౌరవిస్తారు. కానీ మనదేశంలో రైతులు దేనికి కొరగావడం లేదు. అసలు భారతదేశంలో రైతులకు వరి పండించే వారికి కేవలం 6 నెలలే చేతినిండా పని ఉంటుంది రెండు పంటలకు. మరి మిగతా సమయం అంతా రైతులు ఏమి చేయాలి, ఇంకా ఏ వృత్తి లోకి వెళ్ళాలి. ఇప్పటికే కష్టాల కడలిని ఈదుతున్న రైతన్నలు ప్రకృతి కరుణించకో, పాలకుల దయాదాక్షిన్యాలు లేకనో అప్పులపాలై పీకల్లోతు కష్టాల్లో ఉండి పురుగుల మందే పెరుగన్నం లాగా భావించి వరికంకులే ఊరి కొయ్యలుగా ప్రాణాలను వదిలేస్తున్నారు. ఇంకా ఎంతకాలం ఈ రైతుల మరణం మృదంగం. రైతుల చావులకు అంతం లేదా, ఆగవా. ఎన్నాళ్లు కష్టాలు పెడదాము రైతులను, పాలకులారా ఆలోచించండి. అసలు ప్రపంచంలో పంటలు పండించని దేశాలలో పరిస్థితులు కరోనా సంభవించినప్పుడు ఎంత ఘోరంగా ఉన్నాయో ఆలోచించండి మరి. మన దేశం అన్ని కోట్ల మందికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆహారం సరఫరా అయింది అంటే అది రైతన్న ఘనతనే కదా.
పెద్ద ఫోను లేదు, ఇంటర్నెట్ రాదు, చదువు అంతకన్నా లేదు, మరి యాప్ లో బుక్ చేయడం ఎలాగా...!
ఈ దేశంలో నిరక్షరాస్యత ఎక్కువ. ముఖ్యంగా రైతులలో మరింత ఎక్కువ శాతం చదువు రానివారే. ఈ దేశంలో రైతన్నల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఏ ఏటికి ఆ ఏడు వ్యవసాయ పెట్టుబడులు అప్పుగా తేవటం, పంట రాగానే సేటు దగ్గర అప్పులు కట్టడం , చిల్లి గవ్వ మిగలక ఇంటికి బిక్క మొఖం వేసుకొని రావటం ఇవే కదా ఈ దేశంలో రైతుకు మిగిలిన ఆభరణాలు. కనీసం పెద్ద మొబైల్స్, టచ్ మొబైల్స్ వాడితేనే కదా యాప్ లో బుక్ చేసేది యూరియా కోసము. అందులోనూ తమ నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కూడా ఉండాలి కదా. ఇంటర్నెట్కు కూడా నెల నెల డబ్బులు కు కట్టాలి కదా. అంటే మరి రైతులు పెద్ద ఫోను మెయిన్ టెన్ చేయాలి, అందులో నెట్ బ్యాలెన్స్ ఉండాలి, తగినంత సిగ్నల్ రావాలి, ఎన్ని ఉన్నా చదువు తప్పక వచ్చి ఉండాలి, అప్పుడు మాత్రమే రైతులు తమకు తెలియని యూరియా యాప్ ను ఏదో విధంగా ఓపెన్ చేసి, లేదా ఇతరులను బతిమిలాడి యూరియా బుక్ చేసుకుంటే వచ్చేది పాస్ పుస్తకాల ప్రకారం ఒకటి రెండు యూరియా కట్టలు. అవి తీసుకొని పోయి పొలంలో ఏ మొక్కకు వేయాలి ఏ మొక్కకు వేయవద్దు. పొలమంతా సరిపోతుందా. మరి అసలే పాసుపుస్తకాలు లేని కౌలు రైతుల పరిస్థితులు కూడా కష్టాల మయమే కదా. ఆరుగాలం కష్టపడే అన్నదాత కష్టాలు తీర్చే ది ఎవరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి కంటి తడుపు చర్యలుగానే మిగులుతున్నాయి తప్పించి రైతులకు సరిపడా ఎరువులు అందించడంలో విఫలమవుతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నానో యూరియాను పంటలకు వాడేలా రైతులకు అలవాటు చేయడానికి అసలు యూరియా సరఫరా ఆపుతున్నారా అని రైతుల్లో అనుమానాలు
ఇటీవల అనేక కంపెనీలు నానో యూరియా అంటే చిన్న యూరియాను సరఫరా చేస్తున్నాయి. నానో యూరియా వాడటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతులకు చెబుతున్నారు. వాస్తవానికి ఎప్పటిలాగానే ఉండే పెద్ద యూరియాను రైతులకు అందకుండా చేస్తే తప్పని పరిస్థితుల్లో చిన్న యూరియాకు రైతులు అలవాటు పడతారు కదా అని ఎరువుల కంపెనీలు ఆలోచించి రైతులకు సరిపడా ఎప్పుడు ఇచ్చే విధంగా యూరియాను ఇవ్వకుండా కట్టడి చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే యూరియా రేట్లు పెరిగి రైతులు ఆందోళనకు గురి అవుతుండగా చిన్న యూరియా ఇంకా ఎక్కువ ధర ఉండడంతో రైతులు అటువైపు మొగ్గు చూపడం లేదు. దీంతో చిన్న యూరియాను తయారు చేసే అనేక కంపెనీలు తమ ఉత్పత్తులు అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో పాలకులను ఆశ్రయించారని, నానో యూరియా కూడా పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటుందని ప్రచారం చేస్తున్నప్పటికీ రైతులు మాత్రం తాము ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా వాడే మామూలు యూరియాకి వైపు మల్లుతున్నారు. దీంతో పెద్ద యూరియాను సప్లై తగ్గించిన కంపెనీలు సరిపడా సరఫరా చేయకనే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా చర్చించి ఆలోచించి రైతులకు యూరియా కష్టాలు తప్పేటట్లు చేయాలని మనమూ కోరుకుందాం. మనకు ఆహార అందించి మనల్ని బతికించే రైతన్నను మనమూ బతికించుకుందాం.